Goa Travel Guide : గోవా వెళుతున్నారా..? కేవలం బీచ్ లే కాదు ఈ 5 ప్రదేశాలను తప్పక చూడండి
గోవాలో ప్రసిద్ధ బీచ్ లు, కోటలు, చర్చిలు మాత్రమే కాకుండా పురాతన గుహలు, దేవాలయాలు, వారసత్వ గృహాలు లాంటి చారిత్రక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవి రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.

గోవాలొ టాప్ 5 చారిత్రక ప్రదేశాలు
గోవా అనగానే చాలామంది బీచ్ లు మాత్రమే ఫేమస్ అనుకుంటారు… కాానీ సందర్శించడానికి ఎన్నో చారిత్రక ప్రదేశాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే మీకు అక్కడి బీచ్ లు, కోటలు, చర్చిలు చూసి బోర్ కొడుతోందా..? అయితే మీకోసం కొన్ని ఇతర అద్భుతమైన ప్రదేశాల గురించి సమాచారం అందిస్తున్నాం. వీటిలో గుహలు, దేవాలయాలు, భారీ భవంతులు ఉన్నాయి… అవేంటో ఇక్కడ చూద్దాం.
అర్వాలెం గుహలు
సమయం: ఉదయం 8:15 - సాయంత్రం 5:00
ఉత్తర గోవాలో ఉన్న ఈ పురాతన గుహలను పాండవుల గుహలు అని కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు గోవా వాస్తుశిల్ప ప్రారంభ చరిత్రను తెలుసుకోవచ్చు. అలాగే అర్వాలెం జలపాతాన్ని సందర్శించి పచ్చదనం మధ్య రిలాక్స్ అవ్వొచ్చు.
తంబడి సుర్ల మహాదేవ్ ఆలయం
సమయం: ఉదయం 8:30 - సాయంత్రం 5:30
దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ ఆలయం గోవాలోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటి. కదంబ రాజుల కాలంలో దీనిని నిర్మించారు. 12వ శతాబ్దంలో రాయితో చెక్కిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. చుట్టుపక్కల ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను కూడా చూడొచ్చు.
సఫా మసీదు
సమయం: ఉదయం 9:00 - సాయంత్రం 5:00
పొండాలో ఉన్న సఫా మసీదు, గోవాలోని ఇస్లామిక్ వాస్తుశిల్పాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వాస్తుశిల్పం, నీటి ట్యాంక్ కారణంగా ఇది తప్పక చూడాల్సిన ప్రదేశం. సమీపంలోని మసాలా తోటలను కూడా సందర్శించి స్థానిక వంటకాలను రుచి చూడొచ్చు.
వైస్రాయ్ ఆర్చ్
సమయం: ఉదయం 9:00 - సాయంత్రం 5:00
పాత గోవాలోని వైస్రాయ్ ఆర్చ్‌ను 1597, 1600 సంవత్సరాల మధ్య ఫ్రాన్సిస్కో డా గామా నిర్మించారు. పోర్చుగీస్ గవర్నర్లు మాండోవి నది నుండి పాత గోవాలోకి ప్రవేశించడానికి దీనిని ఉపయోగించారు. నగరానికి అభిముఖంగా ఉన్న వైపున వాస్కోడగామా కోట్ ఆఫ్ ఆర్మ్స్ నుండి తీసుకున్న జింక చిహ్నం, సెయింట్ కేథరిన్ విగ్రహం ఇక్కడ కనిపిస్తాయి.
బ్రగాంజా హౌస్
సమయం: ఉదయం 10:00 - సాయంత్రం 5:00
చందోర్లోని ఈ అద్భుతమైన భవనాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఇంట్లో పురాతన ఫర్నిచర్, పెయింటింగ్స్, షాన్డిలియర్లు, ఒక అందమైన లైబ్రరీ ఉన్నాయి. ఈ ఇంట్లో రెండు విభాగాలు ఉన్నాయి. దీని వాస్తుశిల్పం గోవాలోని పోర్చుగీస్ శకపు ప్రభావాన్ని స్పష్టంగా చూపుతుంది.














