Pickle Preservation: అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు పాటిస్తే.. ఏడాది పాటు ఊరగాయ నిల్వ
Pickle Storage Hacks: ఎండాకాలంలో ఎంతో ఇష్టంగా చేసుకున్న ఊరగాయ వర్షాకాలంలోనే పాడవుతుందా? ఇలా కాకుండా ఊరగాయలు ఏడాది పాటు నిల్వ చేసేందుకు ఈ టిప్స్ ఫాలోకండి. ఈ చిట్కాలు పాటిస్తే ఊరగాయలు వచ్చే సీజన్ వరకు తాజాగా ఉంటాయి.

ఊరగాయ ఉంటే చాలు..
వంట రుచి తగ్గినా లేదా మనకు నచ్చిన కర్రీ లేకపోయినా ఒక చెంచా ఊరగాయ ఉంటే చాలు లొట్టలేస్తూ భోజనం చేస్తాం. కొంతమందికి అయితే ఊరగాయ లేకుండా భోజనం పూర్తయిందన్న భావనే రాదు. నేటి మార్కెట్లో అనేక రకాల తయారు ఊరగాయలు అందుబాటులో ఉన్నాయి. కానీ, మన ఇంట్లో తయారుచేసిన ఊరగాయలకున్న రుచి, వాసన వాటిని ఉండదు.
ఊరగాయ నిల్వ చేసే పద్ధతి
ఇంట్లో తయారుచేసిన ఊరగాయ రుచి మామూలుగా ఉండదు. అయితే, చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏమంటే ఈ ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఊరగాయ పాడుకాకుండా, రుచి మారకుండా ఏడాది పాటు కూడా నిల్వ ఉంటుంది.
వెడల్పు డబ్బాలో నిల్వ
ఊరగాయ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే వెడల్పుగా ఉన్న డబ్బాలను వాడాలి. డబ్బా పూర్తిగా నింపాలి, దీనివల్ల డబ్బా లోపల గాలి ఉండదు. డబ్బా లోపల గాలి ఆడితే ఊరగాయ త్వరగా పాడవుతుంది. ఊరగాయ తయారుచేసేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు కలపకూడదు. కొంచెం నీరు కలిసినా ఒకటి రెండు నెలల్లో ఊరగాయ చెడిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఊరగాయ ఏడాది పాటు నిల్వ ఉంటుంది.
లోహపు పాత్రల్లో నిల్వ చేయకూడదు
ఊరగాయను ఎట్టి పరిస్థితిలో లోహపు పాత్రల్లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే అది ఊరగాయలోని పులుపు, ఉప్పుతో రసాయనిక చర్యకు గురై, ఊరగాయ రుచి మారిపోవడమే కాదు, త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అలాగే, లోహపు చెంచా వాడకూడదు. ప్లాస్టిక్ చెంచా ఉపయోగించాలి. తడి చెంచా వల్ల కూడా ఊరగాయ త్వరగా చెడిపోతుంది.
శుభ్రతే కీలకం
ఊరగాయను నిల్వ చేసే ముందు డబ్బాను బాగా కడిగి, శుభ్రంగా ఆరబెట్టాలి. చివరిగా వేడి నీటితో కడగడం మంచిది. లోపల నీటి తేమ ఎక్కడా లేకుండా చూసుకోవాలి. సందేహం ఉంటే ఓవెన్‌లో ఉంచి ఆరబెట్టొచ్చు. డబ్బాలోపల భాగాన్ని శుభ్రమైన బట్టతో తుడిచి పూర్తిగా ఎండిన తర్వాతే ఊరగాయ నింపాలి.
ఎలాంటి ప్రదేశం నిల్వ చేయాలి?
ఊరగాయ నింపిన డబ్బాను తడి ఉన్న ప్రదేశంలో ఉంచకూడదు. ఎప్పుడూ ఎండబెట్టిన లేదా పొడిగా ఉండే చోటనే ఉంచాలి. తడి ప్రదేశంలో ఉంచితే ఊరగాయ త్వరగా పాడవుతుంది. కాబట్టి ఊరగాయ జాడీ లేదా డబ్బా ఉంచే ప్రదేశం ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఊరగాయ ఎక్కువ రోజుల పాటు తాజాగా నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
చిన్న డబ్బాలలో నిల్వ
ఒకేసారి ఎక్కువ ఊరగాయ తయారుచేస్తే మొత్తం ఒకే డబ్బాలో పెట్టకండి. కొన్ని రోజులకు సరిపడా భాగాన్ని చిన్న డబ్బాలో నింపండి. పెద్ద డబ్బా నుండే తరచూ తీస్తే గాలి ఆడి ఊరగాయ త్వరగా పాడవుతుంది. డబ్బా మూత సరిగా లేకపోతే. శుభ్రమైన బట్ట కట్టి మూత వేయండి. ఇలా చేయడం వల్ల గాలి ఆడకుండా, ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.