ఇంట్లో ఎక్కడ చూసినా బల్లులే కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ఒక్క బల్లి కూడా ఉండదు
చాలా మంది ఇండ్లల్లో బల్లులు ఉంటాయి. ఇది సమస్యే కాకపోయినా వీటివల్ల ఇల్లంతా మురికిగా అయిపోతుంది. అందుకే బల్లులను ఇంట్లో లేకుండా చేయడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఓ లుక్కేద్దాం పదండి.

బల్లులను తరిమికొట్టే చిట్కాలు
ఇంట్లో బల్లులు ఉండటం చాలా కామన్. కానీ వీటివల్ల ఇళ్లంతా మురికిగా కనిపిస్తుంది. అలాగే ఇవి మనల్నిఅనారోగ్యం బారిన కూడా పడేస్తాయి. ఈ బల్లులు బాత్ రూం, బెడ్ రూం, కిచెన్ అంటూ ప్రతి గదిలోనూ కనిపిస్తుంటాయి. ఇది చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో ఉష్ణోగ్రతను తగ్గించాలి
బల్లులకు వెచ్చగా ఉండే వాతావరణం ఇష్టం. అందుకే ఇవి ఇంట్లో వేడిగా ఉండే మూలల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి బయటి వాతావరణంలో ఉండలేవు కాబట్టే ఇంట్లోకి వస్తుంటాయి. అయితే మీరు మీ ఇంట్లో బల్లులు లేకుండా చేయాలంటే మాత్రం ఎయిర్ కండీషనర్లు, లేదా ఫ్యాన్లను ఉపయోగించండి.
అంటే ఇంటిని చల్లగా చేయండి. దీనివల్ల మీ ఇంట్లో బల్లులు లేకుండా పోతాయి. వీటికి చల్లని వాతావరణం నచ్చదు. అందుకే కిటికీలు, వెంటిలేషన్ ను పెంచడం లాంటివి చేస్తే బల్లుల సంఖ్య తగ్గుతుంది.
బల్లులను తరిమికొట్టే మొక్కలు
కొన్ని రకాల మొక్కలు బల్లులకు అస్సలు నచ్చవు. వీటి ఘాటైన వాసన బల్లులు లేకుండా చేస్తాయి. లెమన్ గ్రాస్, పుదీనా, యూకలిస్టస్ వంటి మొక్కలతో బల్లులను తరిమికొట్టొచ్చు. బల్లులు ఇంట్లో లేకుండా పోవాలంటే ఈ మొక్కలను బాల్కనీ, ఇంటి గుమ్మం, కిటికీల దగ్గర పెట్టండి. ఇవి బల్లులను ఇంట్లో నుంచి పారిపోయేలా చేయడమే కాకుండా మీ ఇంటిని అందంగగా చేస్తాయి. అలాగే మంచి వాసన వచ్చేలా చేస్తాయి.
ఎల్ఈడీ లైట్లు
బల్లులు కీటకాలను తినేందుకే ఇండ్లలోకి వస్తాయి. ఈ కీటకాలు ఎక్కువగా డల్లుగా ఉండే లైట్ల చుట్టే ఎక్కువగా గుమిగూడుతాయి. కాబట్టి మీ బాల్కనీ, హాల్ వంటి ప్రదేశాల్లో తెల్లని ఎక్కువ ప్రకాశవంతమైన ఎల్ఈడీ లైట్లను వేయండి. ఇది కీటకాలను తగ్గిస్తుంది. దీంతో బల్లులకు ఆహారం తగ్గుతుంది. దీంతో బల్లులు ఇంట్లో నుంచి వేరే చోటుకు వెళతాయి. ఈ ఎల్ఈడీ బల్బులు కరెంటును కూడా ఆదా చేస్తాయి.
బల్లులు రాకుండా చేయండి
బల్లులు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తున్నాయో తెలుసుకోండి. ఇవి ఎక్కువగా తలుపులు, కిటికీల నుంచి, గోడల పగుళ్ల నుంచి వస్తాయి. కాబట్టి వీటిని మూసేయండి. కిటికీలకు మెష్ స్క్రీన్లను ఇన్ స్టాల్ చేంయడి. ఇకపోతే తలుపుల కింద వెదర్ స్ట్రిప్ లను పెట్టండి. దీనివల్ల ఇంట్లోకి బల్లులు రావడం తగ్గుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయలను వాడండి
వెల్లుల్లి, ఉల్లిపాయతో ఇంట్లో ఉన్న బల్లులు పారిపోయేలా చేయొచ్చు. ఎందుకంటే వీటి ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. ఇందుకోసం ఉల్లి, వెల్లుల్లి రెబ్బలను ముక్కలుగా చేసి తలుపుల దగ్గర వేలాడదీయండి. అలాగే బల్లులు ఎక్కువగా ఉండే ఇంటి మూలల్లో పెట్టండి. వీటి వాసన నచ్చక బల్లులు అక్కడి నుంచి పారిపోతాయి.