Albert Einstein: ఐన్‌స్టీన్ మెదడును దొంగిలించి 240 ముక్కలు చేసిన వైద్యుడు
Albert Einstein: ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్డ్ ఐన్‌స్టీన్ మెదడు ఇప్పటికీ నిల్వ చేశారు. ఆ మెదడును ఒక వైద్యుడు దొంగిలించి మరీ ముక్కలుగా చేశాడు. ఆ ముక్కలను ప్రదర్శన కోసం ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

ఐన్ స్టీన్ చివరి కోరిక
ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకరు. సాపేక్ష సిద్ధాంతం ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి ఈయన. అతను జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించాక కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955 ఏప్రిల్ 18న అమెరికాలోని ప్రిన్స్‌టన్ నగరంలో మరణించారు. ఆయన మరణించేముందు చివరి కోరికను బయటపెట్టారు. తన శరీరాన్ని దహనం చేసి, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అంత్యక్రియలు చేయాలని, తన శరీర భాగాలను ఎవరూ పరిశోధనల కోసం ఉపయోగించకూడదని ఆయన కోరారు. కానీ ఆయన మరణించిన తరువాత జరిగిన ఘటనే ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. ఐన్‌స్టీన్ చివరి కోరిక తీరలేదు. అతడి శరీరం నుంచి మెదడు దొంగతనానికి గురైంది.
మెదడును దొంగిలించి ముక్కలు చేసి
ఐన్ స్టీన్ మరణించిన ప్రిన్స్‌టన్ పాథాలజిస్టుగా డాక్టర్ థామస్ హార్వే పనిచేశఆరు. శవ పరీక్ష సమయంలో కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోకుండా ఐన్‌స్టీన్ మెదడును బయటకు తీశారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. డాక్టర్ హార్వే ఐన్‌స్టీన్ మెదడును ఎందుకు తీశారంటే ఆయన అంత గొప్ప మేథావిగా మారడానికి కారణమైన మెదడు నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి. ఈ ఉద్దేశంతో ఐన్‌స్టీన్ మెదడును ప్రత్యేక రసాయనాలతో భద్రపరిచారు. దాన్ని సుమారు 240 చిన్న ముక్కలుగా కోశారు. ఆ ముక్కలను వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలకు పంపించి అధ్యయనం చేయించారు. కొన్ని ముక్కలను తన దగ్గరే ఉంచుకున్నారు. ఈ విషయం కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అనుమతి లేకుండా మెదడును దొంగిలించడం నేరం అని ఐన్‌స్టీన్ కుటుంబ సభ్యులు చాలా సీరియస్ అయ్యారు. తరువాత మాత్రం వారు చల్లబడి శాస్త్రీయ పరిశోధన కోసమే ఉపయోగిస్తే అభ్యంతరం లేదని అనుమతి ఇచ్చారు.
మెదడులో ఏముంది?
ఈ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర విషయాలను కనిపెట్టారు. ఐన్‌స్టీన్ మెదడులో సాధారణ మనుషుల మెదడుతో పోలిస్తే కొన్ని భాగాలు కొంచెం పెద్దగా ఉన్నాయని.. ముఖ్యంగా ఆలోచన, ఊహాశక్తి, గణిత లెక్కలు, సమస్యలను విశ్లేషించే ప్రాంతాలు బలంగా అభివృద్ధి చెందాయని చెప్పారు. కానీ ఇవే ఆయన అసాధారణ ప్రతిభకు కారణం అని మాత్రం కచ్చితంగా నిరూపించలేకపోయారు. ప్రస్తుతం ఐన్‌స్టీన్ మెదడుకు సంబంధించిన కొన్ని ముక్కలు అమెరికాలోని కొన్ని వైద్య కళాశాలల్లో, మ్యూజియంలలో భద్రంగా ఉన్నాయి. మరికొన్ని ముక్కలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. మొత్తంమ్మీద వైద్యులు చేసిన దొంగతనం ఇప్పటికీ ఐన్ స్టీన్ మెదడును నేటి తరానికి చూసే అవకాశం దక్కింది.
ఐన్ స్టీన్ ఐక్యూ ఎంత?
ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్డ్ ఐన్ స్టీన్ ఎప్పుడూ IQ పరీక్ష తీసుకున్నాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ అతను ఎంత తెలివైనవాడో తెలుసుకునేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేశారు. కొన్ని అంచనాల ప్రకారం ఐన్ స్టీన్ ఐక్యూ 160 వరకు ఉండే అవకాశం ఉంది. దీనిని సాధారణంగా మేథావి స్థాయిగా పరిగణిస్తారు. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం మాత్రమే కాదు ఫోటో ఎలక్ట్రిక ఎఫెక్ట్, క్వాంటం సిద్ధాంతం, అణు శక్తికి అణు బాంబుకు మూలం అయిన E=mc² సమీకరణాన్ని కనిపెట్టారు.

