చికెన్ పకోడీలాగే చేప పకోడీ ఇలా చేశారంటే క్రంచీగా కరకరలాడించేయొచ్చు, రెసిపీ ఇదిగో
ఆదివారం వచ్చిందంటే చేపలు, చికెన్, మటన్ ఇలా ఇంట్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం ఉండాల్సిందే. ఇక్కడ మేము చేప పకోడీ క్రిస్పీగా, టేస్టీగా ఎలా చేయాలో ఇచ్చాము. రెసిపీ ఫాలో అవ్వండి.

టేస్టీ చేప పకోడీ
ఆదివారం చేపలు తినాలా? చికెన్ తినాలా? మటన్ తినాలా? అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము చేప పకోడీ రెసిపీ ఇచ్చాము. మీకు నచ్చితే ఆదివారం ప్రయత్నించండి. దీన్ని చేయడం చాలా సులువు. నిజానికి చికెన్, మటన్ పకోడీ కన్నా చేప పకోడీ టేస్టీగా జ్యూసీగా క్రిస్పీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. చేప పకోడీ చేయడం కూడా చాలా సులువు. దీనికి మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. త్వరగానే చేప ముక్కలు వేగిపోతాయి. కాబట్టి రెసిపీ తెలుసుకోండి.
చేప పకోడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఎముకలు లేని చేప ముక్కలను అరకిలో తీసుకోండి. కొత్తిమీర తరుగు ఒక స్పూను, నూనె డీప్ ఫ్రై వేయించడానికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నిమ్మరసం ఒక స్పూను, గరం మసాలా పావు స్పూను, ధనియాల పొడి ఒక స్పూను, పసుపు అర స్పూను సిద్ధం చేసుకోండి. అలాగే జీలకర్ర పొడి అర స్పూను, కారం ఒక స్పూను, పచ్చిమిర్చి తరుగు ఒక స్పూను, బియ్యప్పిండి రెండు స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను రెడీ చేసుకోండి.
ఫిష్ పకోడి ఇలా చేసేయండి
చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి. ముక్కలు మరీ పెద్దగా ఉండకూడదు. పకోడీలు ఏ సైజులో రావాలనుకుంటున్నారో ఆ సైజులో మీరు వీటిని కట్ చేసుకోవాలి. చేప ముక్కల్లోనే నిమ్మరసం, ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండిని, బియ్యప్పిండిని వేసి బాగా కలపండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తురుము, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాలపొడి వేసి బాగా కలపండి. చేపల్లో కొంత ఉప్పు వేశారు కాబట్టి మరికొంత ఉప్పు ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి. పకోడీకి ఎంత మందంగా మీరు పెట్టిన కలుపుకుంటారో అంతే మందంగా ఈ పిండిని కలపండి. ఇప్పుడు ఈ శెనగపిండి మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేయండి. ఈ చేప ముక్కలను బాగా కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచండి.
నూనెలో వేయించి
ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి. ఆ నూనె బాగా వేడెక్కాక ఫ్రిజ్ లోంచి శెనగపిండి చేపల మిశ్రమాన్ని తీసి వాటిని పకోడీల్లాగా వేయించుకోండి. చేపలు త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోండి. టిష్యూ పేపర్ తో ఒకసారి నొక్కితే అదనపు నూనెను అది పీల్చేసుకుంటుంది. ఇప్పుడు పైన కొత్తిమీర తరుగును చల్లుకోండి. అంతే టేస్టీ చేప పకోడీ రెడీ అయినట్టే. ఒక్కసారి దీన్ని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఇది.
అదరిపోయే పకోడీ
చికెన్ పకోడీ, రొయ్యల పకోడీ, మటన్ పకోడీ కన్నా చేప పకోడీ ఇంకా రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీరు చేప పకోడీ చేసుకుని చూడండి. సండే స్పెషల్ గా ఈ వంటకం అదిరిపోవడం ఖాయం. పైగా రెసిపీ కూడా చాలా సులువు.