Healthy Breakfast: ఉదయాన్నే ఈ టిఫిన్స్ తింటే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు!
ఆరోగ్యంగా ఉండడానికి ఉదయం తినే ఆహారం చాలా ముఖ్యమైనది. కొన్ని రకాల టిఫిన్స్.. రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడతాయి. మరి ఉదయాన్నే ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ చూద్దాం.

ఇడ్లీ, సాంబార్:
బియ్యం, మినప పప్పుతో తయారు చేసిన ఇడ్లీ, ఆవిరిలో ఉడికించడం వల్ల చాలా తక్కువ నూనెను కలిగి ఉంటుంది. ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తినవచ్చు. సాంబార్‌లోని పప్పు, కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. కొబ్బరి చట్నీ ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అందుతాయి.
పెసరట్టు:
ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో పెసరట్టు ముందుంటుంది. పెసరట్టును పచ్చి పెసరపప్పుతో తయారు చేస్తారు. ఇది ప్రోటీన్ అధికంగా ఉండే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్. దోశలా కనిపించినప్పటికీ.. దీని రుచి ప్రత్యేకమైనది. పెసరపప్పులో ఐరన్, ఫైబర్, పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం చట్నీతో తింటే.. దాని రుచి మరింత పెరుగుతుంది.
బిసిబెలె బాత్:
బిసిబెలె బాత్ అన్నం, తోటకూర పప్పు, ఇతర కూరగాయలతో తయారు చేస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఉపయోగించే మసాలాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలామంది దీన్ని నెయ్యి, కారాబూందితో తింటారు.
పొంగల్:
సులభంగా తయారు చేసే రుచికరమైన వంటకం పొంగల్. అన్నం, పెసరపప్పుతో తయారు చేసిన దీన్ని మిరియాలు, జీలకర్ర, నెయ్యితో తాలింపు వేస్తారు. మిరియాలు, జీలకర్ర జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పొంగల్‌లోని నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులను, పెసరపప్పు ప్రోటీన్‌ను అందిస్తుంది. వంకాయ కూర లేదా కొబ్బరి చట్నీతో తినవచ్చు.
రవ్వ ఇడ్లీ:
రవ్వ ఇడ్లీ తయారు చేయడానికి సాధారణ ఇడ్లీ లాగా పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ స్టంట్ గా చేసుకోవచ్చు. రవ్వ, పెరుగు, కొన్ని మసాలా దినుసులతో తయారు చేసిన రవ్వ ఇడ్లీ.. చాలా మృదువుగా, రుచికరంగా ఉంటుంది. ఇడ్లీ పిండి లేనప్పుడు.. రవ్వ ఇడ్లీ మంచి ప్రత్యామ్నాయం. దీనికి బంగాళదుంప కూర, చట్నీ బాగుంటుంది.
దోశ
దోశను ఎక్కువ మంది ఇష్టంగా తింటారు. మినపప్పు, బియ్యంతో తయారయ్యే దోశ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో తినవచ్చు. దోశలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉండడానికి సహాయపడతాయి.