- Home
- Feature
- Most Expensive Water: ఈ నీళ్ల బాటిల్ ధర అక్షరాలా రూ.50 లక్షలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు, ఎందుకంత ధర?
Most Expensive Water: ఈ నీళ్ల బాటిల్ ధర అక్షరాలా రూ.50 లక్షలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు, ఎందుకంత ధర?
Most Expensive Water: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటి బాటిల్ ఇది. దీనిలో నీరు కాదు ఏకంగా బంగారమే తాగుతారు. దీన్ని కొనడం అంబానీలు, అదానీల వల్లే అవుతుంది. ఎందుకంటే ఈ నీళ్ల బాటిల్ ధర యాభై లక్షల రూపాయలు. ఇది ఎందుకంత ఖరీదు?

అత్యంత ఖరీదైన నీళ్ల బాటిల్
సాధారణంగా మనం బయట కొనే మంచి నీళ్ల బాటిల్ ఇరవై లేదా ముప్పై రూపాయలు ఉంటుంది. కానీ ప్రపంచంలో ఏకంగా యాభై లక్షల రూపాయల ఖరీదు చేసే ఒక వాటర్ బాటిల్ ఉందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ఈ బాటిల్ పేరు ‘ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యుటో ఎ మొడిగ్లైని’. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్ల బాటిల్గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో నిలిచింది. 2010లో రికార్డు సృష్టించిన ఈ బాటిల్ స్థానాన్ని ఇప్పటివరకు వేరే ఏ బాటిల్ దాటలేకపోయింది. ఇందులో కేవలం 750 మిల్లీలీటర్ల నీరు మాత్రమే ఉంటుంది.
బంగారంతో చేసిన బాటిల్
ఈ నీళ్ల బాటిల్ ఇంత ఖరీదు ఉండటానికి ప్రధాన కారణం దాని డిజైన్, అందులో వాడిన బంగారం. ప్రముఖ కళాకారుడు ఫెర్నాండో అల్టమిరానో ఒక మనిషి ముఖం రూపం కనిపించేలా దీన్ని చెక్కారు. ఈ బాటిల్ బయటి భాగాన్ని 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో రూపొందించారు. అంతేకాకుండా, బాటిల్ లోపల ఉండే నీటిలో కూడా ఐదు గ్రాముల మేలిమి బంగారాన్ని ద్రవ రూపంలో కలిపారు. ఇందులో పోసే నీటిని కూడా మామూలు ప్రదేశాల నుంచి తీసుకోలేదు. ఫిజీ, ఐస్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లోని హిమానీనదాల మంచు కరిగిన అత్యంత స్వచ్ఛమైన నీటిని ఎంతో శ్రమించి బొట్టుబొట్టుగా సేకరిస్తారు. ఆ నీరు అత్యంత స్వచ్ఛమైనది.
ఎక్కడ కొనాలి?
ఈ అరుదైన బాటిళ్లను సాధారణ మార్కెట్లలో అమ్మరు, కేవలం ముందస్తు ఆర్డర్లపై ధనవంతుల కోసం మాత్రమే తయారు చేస్తారు. అప్పుడప్పుడు వీటిని వేలం వేసి, ఆ డబ్బును భూతాపాన్ని తగ్గించే పర్యావరణ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు. గతంలో ప్రముఖ వ్యాపారవేత్త నీతా అంబానీ ఈ బాటిల్ నీళ్లు తాగుతున్నట్లు ఒక ఫోటో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. అయితే ఆ ఫోటో నిజమైనది కాదని, ఎవరో కావాలని మార్ఫింగ్ చేశారని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఏది ఏమైనా, ఇంత ఖరీదైన వాటర్ బాటిల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షిస్తోంది.

