Goa Beach: గోవాలో.. ఆసియాలోనే అందాల బీచ్, ప్రపంచం మెచ్చిన ఈ బీచ్ చూసి తీరాల్సిందే
Goa Beach: ఆసియాలోనే అందమైన బీచ్ గోవాలో ఉంది. గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం, ఈ బీచ్ ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ బీచ్ గురించి తెలుసా?

గోవాలో ఆసియాలోనే టాప్ బీచ్
భారత పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. గోవాలోని ప్రముఖ పాలోలెం బీచ్ ప్రపంచ పర్యాటక పటంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026 నివేదిక ప్రకారం, ఈ బీచ్ ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బీచ్‌ల జాబితాలో ఆరో ర్యాంకు సాధించి పర్యాటకులను ఆశ్చర్యపరిచింది. ప్రపంచ స్థాయి టాప్ 25 జాబితాలో నిలిచిన ఏకైక ఆసియా బీచ్‌గా పాలోలెం బీచ్ నిలవడం మన దేశానికే గర్వకారణం. దక్షిణ గోవాలోని కెనకోనా ప్రాంతంలో ఉండే ఈ అందమైన సముద్ర తీరం ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ బీచ్ ఎంతందమో
అర్ధచంద్రాకారంలో ఉండే తెల్లటి ఇసుక తిన్నెలు, ప్రశాంతమైన సముద్రపు అలలు ఈ తీరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నీటిలో ఈత కొట్టేందుకు అనువైన సురక్షిత వాతావరణం ఉండటంతో దేశవిదేశాల నుంచి వచ్చే సందర్శకులు ఇక్కడికి రావడానికి ఎక్కువ ఇష్టపడతారు. నీటి స్వచ్ఛత, పర్యావరణ పరిశుభ్రత, పర్యాటకుల భద్రత వంటి అనేక అంశాలను నాసా శాటిలైట్ సమాచారం ఆధారంగా లెక్కించి ఈ ర్యాంకు ఇచ్చారు. లక్షకు పైగా పర్యాటకుల అనుభవాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక చేశారు. స్థానికంగా జరిగే డాల్ఫిన్ బోట్ రైడ్స్, పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా హెడ్ఫోన్లు పెట్టుకుని సంగీతం ఆస్వాదించే సైలెంట్ నైట్ పార్టీలు ఇక్కడ ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
ప్రపంచ బీచ్ లతో పోటీగా
ఈ అంతర్జాతీయ గుర్తింపుతో గోవా పర్యాటక రంగానికి సరికొత్త ఉత్సాహం వచ్చింది. ప్రపంచ టాప్ టెన్ జాబితాలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, గ్రీస్, టర్క్స్ అండ్ కైకోస్, ప్యూర్టోరికో వంటి ప్రపంచ ప్రసిద్ధ దేశాల బీచ్‌ల సరసన పాలోలెం నిలవడం నిజంగా విశేషం. కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచ పర్యాటకులందరికీ ఇది ఒక కలల గమ్యస్థానంగా మారుతోంది. తీర ప్రాంత సహజ సౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా కాపాడుకోవడం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైంది. రాబోయే రోజుల్లో ఇక్కడికి వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.













