మేఘాలను తాకే అనుభూతి కావాలా? ఏపీలోని ‘వంజంగి మేఘాల కొండ’ల మీదకు వెళ్లండి
దసరా సెలవులు వచ్చేశాయి. పచ్చని ప్రక్రుతిలో సేదతీరాలనుకుంటున్నారా? అయితే వంజంగి కొండల మీదకు వెళ్లండి. వీటిని మేఘాల కొండలు అని కూడా పిలుచుకుంటారు. ఈ కొండమీదకి నిత్యం పర్యాటకులు వెళుతూనే ఉంటారు. ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకోండి.

వంజంగి మేఘాల కొండ వెళ్లారా?
ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు దగ్గర ఉన్న వంజంగి మేఘాల కొండ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చుట్టూ మంచు దుప్పటి కప్పినట్లు ఉండే ఈ ప్రాంతంలో తెల్లవారుజామున ఉదయించే సూర్యుడి లేలేత కిరణాలు, పాదాల కింద తేలియాడే తెల్లటి మేఘాల దృశ్యాలు ఎవరినైనా అక్కడే కట్టిపడేస్తున్నాయి. మేఘాలను చేత్తో తాకుతున్న అనుభూతి ఇక్కడ కలుగుతుంది. మేఘాల మధ్యలోనే నిల్చున్నట్టు అనిపిస్తుంది. అందుకు వంజంగి కొండలను మేఘాల కొండ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తుంటే స్వర్గంలో అడుగుపెట్టినట్టే అనిపిస్తుంది. 2020లో కరోనా లాక్‌డౌన్ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ప్రదేశం, గత నాలుగేళ్లుగా ప్రకృతి ప్రేమికులకు ప్రధాన ఆకర్షణగా మారింది.
చేతికి అందేలా మేఘాలు
సూర్యోదయం వేళ కనిపించే కైలాస శిఖరం అందాలను చూసేందుకు పర్యాటకులు తెల్లవారుజామున మూడు గంటలకే తమ ప్రయాణం మొదలుపెడతారు. లగిసిపల్లి దాటిన తర్వాత దారి చిన్నగా ఉండటంతో వాహనాలు మధ్యలోనే ఆగిపోతాయి. అక్కడి నుంచి చీకట్లో జారుడుగా ఉండే మట్టి రోడ్డుపై దాదాపు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆపై అటవీ కొండ మార్గంలో మరో కిలోమీటరు దూరం రాళ్లు రప్పలను దాటుకుంటూ కొండను చేరుకోవాలి. అయితే అక్కడికి చేరిన తర్వాత కనిపించే అందమైన దృశ్యాలను చూసి పర్యాటకులు తాము పడిన కష్టాన్ని పూర్తిగా మర్చిపోతారు. మేఘాల మన చేతికి అందేంత దూరంలో కంటికెదురుగా కనిపిస్తూ ఉంటాయి.
వంజంగి కొండలను ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం లేదా అనకాపల్లి బస్టాండ్ నుంచి పాడేరుకు నిరంతరం ఆర్టీసీ బస్సులుంటాయి. పాడేరు బస్టాండ్‌కి చేరుకున్నాక, అక్కడి నుంచి లోకల్ ఆటోలు లేదా జీపుల ద్వారా వంజంగి వ్యూ పాయింట్ బేస్ క్యాంప్ లగిసిపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతానికి వేల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నప్పటికీ అక్కడ సరైన మౌలిక వసతులు లేవు. వాహనాల నుంచి ప్రవేశ రుసుము తీసుకుంటున్నా కనీస సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. సన్నటి మార్గాల వల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, చాలామంది సూర్యోదయ సమయానికి కొండపైకి చేరుకోలేకపోతున్నారు. కొండపైకి వెళ్లేందుకు మంచి రహదారి నిర్మిస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.

