- Home
- Feature
- పిల్లి మలం నుంచి తయారయ్యే కాఫీ.. ఒక కప్పు అక్షరాల రూ. 5 వేలు. ఇంతకీ స్పెషల్ ఏంటంటే..
పిల్లి మలం నుంచి తయారయ్యే కాఫీ.. ఒక కప్పు అక్షరాల రూ. 5 వేలు. ఇంతకీ స్పెషల్ ఏంటంటే..
Kopi Luwak Coffee: కాఫీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కాఫీలు ఉన్నాయి. అయితే ఒక జంతువు మలం నుంచి సేకరించిన బీన్స్‌తో తయారు చేసే కాఫీ గురించి ఎప్పుడైనా విన్నారా.?

పిల్లి మలంతో
లువాక్ కాఫీ. లేదా కోపీ లువాక్.. ఇది అత్యంత ఖరీదైన కాఫీ. లువాక్ అనేది ఓ రకమైన పిల్లి. దాని ఆధారంగానే ఈ కాఫీకి పేరు వచ్చింది. లువాక్ జాతి పిల్లులు ఎక్కువగా ఇండోనేషియాలో ఉంటాయి. ఈ పిల్లి తోక కోతి తోక మాదిరిగా పొడవుగా ఉంటుంది. స్థానికంగా ఈ జంతువును లువాక్ అని పిలుస్తారు. ఈ కాఫీకి ఉపయోగించే బీన్స్, లువాక్ జంతువు తిన్న తర్వాత జీర్ణక్రియ ద్వారా బయటకు వచ్చినవే.
లువాక్ జంతువు పాత్ర ఏమిటి?
లువాక్ జంతువు సహజంగానే అత్యుత్తమ నాణ్యత ఉన్న కాఫీ చెర్రీలనే ఎంచుకుని తింటుంది. పచ్చిగా ఉన్నవి లేదా తక్కువ నాణ్యత ఉన్నవి తినవు. అందువల్ల ఇది ఒక సహజ క్వాలిటీ చెకర్‌లా పనిచేస్తుంది. దీనివల్ల అత్యుత్తమ బీన్స్ మాత్రమే కాఫీ తయారీలోకి వస్తాయి.
జీర్ణక్రియలో జరిగే ప్రత్యేక ప్రక్రియ
లువాక్ తిన్న కాఫీ చెర్రీలోని గుజ్జు జీర్ణమవుతుంది. కానీ లోపల ఉన్న బీన్స్ మాత్రం పూర్తిగా జీర్ణం కావు. జంతువు కడుపులో ఉండే సహజ ఎంజైములు బీన్స్ పై పని చేస్తాయి. దీనివల్ల కాఫీ కఠినత తగ్గుతుంది. రుచి మృదువుగా మారుతుంది. ప్రత్యేకమైన సువాసన వస్తుంది. ఇదే కోపీ లువాక్ ప్రత్యేకత.
మలంతో బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు?
జీర్ణక్రియ పూర్తయ్యాక బీన్స్ మలంతో కలిసి బయటకు వస్తాయి. వాటిని జాగ్రత్తగా సేకరిస్తారు. శుభ్రంగా కడుగుతారు. ఎండలో ఆరబెడతారు, తరువాత రోస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ తర్వాత కాఫీ పూర్తిగా శుభ్రమైనది. తాగడానికి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
ధర ఎక్కువ
కోపీ లువాక్ కాఫీ చాలా అరుదైనది. ఆ కారణంగానే ఈ కాఫీ ధర ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు.. లువాక్ తక్కువ మొత్తంలోనే బీన్స్ ఇస్తుంది. సేకరణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ కాఫీ లగ్జరీ కేటగిరీలోకి వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ. 60,000 నుంచి రూ. 70,000 వరకు ఉంటుంది. విదేశీ లగ్జరీ కేఫ్‌లలో ఒక్క కప్ ధర రూ. 3,000 నుంచి రూ. 5,000 వరకు ఉంటుంది. జంతువు మలంతో తయారవుతుందన్న విషయం వింతగా అనిపించినా, రుచి చూసినవాళ్లు మాత్రం దీనిని ప్రపంచంలోనే అత్యుత్తమ కాఫీల్లో ఒకటిగా చెబుతారు.

