- Home
- Feature
- గుంటూరు మిర్చీ కారం 40000 స్కోవిల్స్, ఈ మిర్చీలో ఏకంగా 2693000.. ప్రపంచంలోనే అత్యంత కారం మిరప ఏదో తెలుసా?
గుంటూరు మిర్చీ కారం 40000 స్కోవిల్స్, ఈ మిర్చీలో ఏకంగా 2693000.. ప్రపంచంలోనే అత్యంత కారం మిరప ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయ పెప్పర్ ఎక్స్. మన గుంటూరు మిరపకాయలో కారం ఘాటు సుమారు 35,000 నుంచి 40,000 స్కోవిల్స్ ఉంటే ఇందులో ఏకంగా 2,693,000 స్కోవిల్ యూనిట్స్ ఉంటుంది.

ఈ మిరప యమ ఘాటు గురూ..
సాధారణంగా మన భారతీయులకు కారం అంటే ముందుగా గుర్తొచ్చేది గుంటూరు మిర్చి. ఆంధ్రప్రదేశ్‌లో పండే ఈ గుంటూరు మిర్చీకి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది...ఈ కారం ఘాటుకే చాలామంది అల్లాడిపోతుంటారు. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయ పెప్పర్ ఎక్స్ (Pepper X) ఎలా ఉంటుంది? గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఈ కారం చోటు దక్కించుకుందంటేనే ఈ ఘాటు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈ మిరపకాయ ప్రత్యేకత ఏమిటి? దీన్ని తింటే నిజంగానే తట్టుకోలేమా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
పెప్పర్ ఎక్స్ లో కారం ఏ స్థాయిలో ఉంటుంది?
సాధారణంగా మిరపకాయల్లో ఉండే కారం ఘాటును స్కోవిల్ హీట్ యూనిట్స్ (SHU) ద్వారా కొలుస్తారు. మిరపకాయల్లో కారం కలిగించే క్యాప్సైసిన్ అనే రసాయన సమ్మేళనం ఆధారంగా ఈ ఘాటును అంచనా వేస్తారు. మన దేశంలో ప్రసిద్ధి చెందిన గుంటూరు మిర్చి ఘాటు సుమారు 35,000 నుంచి 40,000 SHU వరకు ఉంటుంది.
అయితే పెప్పర్ ఎక్స్ విషయంలో ఈ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. దీనిలో సగటున ఏకంగా 2,693,000 స్కోవిల్ హీట్ యూనిట్ల ఘాటు ఉంటుంది. అంటే గుంటూరు మిర్చితో పోలిస్తే దాదాపు 67 రెట్లు ఎక్కువ కారం ఉన్నట్లన్నమాట. ఈ స్థాయి కారంతోనే పెప్పర్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఈ మిరపకాయ తింటే ఏం జరుగుతుంది?
పెప్పర్ ఎక్స్‌ను సాధారణ మిరపకాయల మాదిరిగా తినడం అంత సులభం కాదు. దీని ఘాటు నోటిలో తీవ్రమైన మంటను కలిగిస్తుంది. తిన్న వెంటనే నాలుక, పెదవులు, నోటి లోపలి భాగాల్లో మంట మొదలవుతుంది. కళ్లలో నీళ్లు రావడం, ముక్కు కారడం, చెమటలు పట్టడం, దగ్గు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొందరిలో వాంతులు, కడుపునొప్పి, జీర్ణాశయ అసౌకర్యం కూడా ఏర్పడవచ్చు.
ఈ పెప్పర్ ఎక్స్ ను నోట్లో వేసుకుని నమలగానే ఆ ఘాటు నషాలానికి అంటుతుంది... ధైర్యం చేసి నమిలి మింగితే అంతే సంగతి. అన్నవాహికతో పాటు జీర్ణాశయానికి రంద్రాలు పడినంత పని అవుతుంది... అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక ఇప్పటికే అల్సర్ సమస్యతో బాధపడేవారు తింటే కడుపులో పెట్రోల్ పోసి నిప్పు పెట్టినంత మంటగా ఉంటుంది. ఈ పెప్పర్ ఎక్స్ లో మనిషిని చంపేసే స్థాయిలో కారం ఉంటుందనడం అతిశయోక్తి కాదు.
ఈ మిరపకాయ తినడం కాదు తాకినా ప్రమాదమే...
పెప్పర్ ఎక్స్‌లో ఉండే క్యాప్సైసిన్ కారణంగా చర్మంపై మంట, కళ్లలో తీవ్రమైన మంట, ముక్కులో అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా మిరపకాయను చేతులతో పట్టుకున్న తర్వాత అదే చేతులతో కళ్లను, ముక్కును తాకితే తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే ఇలాంటి అత్యంత కారమైన మిరపకాయలను పరిశోధన లేదా వంటల తయారీలో ఉపయోగించేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం, కళ్లకు తగలకుండా జాగ్రత్తపడటం అవసరం.
పెప్పర్ ఎక్స్‌ను సృష్టించింది ఎవరు?
అమెరికాకు చెందిన ప్రముఖ మిరపకాయల పెంపకందారుడు ఎడ్ క్యూరీ (Ed Currie) ఈ పెప్పర్ ఎక్స్‌ను అభివృద్ధి చేశారు. ఈయన PuckerButt Pepper Company వ్యవస్థాపకులు… పరిశోధనల్లో భాగంగా ఈ మిరపను తయారుచేశాడు. ఈ మిరపకాయను అభివృద్ధి చేయడానికి ఆయన దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు, వివిధ రకాల మిరపకాయల సంకరణ ప్రక్రియ చేపట్టారు.
ఇదే ఎడ్ క్యూరీ గతంలో ప్రపంచంలోనే అత్యంత కారమైన మిరపకాయగా గుర్తింపు పొందిన కరోలినా రీపర్ (Carolina Reaper)ను కూడా అభివృద్ధి చేశారు. దాని సగటు ఘాటు 1.64 మిలియన్ SHU కాగా, పెప్పర్ ఎక్స్ దాన్ని కూడా అధిగమించింది.
సాధారణ మార్కెట్లో పెప్పర్ ఎక్స్ దొరకదు.. ఎందుకు?
పెప్పర్ ఎక్స్ ఆకారం కూడా ఇతర మిరపకాయలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఇది ముడతలు పడిన, అసమానమైన ఆకారంతో కనిపిస్తుంది. దీని రుచి కేవలం కారం మాత్రమే కాకుండా కొంత పండ్ల సువాసన, మట్టి వాసనను కూడా కలిగి ఉంటుందని చెబుతారు.
ఈ మిరపకాయ విత్తనాలు, మొక్కల విషయంలో ఎడ్ క్యూరీ ప్రత్యేక గోప్యత పాటిస్తున్నారు. సాధారణ మార్కెట్లలో తాజా పెప్పర్ ఎక్స్ మిరపకాయలు లేదా విత్తనాలు సులభంగా లభించవు. అయితే దీనిని ఉపయోగించి తయారు చేసిన కొన్ని ప్రత్యేక హాట్ సాస్‌లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తానికి గుంటూరు మిర్చి ఘాటుకే అల్లాడిపోయే మనకు పెప్పర్ ఎక్స్ గురించి తెలుసుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. 2.69 మిలియన్ల స్కోవిల్ హీట్ యూనిట్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ మిరపకాయ నిజంగానే ప్రకృతి సృష్టించిన అత్యంత ఘాటైన ఆహార పదార్థాల్లో ఒకటి.












