IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Weather Update : తెలుగు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలిగాలులకు వర్షాలు తోడయితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో…

తెలుగు రాష్ట్రాల్లో చలివాన..
IMD Rain Alert : ఇప్పటికే తెలుగు ప్రజలను చలి గజగజలాడిస్తోంది... ఉష్ణోగ్రతలు ఊహకందని స్థాయిలో పడిపోతున్నాయి. ఇలా తీవ్ర చలితో ఇబ్బందులు పడుతున్నవేళ వాతావరణ శాఖ మరో షాకిచ్చింది... తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. సాధారణంగానే చలి పంజా విసురుతోంది... దీనికి వర్షాలు తోడయి వాతావరణాన్ని మరింత చల్లగా మార్చే అవకాశాలున్నాయి. అంటే చల్లని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నమాట.
బంగాళాఖాతం వెదర్ ఎఫెక్ట్
బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంది... దీంతో అక్కడ వర్షాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (డిసెంబర్ 17, బుధవారం) అక్కడక్కడ చిరుజల్లులు, ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఏపీపై చలి పంజా
ఇక చలి విషయానికి వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో చలి మరింత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోయి చలి గజగజలాడిస్తోంది.
ఈ తెలంగాణ జిల్లాల్లో గడ్డకట్టే చలి
తెలంగాణలో కూడా రోజురోజుకు చలితీవ్రత పెరుగుతోంది... మరిన్ని జిల్లాలకు చలిగాలులు వ్యాపిస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో టెంపరేచర్స్ పూర్తిగా పడిపోయి చలి ఎక్కువగా ఉంటోంది... ఇవాళ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాలకు పొంచివున్న చలిగాలులు ముప్పు
తెలంగాణలోకి కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగ్గానే ఉంది... 10 డిగ్రీలకు పైగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అయితే రేపటి (డిసెంబర్ 18) నుండి జగిత్యాల, జనగాం, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు 5 నుండి 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక మరికొన్ని జిల్లాల్లో 10 నుండి 15 డిగ్రీలు... ఇంకొన్ని జిల్లాల్లో 15 డిగ్రీ సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
అత్యల్ఫ ఉష్ణోగ్రతలు ఇక్కడే...
ఆదిలాబాద్ లో అత్యల్పంగా 8.2, మెదక్ లో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హన్మకొండలో 11, రామగుండంలో 13, నిజామాబాద్ లో 13, నల్గొండలొ 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పటాన్ చెరు ప్రాంతంలో 9.2, రాజేంద్రనగర్ లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

