విమానంపై పిడుగ పడినా ఏమీ కాదా? ఏడాదికి ఒక విమానంపై ఎన్ని పిడుగులు పడతాయి?
విమానాలపై పిడుగులు పడితే ఏమవుతుంది? భగ్గుమంటూ మండిపోతుందా? అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. విమానంపై పిడుగులు పడతాయి కానీ విమానానికి మాత్రం ఏమీ కాదు. దానికి కారణమేంటో తెలుసా?

విమానంపై పిడుగ పడితే
వర్షం పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తుంటే చాలామంది భయపడతారు. మరి వేల అడుగుల ఎత్తులో మేఘాల మధ్య ప్రయాణించే విమానంపై పిడుగు పడితే పరిస్థితి ఏంటి? విమానంలోని ప్రయాణికులకు ప్రమాదం లేదా? విమానం దెబ్బతినదా? ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి. నిజానికి విమానాలపై కూడా పిడుగులు పడుతుంటాయి. ఒక సాధారణ ప్రయాణికుల విమానంపై ఏడాదికి సగటున ఒకటి నుంచి రెండుసార్లు పిడుగు పడే అవకాశం ఉంటుందని విమానయాన రంగానికి సంబంధించిన అంచనాలు చెబుతున్నాయి. మేఘాల మధ్య ప్రయాణిస్తున్నప్పుడు, విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు జరగవచ్చు. అయితే పిడుగు పడిన ప్రతిసారీ విమానానికి పెద్ద ప్రమాదం జరగదు. దీనికి కారణం విమానాల తయారీలో ఉపయోగించే ప్రత్యేక సాంకేతికత.
విమానాన్ని కాపాడేది ఏది?
విమానాన్ని పిడుగుల నుంచి కాపాడటంలో ఫారడే కేజ్ (Faraday Cage) సూత్రం కీలక పాత్ర పోషిస్తుంది. విమానం బయటి భాగాన్ని ఎక్కువగా అల్యూమినియం వంటి విద్యుత్‌ను ప్రసారం చేసే లోహాలతో తయారు చేస్తారు. కొన్ని ఆధునిక విమానాల్లో ప్రత్యేకమైన విద్యుత్ ప్రసార పొరలు కలిగిన మిశ్రమ పదార్థాలను ఉపయోగిస్తారు. విమానంపై పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రవాహం లోపలికి వెళ్లకుండా బయటి భాగం మీదుగా ప్రయాణిస్తుంది. విమానం లోపలి భాగం మాత్రం సురక్షితంగా ఉంటుంది. దీన్నే ఫారడే కేజ్ సూత్రం అంటారు. అంతేకాదు, విమానం రెక్కల చివరల్లో, వెనుక భాగంలో స్టాటిక్ విక్స్ (Static Wicks) అనే చిన్న పరికరాలు ఉంటాయి. ఇవి విమానంపై ఏర్పడే అదనపు విద్యుత్‌ను గాలిలోకి విడుదల చేయడంలో సహాయపడతాయి. దీంతో విమానంలోని ప్రయాణికులకు విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం తగ్గుతుంది.
పిడుగు పడ్డాక ఏం చేస్తారు?
అయితే పిడుగు పడినప్పుడు విమానానికి ఎలాంటి నష్టం జరగదని అనుకోవడం సరికాదు. కొన్నిసార్లు విమానం బయటి భాగంలో చిన్న రంధ్రాలు, కాలిన గుర్తులు ఏర్పడవచ్చు. అందుకే విమాన తయారీ సంస్థలు ఇంధన ట్యాంకులు, విద్యుత్ పరికరాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాయి. ఇంధన ట్యాంకుల్లో మంటలు చెలరేగకుండా వాటి నిర్మాణాన్ని జాగ్రత్తగా రూపొందిస్తారు. విమానంలోని రాడార్, సమాచార వ్యవస్థలకు కూడా ప్రత్యేక రక్షణ కవచాలు ఉంటాయి. పైలట్లు వాతావరణ రాడార్ సాయంతో ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే మేఘాలకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. పిడుగు తాకినట్లు గుర్తిస్తే విమానం నేలపైకి వచ్చిన తర్వాత సాంకేతిక నిపుణులు పూర్తిగా తనిఖీ చేస్తారు. ఇలా ఎన్నో రకాల భద్రతా ఏర్పాట్ల వల్ల విమాన ప్రయాణం సురక్షితంగా కొనసాగుతుంది.















