ఐబొమ్మ రవి హీరోనా..! భారత్ మరో బ్రెజిల్, మెక్సికో, కొలంబియా అవుతుందా?
ఐబొమ్మ పేరిట పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన ఇమ్మడి రవికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. అతడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హీరో అయిపోయాడు. ఈ పరిణామంపై దేశానికి మంచిదా.. కాదా?

గొంతు కోసుకొంటారా ??
1. సమస్య :
థియేటర్లలో తిను భండారాల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి.
పరిష్కారం.
థియేటర్ లలో దొరికే ప్రతి తినుబండారం విషం. పాప్ కార్న్ తో సమస్య లేదని చాలా మంది అనుకొంటారు. అందులో వెన్న రుచికోసం వాడే రసాయనంతో ప్రమాదకరమయిన పాప్ కార్న్ లంగ్స్ వ్యాధి వచ్చే అవకాశం. ఉచితంగా ఇచ్చినా తినొద్దు. పిల్లలకు చెప్పాలి. సినిమాకు వెళ్ళామా.. చూసామా... వచ్చామా.. అన్నట్టు ఉండాలి.
2. సమస్య :
హీరోలు కోట్లలో పారితోషికం తీసుకొంటున్నారు. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేదు.
పరిష్కారం :
సినిమా చూడొద్దు .
వరుసగా ప్లాప్ లయితే సినిమావారు దిగొస్తారు .
నిర్మాణ వ్యయం తగ్గించుకొంటారు .
ఉచితంగా సినిమాలు ప్రసారం చేసే టీవీ చానెల్స్ ఉన్నాయి. స్మార్ట్ టీవీ ఉంటే యూట్యూబ్ లో ఎన్నో సినిమాలు.
పిల్లలతో మాట్లాడడం ఆడడం లాంటివి చెయ్యాలి .
ఒకటి చెప్పనా? కోట్ల ఆదాయం ఉన్నా అది చాలదన్నట్టు నటులు విషపూరితమయిన కూల్ డ్రింక్స్, దానికి మించి గుట్కా ప్రకటనల్లో నటిస్తున్నారు. వీళ్ళు హీరోలా? లేక జీరోలా?
నేను నిర్వహించిన ప్రతి బాలమిత్ర క్లాస్ లో పిల్లలకు ఒకటే చెప్పాను. వారు హీరోలు కారు. నటులు... జస్ట్ నటులు. నిజమయిన హీరో హీరోయిన్ మీ ఇంటిలో ఉన్నారు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని మించిన హీరోయిన్ పిల్లలకు ఉంటుందా ? కన్నీటి బొట్టు కారిస్తే ఒంటి నీరు వృధా అయిపోతుందని దాన్ని కూడా చెమటగా మార్చి కుటుంబం కోసం స్వేదం చిందించే నాన్నను మించిన హీరో ఉంటాడా?
నా పోస్టులకు కొన్ని కామెంట్స్
గత మూడు నాలుగు రోజులుగా నా పోస్ట్స్ పై వచ్చిన కామెంట్స్ అందులో ఆయా మిత్రులు చెప్పిన సమస్యలు.
1" పిల్లల చదువు కు ఎక్కువ ఖర్చు .. ఇంటి అద్దె ఎక్కువ .. ఇల్లు కొనాలి అంటే ఎక్కువ ఖర్చు.. ట్రాఫిక్ జాంలు .. కాలుష్యం .. ఇలాంటి లోకంలోకి పిల్లల్ని తీసుకొని రావాలా?"
