- Home
- Feature
- జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా.? వివేకానంద చెప్పిన ఈ మాటలు కచ్చితంగా తెలుసుకోవాలి
జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా.? వివేకానంద చెప్పిన ఈ మాటలు కచ్చితంగా తెలుసుకోవాలి
Motivational: జీవితంలో విజయం సాధించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ అందరూ ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేరు. ఇందుకు గల కొన్ని కారణాలను స్వామి వివేకానంద వందేళ్ల క్రితమే చెప్పారు.

అసలైన భక్తి ఏంటంటే.?
స్వామి వివేకానంద చెప్పిన ముఖ్య సందేశం ఆత్మవిశ్వాసమే నిజమైన భక్తి. మనలో దేవుడు బయట కాదు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఆయన స్పష్టంగా తెలిపారు. మనం దేవుణ్ని ఆలయాల్లో, గ్రంథాల్లో, పూజల్లో వెతుకుతుంటాం. కానీ నిజమైన దేవుడు మనలోని సత్తా, మన లోతుల్లో దాగి ఉన్న శక్తి అని వివేకానంద ఉపదేశం.
నీ శక్తిని తెలుసుకో, భయాన్ని వీడు
తనమీద నమ్మకం పెట్టుకోవడం అంటే దేవునిపై నిజమైన విశ్వాసం పెట్టుకున్నట్టే. తమను తాము బలహీనంగా భావించడం జీవితంలో పెద్ద తప్పు అని ఆయన చెబుతారు. భయం, సందేహం మనల్ని వెనక్కి లాగుతాయి. మనలో ఏ శక్తి దాగి ఉన్నదో తెలుసుకుంటే.. భయం తగ్గిపోతుంది, నమ్మకం పెరుగుతుంది, విజయానికి మార్గం తెరుచుకుంటుందనే సందేశాన్ని చాటారు.
విజయానికి అదే తాళం చెవి
వివేకానంద సందేశం ప్రకారం, మనిషి విజయవంతమయ్యే సమయం అతను తనలోని అశేష సామర్థ్యాన్ని గుర్తించినప్పుడే వస్తుంది. మనసులో నిండి ఉన్న నెగెటివ్ ఆలోచనలు, భయాలు, ఓడిపోతామన్న భయం వంటివన్నీ మనలోని శక్తిని తెలుసుకున్నప్పడు పటాపంచలవుతాయి. “బలం అంటే జీవితం… బలహీనత అంటే మరణం.” ఈ ఒక మాటే మనల్ని ముందుకు నడిపే అత్యంత శక్తివంతమైన సందేశం.
గమ్యం చేరే వరకు ఆగొద్దు
స్వామి వివేకానంద యువతను ప్రేరేపించిన మహోన్నత వ్యక్తి.. “లేవండి.. మేల్కొండి.. లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి”. ఈ సందేశం యువతకే కాదు, జీవితంలో ఏ దశలోనైనా ఆగిపోయిన, అయోమయంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఈ మాటల్లో అసలు అర్థం.. ధైర్యంగా ముందుకు సాగాలి, ప్రయత్నం ఆపకూడదు, గమ్యం చేరేవరకు పోరాటం కొనసాగించాలి. చాలా మంది అపజయం ఎదురుకాగానే ప్రయత్నాన్ని ఆపేస్తారు.
నిజమైన భక్తి ఇదే
మనం ఏది విత్తుతామో, అదే కోతకు వస్తుంది. అందుకే మనం మంచి ఆలోచనలు, మంచి పనులు, నమ్మకం, ధైర్యం ఇవన్నీ మన హృదయంలో విత్తాలి. మనలోని దేవుణ్ని, మన సత్తాను గుర్తించే వాడే తన జీవితాన్ని నిర్మించే వాడు. “మనలోని దేవుణ్ని తెలుసుకోవడం… అదే భక్తి, అదే జీవితం, అదే నిజమైన ఆధ్యాత్మికత.” ఇదే వివేకానంద ప్రపంచానికి ఇచ్చిన సందేశం.

