Soil Smell: వర్షం తర్వాత వచ్చే మట్టివాసనకు ప్రత్యేకమైన పేరు ఉందని తెలుసా?
Soil Smell: వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన అంటే చాలా మందికి ఇష్టం. కొందరైతే ఆ మట్టి కూడా తింటూ ఆస్వాదిస్తారు. వర్షం పడే ముందు ముందు మనల్ని పలకరించేది ఆ మట్టి వాసనే. అయితే ఈ వాసనకు కూడా ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అదెంటో తెలుసా?

అసలు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది?
వర్షానికి ముందు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నేలలోని కొన్ని మొక్కల నూనెలు, ఇతర సేంద్రియ పదార్థాలు మట్టి, రాళ్ల ఉపరితలంపై పేరుకుపోతాయి. అదే సమయంలో మట్టిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జియోస్మిన్ (Geosmin) అనే ప్రత్యేకమైన వాసన వెదజల్లుతాయి. తడిసిన నేల నుంచి వచ్చే ఆ ‘ఎర్తీ’ వాసనలో జియోస్మిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వాన చినుకులు పడగానే వాసన గాలిలోకి ఎలా వస్తుంది?
వాన చినుకు పొడి నేలపై పడినప్పుడు చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడి పగిలిపోతాయి. ఈ ప్రక్రియలో మట్టిలో ఉన్న సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవుల నుంచి వచ్చే పదార్థాలు, జియోస్మిన్ వంటి వాసన కలిగించే సమ్మేళనాలు సూక్ష్మ కణాలతో కలిసి గాల్లోకి చేరవచ్చు. అందుకే వర్షం మొదలైన కొద్దిసేపటికే మన ముక్కుకు ఆ మట్టి వాసన తగులుతుంది.
తొలకరి వానకు ఈ వాసన ఎందుకు ఎక్కువగా ఉంటుంది?
చాలా రోజుల పాటు వర్షం పడకుండా నేల పొడిగా ఉన్నప్పుడు కొన్ని వాసన కలిగించే పదార్థాలు ఉపరితలంపై పేరుకుపోతాయి. ఆ తర్వాత వర్షం పడితే అవి ఒక్కసారిగా గాల్లోకి రావడంతో వాసన వస్తుంది. అందుకే ఎండాకాలం తర్వాత వచ్చే తొలకరి జల్లులు పడి మట్టి వాసన వస్తుంది. మట్టి వాసన అంటే చాలా మందికి ఇష్టం. కొంతమందైతే ఆ మట్టి కూడా తింటారు. ఆ మట్టి వాసనను ‘పెట్రికోర్ (Petrichor)’ అంటారు. ఈ పదాన్ని 1964లో శాస్త్రవేత్తలు I.J. Bear, R.G. Thomas పరిశోధనలో ఉపయోగించారు.
మరి ‘పెట్రికోర్’, ‘జియోస్మిన్’ రెండూ ఒకటేనా?
కాదు. రెండూ ఒకటే అని అనుకోవడం పొరపాటు. పెట్రికోర్ అనేది వర్షం తర్వాత నేల నుంచి వచ్చే మొత్తం ప్రత్యేకమైన వాసనకు ఉపయోగించే పదం. జియోస్మిన్ మాత్రం ఆ వాసనకు ముఖ్యంగా కారణమయ్యే సమ్మేళనాల్లో ఒకటి. అందుకే వర్షం తర్వాత వచ్చే మట్టి వాసనను కేవలం జియోస్మిన్ అని చెప్పలేం.
మట్టి వాసన అంటే కేవలం మట్టి వాసన మాత్రమే కాదు.. కెమికల్స్, సూక్ష్మజీవులు, మొక్కల అవశేషాలు, వాన చినుకులు కలిసి పనిచేసే ఆసక్తికరమైన ప్రకృతి ప్రక్రియ ఉంది. అందుకే వర్షం పడిన ప్రతిసారి మనకు ఆ మట్టి వాసన అంత ప్రత్యేకంగా అనిపిస్తుంది.

