Banana: అరటి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదైనా వీళ్లు మాత్రం తినకూడదు
Banana: రోజూకో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిజానికి అరటిపండులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం అరటిపండ్లను తినకపోవడమే మంచిది.

అరటిపండు
అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లు ప్రతి సీజన్ లో దొరుకుతాయి. చాలా మందికి రోజుకో అరటిపండును తినే అలవాటు ఉంటుంది. ఈ పండులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండును తినడం వల్ల తక్షణమే ఎనర్జీ వస్తుంది. అలాగే హార్ట్ హెల్తీగా ఉంటుంది. వీటితో పాటుగా అరటిపండును తినడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయి. కానీ అరటిపండును కొంతమంది మాత్రం తినకూడదు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అరటిపండును ఎవరు తినకూడదు?
డయాబెటీస్ ఉన్నవారు
డయాబెటీస్ పేషెంట్లు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి. అలాగే బాగా పండిన అరటిపండును అస్సలు తినకూడదు. వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
కిడ్నీ సమస్యలు
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా అరటిపండ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరగొద్దు అనుకునే వారు
అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బరువును మరింత పెంచుతాయి. కాబట్టి మీరు గనుక బరువు తగ్గాలనుకున్నా, బరువు కంట్రోల్ లో ఉండాలన్నా అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. అరటిపండ్లు బరువు పెరగాలనుకునేవారికి సహాయపడతాయి.
మలబద్దకం
మలబద్దకం సమస్య ఉన్నవారు కూడా అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే అరటిపండును తింటే మలబద్దకం సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే విరేచనాలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్నప్పుడు కూడా అరటిపండును తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి సమస్యలున్నవారు కూడా అరటిపండ్లను తినకూడదు.
దంత సమస్యలు
దంత సమస్యలున్న ఉన్నవారు కూడా అరటిపండ్లను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటిలో జిగటగా ఒక పదార్థం ఉంటుంది. ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది. పళ్లను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.