- Home
- Life
- Food
- మార్కెట్లో చికెన్ దొరకడం లేదా.? మిల్మేకర్ కర్రీని ఇలా చేశారంటే చికెన్ కూడా బలాదూర్ అనాల్సిందే
మార్కెట్లో చికెన్ దొరకడం లేదా.? మిల్మేకర్ కర్రీని ఇలా చేశారంటే చికెన్ కూడా బలాదూర్ అనాల్సిందే
Recipe: సమ్మె పేరుతో చికెన్ దుకాణాలు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఇతర నాన్ వెజ్ ఐటమ్స్ వైపు చూస్తున్నారు. అయితే మిల్మేకర్ కర్రీని ఇలా చేస్తే చికెన్ కూడా బలాదూర్ అనాల్సిందే. మిల్మేకర్ కుర్మాను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మిల్మేకర్లను నాబబెట్టాలి
ముందుగా ఒక కప్పు మిల్మేకర్లను (సోయా చంక్స్) తీసుకుని, వాటిలో వేడి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి సుమారు 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మిల్మేకర్లు మెత్తబడి, మసాలాలను బాగా పీల్చుకుంటాయి. 15 నిమిషాల తర్వాత వాటిలోని నీటిని పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా పేస్ట్ తయారీ
ఈ కుర్మాకు అసలైన రుచిని ఇచ్చేది మనం తయారుచేసే మసాలా పేస్ట్. ఇందుకోసం మిక్సీ జార్‌లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తాజా మసాలా వాసన చికెన్ కర్రీ కంటే అద్భుతంగా ఉంటుంది.
మిల్మేకర్లను వేయించుకోవాలి
ఆ తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి, నీరు పిండేసిన మిల్మేకర్లను, చిటికెడు పసుపు వేసి ఒక్క నిమిషం పాటు వేయించి పక్కకు తీసుకోవాలి. అదే పాన్ లో మరికొంత నూనె వేసి బిర్యానీ ఆకు, షాజీరా వంటి పోపు దినుసులు వేసి, మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ ని వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మసాలా మాడకుండా చూసుకోవాలి, లేదంటే కూర చేదు వస్తుంది.
గ్రేవీకి అసలైన మెరుగులు
వేయించిన మసాలాలో రెండు టమోటాల పేస్ట్ వేసి బాగా ఉడికించాలి. టమోటా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. మసాలాలు మాడకుండా ఉండటానికి కొన్ని నీళ్లు పోసి నూనె తేలే వరకు ఉడికించాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న మిల్మేకర్లను వేసి, ఒక కప్పు నీళ్లు పోసి 8 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి.
ఫినిషింగ్ టచ్
ఉడికిన తర్వాత, మంట తగ్గించి అరకప్పు చిక్కటి పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు గ్రేవీకి మంచి టెక్స్చర్, రుచిని ఇస్తుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, క్రష్ చేసిన కసూరీ మేథీ, కాస్త నిమ్మరసం పిండితే, వేడి వేడి స్పైసీ మిల్మేకర్ కుర్మా రడీ అయినట్లే. ఈ కుర్మాను అన్నం, చపాతీ లేదా పూరీలతో తింటే అద్భుతంగా ఉంటుంది. చికెన్ అందుబాటులో లేని సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్లు లభించే ఈ వంటకాన్ని ఈ సండే రోజు తప్పక ప్రయత్నించండి.

