- Home
- Feature
- Stranger Fish: నీళ్ళు వదిలి..నేల మీదకు వచ్చి పిల్లల్ని కనే విచిత్రమైన చేప గురించి మీకు తెలుసా?
Stranger Fish: నీళ్ళు వదిలి..నేల మీదకు వచ్చి పిల్లల్ని కనే విచిత్రమైన చేప గురించి మీకు తెలుసా?
Stranger Fish: చేపలు నీటిలో తప్పించి బయట నేల మీద జీవించలేవు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఒక్క సారి నీళ్లు వదిలి బయట పడితే అవి చాలా షార్ట్ టైమ్ లోనే చనిపోతాయి. కానీ నీటిలోంచి నేల మీదకు వచ్చి పిల్లల్ని కనే చేప గురించి మీకు తెలుసా?
చేపలు నీటిలోంచి బయటకు వస్తే బ్రతకడం కష్టం..
ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. చాలా జీవులు తమ సహజగుణం వదిలి అందరికి ఆశ్చర్చానికి గురిచుస్తుంటాయి. ముఖ్యంగా చేపలు నీటిలోనే ఉంటాయని అందరికి తెలుసు. అవి నీరు వదిలి బయటకు వస్తే బ్రతకడం కష్టం. నీటి బయటకు వస్తే... చేపలు ఊపిరి ఆడక నీటి వెలుపలికి వస్తే చనిపోతాయని మనందరికీ తెలుసు. కానీ, ఈ ప్రకృతి నియమాలను పూర్తిగా తలకిందులు చేస్తూ, సముద్రపు నీటిని వదిలి నేరుగా నేల మీదకు వచ్చి గుడ్లు పెట్టే ఒక విచిత్రమైన చేప గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ అద్భుతమైన చేపల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేల మీద గుడ్లు పెట్టే చేప
ఆ చేప మరేదో కాదు 'కాలిఫోర్నియా గ్రూనియన్' (California Grunion). ఈ జాతికి చెందిన చేపలు తమ సంతానోత్పత్తి కోసం కాలిఫోర్నియా సముద్ర తీరాలలో రాత్రి సమయంలో ఒక అద్భుతమైన ఘట్టానికి తెరలేపుతాయి. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడే సమయంలో, లక్షలాది సంఖ్యలో వెండిలా మెరిసే ఈ చేపలు నీటి నుంచి బయటకు వచ్చి పొడి ఇసుక మీదకు కొట్టుకుంటూ వస్తాయి. దీన్నే స్థానికంగా 'గ్రూనియన్ రన్' (Grunion Run) అని పిలుస్తారు. ఇది కేవలం ప్రమాదవశాత్తు బయటకు రావడం కాదు, తమ జాతిని కాపాడుకోవడానికి ఆ చేపలు వేసే ఒక అత్యంత తెలివైన ప్రణాళిక.
ఎందుకు అలా చేస్తాయో తెలుసా?
సాధారణంగా సముద్రంలో ఉండే షార్క్ చేపలు .. ఇతర పెద్ద జలచరాలు ఈ చిన్న చేపలను సులభంగా వేటాడి తింటాయి. ఆ ప్రాణభయం నుంచి తమ గుడ్లను, పిల్లలను రక్షించుకోవడానికే ఇవి ఈ సాహస మార్గాన్ని ఎంచుకున్నాయి. ఆడ చేప నీటిలో నుంచి బయటకు వచ్చి, డ్రిల్లింగ్ మిషన్‌లా తన తోకను ఉపయోగిస్తూ పొడి ఇసుకలోకి చొచ్చుకుపోయి రంధ్రం చేస్తుంది. ఆ తర్వాత మగ చేపలు దాని చుట్టూ తోడుగా చేరి సహాయపడతాయి. అలా ఇసుక లోపల గుడ్లను అత్యంత భద్రంగా దాచిపెట్టి, మళ్లీ వెనక్కి వచ్చే సముద్రపు అలల సహాయంతో సురక్షితంగా సముద్రంలోకి జారుకుంటాయి.
చాలా విచిత్రమైన విషయం ఏంటంటే?
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ చేపలకు ఎలాంటి క్యాలెండర్లు ఉండవు. కానీ చంద్రుడి గమనాన్ని, సముద్రపు అలల కదలికలను ఇవి కచ్చితంగా అంచనా వేస్తాయి. నెలలో సముద్రపు అలలు అత్యంత ఎత్తుగా లేచే రాత్రులు మాత్రమే ఇవి ఇసుక మీదకు వస్తాయి. అలా ఇసుకలో భద్రపరిచిన గుడ్లు, అలలు తగలని ఎండిన ప్రాంతంలో దాదాపు 10 రోజుల పాటు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ఉంటాయి.
అసలైన మ్యాజిక్ పదవ రోజు తర్వాత జరుగుతుంది. సరిగ్గా పది రోజుల తరువాత సముద్రం నుంచి వచ్చే ఒక పెద్ద అల ఆ ఎండిన ఇసుకను తాకగానే, ఆ నీటి తడి తగలడమే ఆలస్యం... ఇసుకలో దాగున్న లక్షలాది గుడ్లు కేవలం 10 సెకన్ల లోపే పగిలిపోతాయి. అలా పుట్టిన చేప పిల్లలు వెంటనే ఆ నీటితో పాటు తమ సొంత ఇల్లైన సముద్రంలోకి సురక్షితంగా చేరుకుంటాయి. నీళ్లలో బతికే చేప పిల్లలను రక్షించుకోవడం కోసం నేల మీదకు వచ్చి ఇవి చేసే ఈ సాహసయాత్ర ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన సృష్టి రహస్యం.





