Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Coldest Places : శీతాకాలంలో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతేనే కంగారుపడిపోతున్నాం… అలాంటిది అక్కడ మైనస్ 50 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ నమోదవుతాయట. ఇలా దేశంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే టాప్ 5 ప్లేసెస్ గురించి తెలుసుకుందాం.

ఇండియాలో టాప్ 5 కోల్డెస్ట్ ప్లేసెస్
Coldest Places in India : ప్రస్తుతం శీతాకాలం కొనసాగుతోంది... డిసెంబర్ లోనే తెలుగు రాఫ్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి చంపేస్తుండటంతో సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లనుండి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు... ఇక తెల్లవారుజామను బయటకు వచ్చారంటే అది సాహసమే అని చెప్పాలి. తెలంగాణలో 5 నుండి 10°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఏపీలో అయితే మరీ దారుణంగా 3°C నమోదవుతున్నాయి.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత తారాస్థాయికి చేరింది. అరకు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అయితే గడ్డకట్టే చలి ఉంటోంది... దీంతో దేశంలో ఎక్కడాలేని తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. కానీ భారతదేశంలో -50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి దేశంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
1. సియాచిన్ గ్లేసియర్ (Ladakh)
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అత్యంత చల్లని ప్రాంతాల్లో సియాచిన్ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం కారకోరం పర్వతశ్రేణి పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఏడాదిపొడవునా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలే ఉంటాయి... గరిష్ఠ ఉష్ణోగ్రతలే మైనస్ 10 డిగ్రీలు. అత్యల్పంగా శీతాకాలంలో మైనస్ 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి.
భారత్, పాకిస్థాన్ బార్డర్ లో అత్యంత కీలకమైన ప్రాంతం సియాచిన్. అందుకే ఇంత చల్లటి వాతావరణంలో కూడా భారత సైనికులు ఇక్కడ కాపలా కాస్తారు. వీరికి చలి నుండి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంది... దుస్తులు అందిస్తుంది ప్రభుత్వం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తారు.
2. ద్రాస్ వ్యాలీ (Ladakh)
ఇది భారతదేశంలో రెండో కూలెస్ట్ ప్లేస్... లడఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో ఉంటుంది. ద్రాస్ వ్యాలీలో ఎల్లపుడూ మైనస్ డిగ్రీలోనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. కనిష్ఠంగా మైనస్ 45 డిగ్రీలు, గరిష్ఠంగా మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. సముద్ర మట్టానికి 3280 మీటర్ల ఎత్తులో ద్రాస్ వ్యాలీ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ గుహలున్నాయి.
3. లెహ్ లడఖ్ (Ladakh)
మంచుతో కప్పబడి ఉండే హిమాలయా పర్వతశ్రేణుల్లోని అందమైన ప్రాంతం లెహ్ లడఖ్. ఇది సముద్రమట్టానికి 6000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా మైనస్ 35 డిగ్రీలు... గరిష్ఠంగా మైనస్ 2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ప్రకృతి అందాలకు నిలయమైన లెహ్ పట్టణంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్నా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేశవిదేశాలను నుండి కూడా లెహ్ లడఖ్ కు పర్యాటకులు వస్తుంటారు.
4. స్పితి లోయ (Himachal Pradesh)
హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి లోయ అత్యంత చలి వాతావరణం ఉండే ప్రాంతం. ఇది సముద్ర మట్టానికి 2745 మీటర్ల ఎత్తులో ఉంటుంది... ఇక్కడ ఎక్కువకాలం మైనస్ డిగ్రీస్ లోనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. అత్యల్పంగా మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఈ ప్రాంతంలో నమోదవుతుంటాయి. బౌద్దారామాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.. స్థానిక ప్రజలు కూడా బౌద్దమతాన్ని అనుసరిస్తారు.. అందుకే స్పితి లోయను ''లిటిల్ టిబెట్'' అనికూడా పిలుస్తారు.
5. సేలా పాస్ (Arunachal Pradesh)
ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ లో అత్యంత చల్లని వాతావరణం ఉండే ఈ సేలా పాస్ ఉంది. తవాంగ్ జిల్లాలోని ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 4170 మీటర్ల ఎత్తులో ఉంటుంది... ఇక్కడ శీతాకాలంలో మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

