వీళ్లు చాయ్ ని అస్సలు తాగొద్దు
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు రోజుకు మూడు నాలుగు సార్లు కూడా చాయ్ ని తాగేవారున్నారు. కానీ కొంతమంది మాత్రం చాయ్ ని అస్సలు తాగకూడదు. వాళ్లు ఎవరంటే?

చాయ్
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇష్టంగా తాగే పానీయాల్లో చాయ్ ఒకటి. ఉదయం, సాయంత్రం పక్కాగా చాయ్ ని తాగేవారు ఎంతో మంది ఉన్నారు. ఆఫీసుల్లో పనిచేసేవారు, ఇతర పనులకు వెళ్లేవారైతే ఎప్పుడు పడితే అప్పుడు చాయ్ ని తాగుతుంటారు. చాయ్ వల్ల మనసు రీఫ్రెష్ అవుతుంది. నిద్రమబ్బు పోతుంది. ఇది శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది. అందుకే చాలా మంది టీని తాగుతుంటారు. మితంగా టీని తాగితే ఎలాంటి సమస్య లేదు. నిపుణుల ప్రకారం.. టీ తాగితే కొన్నిఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే కొంతమంది మాత్రం టీని అస్సలు తాగకూడదు. వాళ్లు ఎవరంటే?
హార్ట్ ప్రాబ్లమ్స్
నేటి కాలంలో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. గుండె జబ్బులు ఉన్నవారు టీని తాగకూడదు. ఎందుకంటే టీలో ఉండే కెఫిన్ కంటెంట్ రక్తపోటును పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగాన్ని పెరిగేలా చేస్తుంది. అందుకే మీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే టీని తాగకండి.
నిద్ర సమస్యలు
ఈ రోజుల్లో చాలా మంది నిద్రసమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలా మందికి రాత్రిపూట టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ రాత్రిపూట టీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే దీనిలో ఉంటే కెఫిన్ మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. దీనివల్ల మీ నిద్రలేమి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందుకే మీకు నిద్రకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే గనుక టీని తాగకూడదు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత టీని తాగనేకూడదు. టీ తాగితే నిద్ర సమస్యలు మరింత పెరుగుతాయి.
రక్తహీనత
మగవారికంటే ఆడవారికే రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు కూడా టీని తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చాయ్ లో టానిన్లు ఉంటాయి. ఇవి మన శరీరం ఇనుమును గ్రహించే సామర్థాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య మరింత పెరిగి మీరు అనారోగ్యం బారిన పడతారు. కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు టీని అస్సలు తాగకూడదు.
జీర్ణ సమస్యలు
చాలా మందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. అయితే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే కూడా టీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీలో కెఫిన్ , ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కడుపులో గ్యాస్ ను పెంచుతాయి. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. మీకు ఇదివరకే ఈ సమస్యలు గనుక ఉంటే చాయ్ ని అస్సలు తాగొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గర్భిణులు
గర్భిణులు కూడా చాయ్ ని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీని ఎక్కువగా తాగడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఇది బిడ్డ తక్కువ బరువుతో పుట్టడానికి కూడా కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ లో ఉండే కెఫిన్ ఈ సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.