ఇది తెలిస్తే ఎండాకాలంలో చల్లని పాలే తాగుతారు..
వేడి పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ మండుతున్న ఎండాకాలంలో వేడిగా తినాలనిపించదు. తాగాలనిపించదు. అయితే చాలా మందికి వేడి వేడి పాలను తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
పిల్లలే కాదు పెద్దలు కూడా రెగ్యులర్ గా పాలను తాగుతుంటారు. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. చాలా మంది ఉదయం తాగితే.. మరికొంతమంది రాత్రిపూట పడుకునే ముందు తాగుతుంటారు. కానీ ప్రతి ఒక్కరూ వేడి వేడి పాలనే తాగడానికి ఇష్టపడతారు. కానీ ఎండాకాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోటీన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉండే పాలు చల్లారిన తర్వాత తాగితే ఛాతీ, కడుపునొప్పి, హైబీపీ, నిద్రలేమి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అసలు ఎండాకాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఛాతీ, కడుపు చికాకు నుంచి ఉపశమనం
ఎండాకాలంలో చాలా మంది గుండెల్లో మంట, కడుపు చికాకు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో కాల్షియం పుష్కలంగా ఉండే పాలు అదనపు ఆమ్లాన్ని గ్రహించడంలో, ఆమ్లం ఏర్పడకుండా నిరోధించడంలో చాలా ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. అందుకే మీరు కూడా జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే చల్లటి పాలను తాగండి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కలిగే చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర
చల్లని పాలను తాగడం వల్ల మీకు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. కూల్ పాలను తాగడం వల్ల బీపీలో హెచ్చుతగ్గుల సమస్య ఉండదు. దీంతో మీ శరీరం రిలాక్స్ అవుతుంది. అంతేకాదు రోజంతా ఉల్లాసంగా ఉంటారు. చల్ల పాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.
హైబీపీ సమస్యకు మేలు
హైబీపీని నియంత్రించడంలో చల్లని పాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలో ఒత్తిడి హార్మోన్లను కూడా తగ్గిస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందుకే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు చల్లని పాలనే తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి..
బరువు తగ్గేవారికి కూడా చల్లని పాలు మంచి మేలు చేస్తాయి. ప్రతి రోజూ వ్యాయామం, హెల్తీ ఆహారంతో పాటుగా చల్లటి పాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. చల్లని పాలను తాగడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. ఇది అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీ ఆకలిని తగ్గిస్తుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గుతారు.