Moral Story: చెడ్డవారు అని తెలిసినా స్నేహం చేస్తే జరిగేది ఇదే.. ఈ కోతి కథ చదవాల్సిందే..!
Moral Story: స్నేహానికి చాలా మంది విలువ ఇస్తారు. స్నేహానికి మంచి- చెడు అనే తేడా ఉండదు అని చాలా మంది భావిస్తారు. కానీ.. చెడ్డ వారితో స్నేహం చేయడం వల్ల అనుకోని ప్రమాదంలో పడిపోతారు. అందుకు ఈ కథ నిదర్శనం..

Moral Story
అనగనగా ఒక అడవిలో ఓ తోడేలు ఉండేది. అడవిలో జంతువులను చంపి తిని, తన ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్లి మేకల్ని చంపి, అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది.
ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది. యజమానులకు తెలీకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒక రోజు కోతి ‘ నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్తావా? నీ పనితనం చూడాలనుంది’ అని తోడులేను అడిగింది. దానికి తోడేలు ‘ ఈ రాత్రికే నిన్ను తీసుకువెళ్తాను, సిద్ధంగా ఉండు’ అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది.
తోడేలు కారణంగా కోతికి శిక్ష..
మరో వైపు, తమ మేకలు అప్పుడప్పుడూ మాయమౌతుండటాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లడాన్ని యువకులు గమనించారు. మేకలు ఎలా మాయం అవుతున్నాయో వారికి అర్థమైపోయింది. వెంటనే తోడేలు పై కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు.
ఆ తోడులు పక్కనే ఉన్న కోతిని వాళ్లు కొట్టడం మొదలుపెట్టారు. దానికి ఆ కోతి ‘ మీ మేకలు తినడానికి వచ్చింది నేను కాదు తోడేలు. నన్ను ఎందుకు కొడుతున్నారు? నన్ను వదిలేయండి ’ అని కోతి ప్రాథేయపడింది. కానీ... ఆ యువకులు వినలేదు. నువ్వు ఆ తోడేలు ఫ్రెండే కదా.. నిన్ను ఎందుకు వదిలిపెతాం అని కోతిని కూడా చితకబాదారు. చెడు స్నేహాలు చేస్తే.. ఏ తప్పు చేయకపోయినా శిక్ష పడుతుంది అని కోతికి అర్థమైంది. ఈ కథలో కోతికి.. తోడేలు మంచిది కాదు అని తెలుసు. కానీ, తెలిసినా కూడా స్నేహం చేయడం వల్లే.. కోతికి కూడా దెబ్బలు పడ్డాయి.
కథలో నీతి...
చెడ్డ వాళ్లతో స్నేహం చేస్తే మనలోని మంచి తనన్నా కూడా ఎవరూ గుర్తించరు.
పిల్లలకు ఈ కథ ఎందుకు చెప్పాలి:
మంచి స్నేహితుల విలువను నేర్పుతుంది:
ఈ కథ పిల్లలకు ఎవరితో స్నేహం చేయాలో, ఎవరినుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది.
తప్పు మార్గంలో నడిస్తే కలిగే ప్రమాదం..
మనం తప్పు చేయకపోయినా, తప్పు చేసే వారి వెంట ఉన్నా.. శిక్ష అనుభవించక తప్పదు. నక్కతో కలిసి దొంగతనం చేసిన కోతికి అదే జరిగింది.
నైతిక విలువలను పెంపొందిస్తుంది:
నిజాయితీ, మంచి ప్రవర్తన .. పిల్లల్లో నైతిక విలువలను పెంచుతాయి.