Golden Tree: పసిఫిక్ మహాసముద్రంలో బంగారు చెట్టు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
Golden Tree: శాస్త్రవేత్తలు సముద్రాలపై నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో 360 నుంచి 529 మీటర్ల లోతులో బంగారంలా మెరిసే చెట్టులాంటి పగడపు దిబ్బను కనుగొన్నారు. చెట్టు ఆకారంలో ఉన్న ఈ జీవి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పసిఫిక్ మహాసముద్రంలో బంగారు చెట్టు
పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు కొత్త బంగారు చెట్టును కనుగొన్నారు. అది ప్రాణమున్న చెట్టు. ఆ చెట్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. కోస్టారికా తీరానికి దగ్గర్లో పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న పర్వతాలను పరిశోధించారు. ఈ క్రమంలో వారు ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త పగడపు దిబ్బ (కోరల్) జాతిని కనుగొన్నారు. దీని జన్యువులు, శరీర నిర్మాణం చాలా భిన్నంగా ఉండటంతో, శాస్త్రవేత్తలు దీనికోసం ఏకంగా ఒక కొత్త కుటుంబ వర్గీకరణనే సృష్టించారు.
సముద్ర ఉపరితలానికి 360 నుంచి 529 మీటర్ల లోతులో ఈ అరుదైన పగడపు దిబ్బలు కనిపించాయి. కొమ్మలతో అచ్చం చెట్టులా కనిపిస్తున్న ఇవి, ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉన్నాయి. 'జూకీస్' (ZooKeys) అనే సైన్స్ జర్నల్ ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. దాని ఆకారం, రంగు చూసి బంగారు చెట్టుగా పిలిచారు శాస్త్రవేత్తలు.
మెరుస్తున్న 'బంగారు చెట్టు'
ఈ కొత్త జాతి పగడపు దిబ్బల్లో కొన్ని ఒక మీటరు కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. శాస్త్రవేత్తలు ష్మిట్ ఓషన్ ఇన్స్టిట్యూట్ (Schmidt Ocean Institute) కు చెందిన 'ఫాల్కర్', 'ఫాల్కర్ టూ' నౌకల ద్వారా 2019, 2023లో పరిశోధనలు చేశారు. అప్పుడు వారు 'సుబాస్టియన్' (SuBastian) అనే రిమోట్ కంట్రోల్ జలాంతర్గామి (ROV) సాయంతో వీటి నమూనాలను సేకరించారు. సముద్రం అడుగున 'బ్రిటిల్ స్టార్స్' (Brittle Stars) అనే నక్షత్ర చేపల్లాంటి జీవులు నిండి ఉన్న రాతి ప్రాంతాల్లో పరిశోధకులు ఈ పసుపు రంగు పగడపు దిబ్బలను గుర్తించారు.
నక్షత్రాల మధ్య మెరుస్తున్న చెట్లలా ఇవి కనిపించాయి. అందుకే శాస్త్రవేత్తలు దీనికి 'లారింక్' (Laurinque) అని పేరు పెట్టారు. 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ సృష్టించిన ఎల్విష్ భాషలో 'లారింక్' అంటే "బంగారు చెట్టు" అని అర్థం. అలాగే, దీని చుట్టూ నక్షత్ర చేపలు ఉండటంతో, ఎల్విష్ భాషలో "నక్షత్రం లాంటి" అని అర్థం వచ్చేలా 'ఎలెన్యా' (Elenya) అనే పేరును కూడా వారు దీనికి జోడించారు.
డీఎన్ఏ బయటపెట్టిన కొత్త రహస్యం
ఈ పగడపు దిబ్బ ఏ పరిణామ కుటుంబానికి చెందుతుందో కనిపెట్టడం శాస్త్రవేత్తలకు మొదట్లో పెద్ద సవాలుగా మారింది. వారు సాధారణంగా పగడపు దిబ్బలను గుర్తించే 3 జన్యువులను పరీక్షించినప్పుడు, అవి వేర్వేరు కుటుంబాలను చూపించాయి. దీంతో శాస్త్రవేత్తలు ఒకేసారి వందలాది జన్యువులను పోల్చి చూసే 'ఫైలోజెనోమిక్స్' (Phylogenomics) అనే అత్యాధునిక పద్ధతిని వాడారు.
ఈ జీవి ఇప్పటివరకు తెలిసిన ఏ పగడపు దిబ్బ కుటుంబానికీ చెందదని, ఇది పూర్తిగా ఒక కొత్త పరిణామ శాఖ అని ఆ పరీక్షల్లో తేలింది. అందుకే పరిశోధకులు దీనికి 'లారింక్విడే' (Laurinqueidae) అనే కొత్త కుటుంబం పేరు పెట్టి, 'లారింక్' అనే కొత్త జాతి కింద వర్గీకరించారు.

