Gold: మనదేశంలోని ఇళ్లల్లో ఉన్న బంగారం ఎన్ని కిలోలు? ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది?
Gold: బంగారాన్ని మన దేశంలో ఎక్కువగానే కొంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనదేశం కన్నా ఇతర దేశాల దగ్గరే ఎక్కువ గోల్డ్ ఉంది. ప్రపంచంలో ఎక్కువ బంగారం ఏ దేశం దగ్గర ఉందో తెలుసుకోండి.

ఎక్కువ బంగారం ఉన్న దేశం ఏది?
దేశ ఆర్ధిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. మనదేశంలో బంగారాన్ని ఎంతో ఇష్టంగా కొంటారు. అందుకే ప్రపంచంలో మనదేశంలోనే బంగారం ఎక్కువగా ఉందనుకుంటారు. కానీ ఇండియా కన్నా ఇతర దేశాల్లోనే అధిక బంగారం ఉంది. సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల ఆధారంగా చూస్తే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కలిగిన దేశం అమెరికా. అమెరికా కేంద్ర బ్యాంకు వద్ద ఏకంగా 8,133 టన్నుల మేర పసిడి నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఇటలీ దాదాపు 2,451 టన్నులతో, చైనా 2,346 టన్నులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రష్యా 2,282 టన్నులతో నాలుగో స్థానంలో, స్విట్జర్లాండ్ 1,039 టన్నులతో ఐదో స్థానంలో ఉన్నాయి. మన దేశానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 880 టన్నుల నిల్వలతో ఆరో స్థానంలో ఉంది. జపాన్, పోలాండ్, టర్కీ, ఉజ్బెకిస్థాన్ లాంటి దేశాలు ఆ తర్వాత నిలిచాయి.
ఇళ్లల్లో ఉండే బంగారం
కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారు నిల్వలు గురించి పక్కన పెడితే.. ప్రజల వ్యక్తిగత వాడకం విషయంలో మాత్రం లెక్కలు ఉన్నాయి. బంగారం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మన దేశంలో పురాతన కాలం నుంచే పసిడి కొనుగోలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వివాహాలు, పండుగలు, శుభకార్యాల సమయంలో ఆభరణాలు కొంటారు. తాజా అంచనాల ప్రకారం భారతీయుల ఇళ్లలో దాదాపు 25 వేల టన్నుల పసిడి ఆభరణాలు, నాణేల రూపంలో భద్రంగా ఉంది. ఈ బంగారం ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాల సెంట్రల్ బ్యాంకుల నిల్వల కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ కావడం విశేషం.
మన ఇళ్లల్లో 25వేల టన్నుల బంగారం
మన పూర్వీకులు ప్రారంభించిన ఈ అలవాటు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, పెద్ద ఆర్థిక భరోసా కూడా. బంగారం ఇంట్లో ఉంటే అనుకోని కష్టాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అది ఆదుకుంటుందనే ధైర్యం ఉంటుంది. చైనా లాంటి దేశాల బ్యాంకులు ఇటీవల భారీగా బంగారం పోగుచేస్తున్నప్పటికీ, ఇంట్లోని బంగారం నిల్వల్లో భారతీయులను అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. భారతీయ కుటుంబాల చేతుల్లో ఉన్న ఈ 25 వేల టన్నుల పుత్తడి దేశ ప్రజల అంతర్గత ఆర్థిక శక్తికి తిరుగులేని ప్రతీకగా నిలుస్తోంది.

