Moral Story: ఒకే ఒక్క తెలివైన ప్రశ్న... కోడి ముందా గుడ్డు ముందా?
Moral Story: ప్రతి ఒక్కరూ తమకు తామే తెలివైన వారిలా భావిస్తారు. అందరి ముందు తెలివేటలను ప్రదర్శించాలి అనుకుంటారు. కానీ, అసలైన తెలివి అనేది మాటల్లో కాదు.. చేతల్లో ఉంటుంది. దానికి సంబంధించిన కథ ఇప్పుడు చూద్దాం..

ఎవరు అసలైన తెలివైన వారు?
అనగనగా ఒక రాజు ఉండే అతని రాజ్యంలో గోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆ రాజ్యంలో అందరి కంటే అత్యంత తెలివైన వాడు అని గోపాల్ కి మంచి పేరు ఉంది. అయితే.. ఒక రోజు ఈ రాజ్యానికి పక్క రాజ్యానికి చెందిన రాము అనే ఓ వ్యక్తి వచ్చాడు. అతను తనను తాను చాలా తెలివైన వాడుగా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు.
అతను రాజ్యంలోకి రాగానే.... మీ రాజ్యంలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరు అని ఓ వ్యాపారిని అడిగాడు. ఆ వ్యాపారి అందుకు సమాధానంగా గోపాల్ గురించి చెప్పాడు. ‘అతను అంత తెలివైన వ్యక్తా?’ అని రాము అడిగాడు. దానికి ఆ వ్యాపారి.. ‘ నేను చాలా రాజ్యాలు తిరిగాను. కానీ.. గోపాల అంత తెలివైన వాడిని ఎక్కడా చూడలేదు’ అని చెబుతాడు. దీంతో... రాముకి.. ఎలాగైనా ఆ గోపాల్ ని కలవాలని, ఆ గోపాల్ కంటే తానే తెలివైన వాడినని నిరూపించుకోవాలని అనుకున్నాడు.
తెలివికి పరీక్ష..
వెంటనే ఈ విషయాన్ని నిరూపించుకోవడానికి ఆ రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయుల దగ్గరకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాజుని కలిసి ఇలా అన్నాడు. ‘ మహా రాజా నేను చాలా దేశాలు తిరిగాను. చాలా మంది జ్ఞానవంతులను కలిశాను. చాలా మందిని ఓడించాను. ఇప్పుడు మీ రాజ్యంలో నా తెలివి తేటలు ప్రదర్శించాలి అనుకుంటున్నాను. మీ రాజ్యంలో గోపాపల్ అనే తెలివైన వ్యక్తి ఉన్నాడని విన్నాను. అతని తెలివిని నేను పరీక్షించాలి. అతను ఓడిపోతే మీ రాజ్యంలో ఎవరూ తెలివైన వారు లేరు అని అంగీకరించాలి’ అని చెబుతాడు. అందుకు రాజు కూడా సరే అంటాడు.
ఒకే ఒక తెలివైన ప్రశ్న...
రాజ దర్బార్ లో అందరూ రెడీగా ఉంటారు. అప్పుడే గోపాల్ అక్కడికి వస్తాడు. రాము అతనిని పలకరిస్తాడు. తాను చాలా గొప్ప విద్వాంసుడిని, పండితుడు, జ్ఞానవంతుడిని అని పరిచయం చేసుకుంటాడు. కానీ, గోపాల్ మాత్రం తనను తాను సాధారణ వ్యక్తిగా పరిచయం చేసుకుంటాడు. ‘ నిజమైన తెలివైన వంతుడు ఇంత మౌనంగా ఉండడు’ అని రాము మనసులోనే అనుకుంటాడు.
ఇక తర్వాత... అందరి ముందు.. గోపాల్ ని రాము ప్రశ్నలు అడగడం మొదలుపెడతాడు. ‘ నేను నిన్ను పరీక్షించాలి అనుకుంటున్నాను.. నిన్ను 100 ఈజీ ప్రశ్నలు అడగమంటావా? లేక ఒక కష్టమైన ప్రశ్న అడగమంటావా’ అని అడుగుతాడు. అందుకు గోపాల్ వినయంగా.... ఈజీ ప్రశ్నలు ఎందుకండి.. కష్టమైన ఒకే ఒక్క ప్రశ్న అడగండి అని అంటాడు. అందుకు రాము గర్వంగా నవ్వుకుంటూ.. ‘ కోడి ముందా గుడ్డు ముందా?’ అని అడుగుతాడు. అయితే... గోపాల్ ఏ మాత్రం కంగారు పడకుండా... కోడి ముందు అని సమాధానం ఇస్తాడు. వెంటనే రాము.. ‘అది నువ్వు ఎలా చెప్పగలవు? దానికి ఆధారం ఏంటి’ అని అడుగుతాడు. అయితే.. గోపాల్ మాత్రం... ‘ మీరు ఒక్క ప్రశ్నే అడుగుతాను అన్నారు కదా? మీరు అడిగారు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు రెండో ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటాడు. ఆ మాటకు రాము ఖంగు తింటాడు. మరో ప్రశ్న అడిగే ఛాన్స్ కూడా లేకుండా చేసిన గోపాల్ తెలివిని అందరూ ప్రశ్నించారు. అందుకే.. అందరి కంటే తామే తెలివైన వారం అనే గర్వానికి పోకూడదు అని రాము కూడా తర్వాత ఫీల్ అవుతాడు.
కథలో నీతి...
నిజమైన తెలివితేటలు మాటల్లో కాదు.. ఆలోచనలో ఉంటాయి. వినయం ఉన్నవాడే నిజంగా గొప్పవాడు.