నా సమాధానం :
స్కూల్ స్టేటస్ సింబల్ అయితే , స్కూల్ ను క్లబ్ లాగా చూస్తే , ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత గొప్ప స్కూల్ అని పేరెంట్స్ భావిస్తే సమస్య జటిలం అవుతుంది . స్కూల్ ను లాభాపేక్ష లేకుండా నడపాలి . దీన్ని కచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి .ఇప్పటికీ బడ్జెట్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి . " అమెరికా లాంటి దేశాల్లో స్థిరపడిన మా పూర్వ విద్యార్థులు స్పాన్స్సెర్ చేస్తారు. రండి "అని నేను గత సంవత్సరం పోస్ట్ పెడితే పెద్దగా స్పందన లేదు . అంటే నామోషీ ! ప్రభుత్వ బడి అంటే నామోషీ. మా వూళ్ళో కూడా బడి పెట్టండి అని ఎంతో మంది అడుగుతున్నారు . మీకు తెలుసా? కొత్తగా బడి కట్టాలంటే పెట్టాలంటే వంద కోట్లు అవుతుంది . లాభ పేక్ష లేకుండా 25 ఏళ్లుగా బడి నడిపిన పుణ్యానికి నాకు అప్పులే ఉన్నాయి. వంద కోట్లు కాదు కదా . అందులో వందో వంతు కూడా పెట్టలేను . ఇరవై అయిదు ఏళ్ళ క్రితం ఇరవై లక్షలతో బడి స్థాపించాను. ఇప్పుడు కొత్త బడికి పర్మిషన్ తెచ్చుకోవాలంటే అధికారులకే ఇరవై అయిదు లక్షల లంచం ఇవ్వాలి. "ఏంటి అన్నీ సవ్యంగా ఉంటే ఇరవై అయిదు లక్షలు ఎందుకు ఇవ్వాలి?' అని మీరు అడగొచ్చు . సవ్యంగా ఉంటేనే ఇరవై అయిదు లక్షలు. లొసుగులుంటే కొటొ రెండు కొట్లో.
వాసిరెడ్డి అమర్నాథ్ కూడా లంచాలు ఇస్తాడా? పదేళ్ల క్రితం మాట. మా స్లేట్ తిరుపతి బిల్డింగ్ కు ఫైర్ NOC ఇవ్వడానికి జిల్లా స్థాయి అధికారి రూ.20 లక్షలు అడిగాడు . ఒళ్ళు మండిన నేను రాష్ట్ర స్థాయి అధికారికి ఫోన్ కొట్టా. జిల్లా వాడికి ఫుల్ అక్షింతలు. దెబ్బకు దిగొచ్చాడు.
ఇప్పుడు స్కూల్స్ పెట్టేవారు ఫార్మాసూరులు... విదేశీ ఈక్విటీ వారు. దోపిడీ రాబొయే రోజుల్లో ఇంకా ఎక్కువ వుంటుంది .
కానీ మనసుంటే మార్గముంటుంది. సమస్యకు పరిష్కారముంటుంది .
భూముల ధరలు విపరీతంగా పెరిగాయి . హైదరాబాద్ నడి బొడ్డున ఒక ఎకరం నలబై యాభై కోట్ల కు మించి ధర పలుకుతోంది. దీని తోడు అవినీతి . రియల్ ఎస్టేట్ వారు కనీసం ఇరవై శాతం నిర్మాణ వ్యయం లంచాల రూపంలో ఇవ్వాలి. లేకపోతే నిర్మాణం పూర్తి కాదు. అమీర్పేట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనాలంటే యాబై నుంచి డెబ్భై లక్షలు. ముప్పై ఏళ్ళ జీతం EMI లు కట్టడానికే సరిపోతుంది . నిజమే. ఒక్క సారి మార్వాడి కమ్యూనిటీ వైపు చూద్దాము. ఎన్ని కోట్లున్నా అద్దె ఇంటిలో ఉండడానికే ఇష్టపడుతారు . సొంత ఇంటి కోసం కాపిటల్ లాక్ చేసుకోరు. నలభై లక్షల బ్యాంకు అప్పు అయితే నెలకు నలబై వేలు వడ్డీ. అదే ఫ్లాట్ 15 - 20 వేలకు నెలకు రెంట్ కు దొరుకుతోంది.
మేము అద్దెకు ఉంటున్న ఇల్లు ఇప్పుడు మార్కెట్లో ముప్పై కోట్లకు పోతుంది. నేను ఇచ్చే అద్దె పది పైసల కంటే తక్కువ. అద్దె ఇంట్లోఉన్నోడు తెలివైనోడు. ఏదో తాము నివసించడానికైతే ఓకే కానీ ఫ్లాట్ కొని అద్దెకు ఇచ్చే వాడు ఆర్థిక తేలితేటలు లేనోడు . సొంతిల్లు అనే సెటిమెంట్ తో ఇంట్లో మంటలు పెట్టుకొనే వారు ఎందరో?
సిటీలో మెట్రో వచ్చింది. కాస్త ఇంటీరియర్ లో ఇల్లు తీసుకొంటే కాలుష్యం తక్కువగా ఉంటుంది.
