- Home
- Feature
- Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Top 5 Biggest Railway Stations in India : శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన భాారతీయ రైల్వేస్ రవాణా వ్యవస్థలో ఇప్పటికీ టాప్ లోనే ఉంది. ఇందుకు కారణం కొన్ని రైల్వే స్టేషన్లు. ఇలా దేశ ప్రజలకు సేవచేస్తున్న అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఏవో తెలుసుకుందాం.

Top 5 Biggest Railway Stations in India
Top 5 Biggest Railway Stations : భారతీయ రైల్వేస్ ... వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ రవాణా వ్యవస్థ ప్రజల జీవితంలో భాగమయ్యింది. శుభకార్యమైనా, అశుభకార్యమైనా ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తూ కష్టసుఖాల్లో తోడై నిలుస్తోంది... అందుకే భారతీయులకు రైల్వేతో ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. లగ్జరీ బస్సులు, కార్లలో కాదు విమాన ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఇష్టపడేవారే ఎక్కువగా ఉంటారు.
ఇలా ప్రజలకు ఎంతో చేరువైన ఇండియన్ రైల్వేస్ రికార్డుల మోత మోగిస్తోంది. 1,14,500 దూరం రైల్వే ట్రాక్ కలిగిన భారతీయ రైల్వేస్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ఉద్యోగుల విషయంలోనూ రైల్వేది రికార్డే... 1.2 మిలియన్స్ ఎంప్లాయిస్ ని కలిగిన ఇండియన్ రైల్వే అత్యధిక మంది ఉద్యోగుల విభాగంలో ప్రపంచంలో 9వ స్థానం, దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ఇలా భారతీయ రైల్వే చాలా విషయాల్లో మెరుగైన స్థానంలో ఉంది.
భారతదేశంలో చిన్నాపెద్ద కలిపి మొత్తం 7500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని స్టేషన్లకు వందేళ్లకు పైగా చరిత్ర ఉండగా... మరికొన్ని అత్యాధునిక సదుపాయాలతో ఇటీవలే నిర్మించినవి. మరి ప్రయాణికుల రద్దీ, ట్రాక్స్, ప్లాట్ ఫామ్స్, ఉద్యోగుల సంఖ్య... ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
1. హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ (West Bengal, Kolkata)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన రైల్వే స్టేషన్ హౌరా. భారతదేశంలో అతి పురాతనమైన రైల్వే స్టేషన్ మాత్రమే కాదు అతిపెద్దది, అత్యంత రద్దీగా ఉండేది కూడా. హౌరా రైల్వే స్టేషన్ ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికే కాదు యావత్ తూర్పు భారతదేశానికి సేవలు అందిస్తోంది.
1853 లో బ్రిటిషర్లు హౌరా రైల్వే స్టేషన్ ను నిర్మించారు... ఈ శతాబ్ద కాలంలో ఎన్నో మార్పుచేర్పులు జరిగినా దేశ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడం మాత్రం మారలేదు. ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ మీదుగా 600 రైల్లు ప్రయాణిస్తుంటాయి... తద్వారా లక్షలాదిమంది గమ్యస్థానాలను చేరుకుంటారు.
ప్రస్తుతం హౌరా రైల్వే స్టేషన్లో 23 ప్లాట్ ఫామ్స్, 25 ట్రాక్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ భవనం పాతదే... కానీ సౌకర్యాలు మాత్రం కొత్తవి. ఫ్రీ వైఫై, ఎగ్జిక్యూటివ్ లాంజ్, అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ, ఈజీగా టికెట్ పొందే కౌంటర్లు, తాగునీరు... ఇలా ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలు హౌరా రైల్వే స్టేషన్లో ఉన్నాయి.
2. సెల్దా రైల్వే స్టేషన్ (West Bengal, Kolkata)
ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద రైల్వే స్టేషన్... ఆసక్తికర విషయం ఏమిటంటే సెల్దా స్టేషన్ కూడా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనే ఉంది. ఈ రైల్వే స్టేషన్లో 21 ప్లాట్ పార్మ్స్, 28 ట్రాక్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ నుండి 1.5 మిలియన్స్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఈ రైల్వే స్టేషన్ కూడా అత్యంత పురాతనమైనది... 1862 నుండి ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది.
2021 లో బెంగాలీ న్యూ ఇయర్ సందర్భంగా సెల్దా రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ లాంజ్ ను ఓపెన్ చేశారు. ఇందులో ఫుడ్ కోర్టులతో పాటు అనేక సదుపాయాలు ఉన్నాయి... ప్రయాణికులు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక అత్యాధునిక టికెట్ కౌంటర్లు, వెయిటింగ్ రూమ్స్, ఫ్రీ వైఫై వంటి అనేక సదుపాయాలు ప్రయాణికులకు కల్పించారు.
3. చత్రపతి శివాజీ టెర్మినస్ (Maharashtra, Mumbai)
దేశ ఆర్థిక రాజధాని, మహారాష్ట్ర పాలనా రాజధాని ముంబైలో ఉంటుంది ఈ చత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్. ఇది కేవలం ప్రయాణికుల రద్దీ, ఇతర సదుపాయాల పరంగానే కాదు ఆర్థిక పరంగానూ దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. 1853 లో నిర్మించిన ఈ పురాతన రైల్వే స్టేషన్ UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందింది.
చత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్ లో 18 ప్లాట్ ఫామ్స్, 40 ట్రాక్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం. నిత్యం లక్షలాదిమంది ఈ రైల్వే స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు... అందుకే దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఇది ఒకటి.
4. న్యూడిల్లీ రైల్వే స్టేషన్ (New Delhi)
దేశ రాజధాని న్యూడిల్లీలోని ఈ రైల్వే స్టేషన్ కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం నుండి డిల్లీకి కనెక్టివిటీ ఉంటుంది... ఇలా దాదాపు 400 రైళ్లు ప్రతిరోజు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ ను 1956 లో నిర్మించారు... ఇందులో ప్రస్తుతం 16 ప్లాట్ పార్మ్స్, 18 ట్రాక్స్ ఉన్నాయి.
న్యూడిల్లీ రైల్వే స్టేషన్ కేవలం సామాన్య ప్రజలకే కాదు రాజకీయ, వ్యాపార ప్రముఖులకు కూడా సేవలు అందిస్తోంది. నిత్యం చాలామంది రాజకీయ నాయకులు రైళ్లలోనే డిల్లీకి వస్తుంటారు... ఈ రైల్వే స్టేషన్ లోనే దిగుతుంటారు. అందుకే ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్ మాత్రమే కాదు అత్యధిక ఆదాయం అందిస్తున్న రైల్వే స్టేషన్ కూడా.
5. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ (Tamilnadu, Chennai) :
భారతదేశంలో ఐదో అతిపెద్ద రైల్వే స్టేషన్ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే అతిపెద్ద స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా అతి పురాతనమైనది... 1873 లో నిర్మించారు. ఇక్కడ 17 ప్లాట్ ఫార్మ్స్, 17 ట్రాక్స్ ఉన్నాయి... నిత్యం 400 పైగా రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి. దాదాపు 4 లక్షలమందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒకేసారి 1000 మంది విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా పెద్ద వెయిటింగ్ హాల్ ఉంది. ఇక ఫ్రీ వైఫై, ఫుడ్ కోర్డులు, అత్యాధునిక టికెట్ మిషన్లు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

