Moral Story: మీ జాతకం ఎప్పుడూ బాగోదని ఫీలౌతున్నారా? ఈ యువకుడి కథ చదవాల్సిందే..!
Moral Story: జీవితంలో మీకు అసలు అదృష్టమే లేదని..తమ దురదృష్టం కారణంగా చుట్టూ ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారని అనుకుంటున్నారా? అయితే, ఈ రాజు కథ తెలుసుకోవాల్సిందే…

Moral story
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు పుట్టిన తర్వాత నుంచి అతనికి వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. దీంతో తనకు కొడుకు పుట్టడం వల్లే ఈ నష్టం జరిగిందని అతను నమ్మడం మొదలుపెడతాడు. ప్రతి పనికీ కొడుకుని తిట్టడం మొదలుపెడతాడు. కొడుకు కనీసం ఎదురైనా చాలు.... నష్ట జాతకుడా అని కానీ తిట్టేవాడు. ఆ మాటలకు ఆ పిల్లాడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు.
ఒకరోజు కూడా ఇంటి ముందు రామయ్య నిలపడి ఉంటాడు. ఎదురుగా ఉన్న కొడుకును చూస్తాడు. ఈ లోగా.. పై నుంచి కొబ్బరి బోండం వచ్చి అతని కాలి మీద పడుతుంది. అంతే... దానికి కారణం కొడుకే అని భావించి తిట్టడం మొదలుపెడతాడు. ఇలానే తిడుతూ ఉండటం... ఆ రాజ్యంలో రాజు కంట పడుతుంది. వెంటనే అక్కడికి వెళ్లి... ఆ తండ్రితో మాట్లాడతాడు. ‘ ఎందుకు ఆ పిల్లాడిని అలా తిడుతున్నావ్’ అని రాజు రామయ్యను అడుగుతాడు. దానికి రామయ్య... ‘ వీడు పుట్టిన దగ్గర నుంచి నాకు ఏ రోజు కలిసి రాలేదు, వీడి వల్ల నష్టం తప్ప.. లాభం ఏమీ లేదు. వీడి జాతకం ఇలా ఉంది కాబట్టే.. మా జీవితం ఇలా అయ్యింది. ఉదయం లేచి వీడి ముఖం చూస్తే ఏదో ఒక నష్టం కలుగుతుంది’ అని చెబుతాడు.
ఎవరు దురదృష్టవంతుడు...
ఆ మాటలకు రాజుకి కోపం వస్తుంది. ‘ ఇలాంటి వాటిలో నిజం ఉండదు. కావాలంటే... మీ అబ్బాయిని నా దగ్గర ఉంచుకుంటాను ’ అని చెప్పి తనతో తీసుకొని వెళతాడు. ఆ రోజంతా తనతోనే ఉంచుకుంటాడు. మరుసటి రోజు కూడా తన పక్కనే పడుకోపెట్టుకుంటాడు. ఆ తర్వాతి రోజు ఉదయం లేవగానే.. రాజు ఆ కుర్రాడి ముఖాన్ని చూస్తాడు. అలానే లేచి బాత్రూమ్ కి వెళ్తుంటే... అక్కడ పాముని చూసి కంగారు పడతాడు. ఆ కంగారులో జారి కింద పడతాడు. దీంతో... రాజు కాలికి గాయం అవుతుంది.
వెంటనే రాజుకి కోపం వచ్చేస్తుంది. ఈ కుర్రాడి ముఖంచూడటం వల్లే తనకు ఇలా జరిగిందని అనుకుంటాడు. ఆ కోపంతో... భటులను పిలిచి.. ఆ కుర్రాడి కి మరణ శిక్ష విధించమని ఆర్డర్ వేస్తాడు. ఆ మాట విని.. ఆ కుర్రాడు కూడా షాక్ అవుతాడు. ‘ నేనేం చేశాను’ అని అడుగుతాడు. అయితే, ‘ ఉదయాన్నే నీ ముఖం చూడటం వల్లే... నా కాలికి గాయం అయ్యింది. మీ నాన్న చెప్పింది అక్షరాలా నిజం’ అని రాజు కూడా తేలుస్తాడు. అప్పుడు... ఆ మాట విన్న ఆ కుర్రాడు.... ‘ అయితే, నాకన్నా దరిద్రుడు మీరే’ అని రాజుకి ఎదురు తిరుగుతాడు.
కథ నుంచి తెలుసుకోవాల్సింది ఇదే..
దానికి రాజు‘ ఏం మాట్లాడుతున్నావ్?’ అని సీరియస్ అవుతాడు. కానీ అ అబ్బాయి మాత్రం.. ‘ కేవలం నా ముఖం చూసినందుకు మీ కాలికి చిన్న గాయం అయ్యింది.. కానీ.. నేను మీ ముఖం చూసినందుకు ఏకంగా నా ప్రాణాలు పోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నా ముఖం చూడటం వల్ల పాము కాటు బారి నుంచి తప్పించుకున్నారు అనుకోవచ్చు కదా. కొబ్బరి బోండం మా నాన్న తల మీద కాకుండా కాలి మీద పడటం వల్ల ప్రమాదం తప్పింది అనుకోవచ్చు కదా ’ అని ఆ కుర్రాడు ప్రశ్నిస్తాడు.
ఆ మాటతో రాజుకి విషయం అర్థం అవుతుంది. ముఖంలో ఏదీ ఉండదు.. కేవలం ఒకరి ముఖం చూడటం వల్ల.. ఎవరికీ నష్టం జరగదు అని రాజుకి అర్థమౌతుంది. అదే విషయాన్ని ఆ కుర్రాడి తండ్రికి కూడా అర్థం అయ్యేలా చెబుతాడు. మన ముఖం కాదు.. మన దృష్టే మన అదృష్టం అని అందరికీ రాజు వివరిస్తాడు.
కథలోని నీతి...
ఒకరి ముఖం చూడటం అదృష్టాన్ని దెబ్బతీయదు. మన భావాలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. నమ్మకం సరికొత్త జీవితం ఇస్తుంది