సమస్యలున్నాయని పిల్లల్ని కనకపోతే అదే పెద్ద సమస్య అవుతుంది. చేతిపై చిన్న కురుపు వచ్చిందని చేతిని నరుక్కుంటే ఎలా ?
పాతరాతి యుగం నుండి తీసుకొంటే మొన్నటి దాకా యుద్ధాలు ఆహారకొరత.. రోగాలు . ఆ రోజుల్లో వాళ్ళు పిల్లల్ని కనొద్దు అనుకొనుంటే మానవజాతి అంతరించి పోయివుండేది. ఇప్పుడు మనం వున్నది చాలా సుఖాల కాలం. దీనికే భయపడితే ఎలా ?
ఆలోచన మారాలి
2. "ఈ కాలం అమ్మాయిల్ని బానిసలుగా చూస్తున్నారు.. పెళ్లి చేసి ఆమెను దాసిగా మార్చాలా ?"
"ఈ కాలం అమ్మాయిలు కాపురం చెయ్యరు . ఎవడోతోనే సంభంధం ఉంటుంది. చివరకు బ్లాక్ మెయిల్ కు దిగుతారు "
నా సమాధానం !
ఎంత నిరాశావాదమో !
మొత్తం సమాజం ఇలా చెడిపోయిందా ?
భార్యల్ని గౌరవించే .. ఆమెతో ఇంటి పని వంటపని పంచుకొనే భర్తలే లేరా ?
సోషల్ మీడియా పై నిరాశావాదం వ్యాప్తి చెయ్యడం కాదు .. ప్రతి తల్లితండ్రి తమ కొడుక్కి మంచి బుద్ధులు చెప్పొచ్చు కదా ?
ఎక్కడో పది మందిలో ఒక్కరు దారి తప్పితే అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఇలాగే ఉంటారని నిందిస్తే ఎలా ?
తల్లితండ్రిగా తమ బాధ్యత మరచి .. పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి .. వారు పక్కదారి పట్టేలా చేసుకొని .. అటు పై ఇంట్లో ఎలుకలున్నాయి అని ఇంటినే తగలబెట్టుకొంటే ఎలా?
పెళ్లి చేసుకోము అని చెబితే .. అదేదో సమాజం పట్ల మీ నిరసన కాదు . పెళ్లి చేసుకోక పొతే సఫర్ అయ్యేది మీరు. ఒంటరిగా జీవించడం అంటే స్ట్రెస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లాంటి వాటికి తలుపులు తెరవడం . కొండ నాలుక్కి మందేయబోయి ఉన్నా నాలుక ను పోగొట్టుకోకండి . సమాజానికేమీ కాదు. అది సర్దుకొంటుంది. మీ బతుకులు తగలెబెట్టుకోవద్దు .
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
కావాల్సింది క్రిటికల్ థింకింగ్ .
సోషల్ మీడియా లో గంటల కొద్దీ దేవులాడితే బుర్ర నీరసించి కుశాగ్ర బుద్ధి పోతుంది .
ఇక్కడ శాడిస్ట్ లు ఎక్కువ మంది. తమ బతుకు తగలబడింది కాబట్టి ప్రపంచమంతా నాశనం అయిపోవాలని కోరుకొనే వారి సంఖ్య ఎక్కువ.
టన్నుల కొద్దీ విషాన్ని కక్కుతున్నారు (నా పోస్ట్ లపై వచ్చే కామెంట్స్ గురించి కాదు). మొన్న మెసెంజర్ లో ఒక పోస్ట్ ను పంపారు . ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు పోస్ట్ పంపిన వ్యక్తి చెప్పేదేమిటంటే ఆమె భర్త తాగుబోతు. భరించలేక ఆయన్ని వదిలేసింది. ఇప్పుడే మరో స్త్రీ సంబంధం అట. అక్కడి దాక ఆమె పర్సనల్ .
'మగాడిని నమ్మొద్దు .. అని విషం కక్కుతూ పోస్ట్ లు . ఆమె బ్రెయిన్ వాష్ మామూలుగా లేదు .
సమాజంపైకి విషం చిమ్ముతున్న ఇలాంటి వారి పై పోలీస్ లు సుమోటొగా కేసులు పెట్టాలి .
మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఇలాంటి ప్రచారాలకు చిక్కుతారు. ఎకో ఛాంబర్ ... తమ ఆలోచన కు దగ్గర ఉన్న పోస్ట్ ల తో ప్రభావితం అయ్యి ఆ భావజాలాన్ని మరింత ఎక్కించుకొంటారు. తమకు దగ్గరయిన మహిళల్ని లొంగ దీసుకొని రకరకాల దందాలు చేసిన క్రిమినల్స్ ఎంతో మంది ఉన్నారు . సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి.
తాళాలు తయారు చేసే కంపెనీ ప్రతి తాళానికి ఒకటి రెండు కీస్ ను తయారు చేస్తుంది .
పరిష్కారం లేని సమస్య ఉండదు .
కావలసింది ఆశావాదం .. పాజిటివ్ థింకింగ్ .. క్రిటికల్ థింకింగ్ .
ఐబొమ్మ రవి హీరోనా..!
పిల్లలని గాలికి వదిలి సోషల్ మీడియా లో నిరాశావాదం వ్యాపి చేసే వారు తమ తప్పును గ్రహించాలి .
పిల్లలు మన చేతిలో మైనం బొమ్మలు . మనం మంచి దారిలో నడిస్తే .. మంచి చేబితే వింటారు . విశ్వ విజేతలుగా నిలుస్తారు .
చివరిగా ఒక మాట . బ్లేడ్ తో గడ్డం గీసుకోవచ్చు . గొంతు కూడా కోసుకోవచ్చు .
సోషల్ మీడియా తో గొంతు కోసుకోవద్దు . వినదగు నెవ్వరు చెప్పిన ... విన్నాక .. ఎవరు నిరాశావాదం వ్యాప్తి చేస్తున్నారో వాటి ఫలితం ఎలా వుంటుందో ఆలోచించాలి .
గత వారం రోజులుగా ఐ బొమ్మ రవి కి సపోర్ట్ గా ఎన్నో పోస్ట్లు . రీల్స్ . వీటి ఫలితం .. పోలీస్ లు పకడ్బందీగా ఉచ్చు బిగిస్తున్నారు .
పోలీస్ లకు సవాలు చేసి అతను మొదటి తప్పు చేసాడు .
ఇప్పుడు పోలీస్ లను ట్రోల్ చేస్తూ అతని అభిమానులు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు .
ఒక మోసానికి మరోటి పరిష్కారం అవుతుందా ?
ఆలోచించండి .
అతన్ని సమర్థిస్తూ పోస్ట్ లు పెట్టిన వారిలో కొంతమంది ఇప్పుడు చిప్పకూడు తినబోతున్నారు . ఫ్రీగా సోషల్ మీడియా వచ్చింది కదా అని ఏది పడితే అది వాగితే ఎలా ?
సినిమా వారు దోపిడీ చేస్తున్నారు .
పచ్చి నిజం .
కానీ దానికి పైరసీ పరిష్కారమా ?
పైరసీ చేసే వ్యక్తి హీరో అయిపోతాడా ?
నేరం చెయ్యడం .. నేరాన్ని సమర్తించడం రెండూ నేరాలే .
నిన్నటి దాక సోషల్ మీడియా హీరో అయిన సజ్జనార్ ఒక్కసారిగా దోషి అయిపోయాడా ?
నేరాన్ని సమర్థించే సమాజానికి భవిషత్తు లేదు
సినిమా ధరలు ఎక్కువైతే దానికి పైరసీ పరిష్కారమా ?
ఇలాగైతే రేపు సూపర్ మార్కెట్ లపై దుకాణాల పై పడి దోచుకొని అందరికీ పంచి పెట్టే రాబిన్ హుడ్ లు పుట్టుకొని రారా?
"మీ ఇంట్లో రెండు బెడ్ రూమ్స్ వున్నాయి .. నేను ఒకటి తీసుకొంటాను" అని ఎవరైనా ఇంటిని ఆక్రమిస్తే ?
"బాగా తిని కడుపు పెంచావు .. నా తిండి లో సగం నాకు" అని ఎవరైనా ఇంటిలోకి దూరితే ?
ఇప్పటికి సినిమాల వరకే ఎర్ర చందనం స్మగ్లర్లు హీరోలు. జనాల్లో రాబిన్ హుడ్ ఆరాధన పెరిగితే .. దేశం బ్రెజిల్ మెక్సికో కొలంబియా అవుతుంది .
ధర్మో రక్షతి రక్షితః !

