Ant mill: వందల చీమలు గుండ్రంగా తిరుగుతూ ఎందుకు ప్రాణాలు వదిలేస్తాయి?
Ant mill: ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిలో చీమలు చేసుకునే ఈ సామూహిక ఆత్మహత్యలు కూడా ఒకటి. దీన్ని యాంట్ మిల్ అని పిలుస్తారు. వందల చీమలు మరణించే వరకు గుండ్రంగా తిరుగుతూనే ఉంటాయి.

చీమల వింత ప్రవర్తన
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి యాంట్ మిల్. ఇది చీమల వింత ప్రవర్తన. సాధారణంగా చీమలు ఒకదాని వెంట ఒకటి వరుసగా నడుస్తూ ఆహారం కోసం వెతుకుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో వందల సంఖ్యలో చీమలు ఒకే దారిలో తిరుగుతూ గుండ్రంగా తిరుగుతుంటాయి. ఈ వలయం గంటల తరబడి కొనసాగుతుంది. చివరకు కొన్ని చీమలు అలసిపోయి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ వింత దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యపోతారు. చీమలకు ఇంత తెలివి ఉన్నా ఇలా ఎందుకు చేస్తాయనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.
యాంగ్ మిల్ కు కారణం ఏమిటి?
యాంట్ మిల్ ఏర్పడటానికి ప్రధాన కారణం చీమల వాసనను గుర్తించే విధానం. చీమలు ప్రయాణించే సమయంలో తమ శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన రసాయన వాసన (ఫెరోమోన్స్) విడుదల చేస్తాయి. మిగతా చీమలు ఆ వాసనను అనుసరిస్తూ ముందుకు వెళ్తాయి. సాధారణంగా ఈ విధానం వల్ల చీమలు ఆహారం ఉన్న ప్రదేశానికి సులభంగా చేరుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ముందు వెళ్తున్న చీమలు తప్పు దారిలోకి వెళ్లినప్పుడు, వెనుక ఉన్న చీమలు కూడా అదే వాసనను అనుసరిస్తాయి. అలా ప్రతి చీమ తన ముందు ఉన్న చీమను మాత్రమే అనుసరిస్తూ ఒక వలయంలా తిరగడం మొదలవుతుంది. ఈ సమయంలో వాటికి బయటకు వెళ్లే మార్గం గుర్తించలేకపోతాయి.
అలసటతోనే మరణం
ఈ చీమల వలయం ఏర్పడిన తర్వాత అవి ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి. ఒకదాని వెనుక ఒకటి తిరుగుతూ శక్తిని కోల్పోతాయి. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేకపోవడం వల్ల బలహీనపడతాయి. ఎక్కువ సమయం ఇలాగే కొనసాగితే చీమలు అలసటతో చనిపోతాయి. శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం ఇది చీమల సమూహ ప్రవర్తనలో జరిగే ఒక పొరపాటు మాత్రమే. ఒక చీమ తీసుకున్న తప్పు దారిని మొత్తం సమూహం అనుసరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.చీమలు సాధారణంగా క్రమశిక్షణతో జీవించే జీవులైనా, కొన్ని సందర్భాల్లో వాటి సహకార వ్యవస్థే వాటికి ప్రమాదంగా మారుతుంది.

