RBI : సైబర్ దొంగతనాలకు 'కిల్ స్విచ్' తో చెక్.. అంటే ఏమిటో తెలుసా..?
డిజిటల్ లావాదేవీలు ఏ స్ధాయిలో పెరిగాయో సైబర్ నేరాలు కూడా అదేస్ధాయిలో పెరిగాయి. ఈ క్రమంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఆర్బిఐ కొత్తకొత్త నిబంధనలు తీసుకువస్తోంది. అలాంటిదే ఈ కిల్ స్విచ్… అంటే ఏమిటో తెలుసా..?

సైబర్ నేరాలపై ఆర్బిఐ సీరియస్ యాక్షన్..
డిజిటల్ ప్రపంచంలో ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి కేటుగాళ్ల ఆట కట్టించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పక్కా ప్లాన్‌తో ముందుకు వచ్చింది. కేవలం లావాదేవీల వేగాన్ని తగ్గించడమే కాకుండా, సీనియర్ సిటిజన్ల కష్టార్జితానికి భద్రత కల్పించేలా 'కిల్ స్విచ్' (Kill Switch) అనే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తోంది.
ఏమిటీ కిల్ స్విచ్..?
మీ ఫోన్ లేదా బ్యాంక్ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరుగుతోందని అనిపించిన వెంటనే అలర్ట్ కావచ్చు. కేవలం ఒక్క క్లిక్‌తో మీ అన్ని డిజిటల్ పేమెంట్ సర్వీసులను (UPI, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్) తక్షణమే నిలిపివేసే పవర్‌ఫుల్ బటన్ ఇది.
సాధారణంగా సైబర్ మోసం జరిగాక కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి అకౌంట్ బ్లాక్ చేయించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. కానీ ఈ 'కిల్ స్విచ్' ద్వారా సెకన్ల వ్యవధిలో మన నగదు ప్రవాహాన్ని మనమే ఆపేయొచ్చు.
వృద్ధుల కోసం మరో నిబంధన...
వృద్ధులను టార్గెట్ గా చేసుకునే అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఆర్బిఐ మరో కీలక రూల్ తీసుకువస్తోంది. వృద్ధుల బ్యాంక్ అకౌంట్ నుండి పెద్దమొత్తంలో నగదు బదిలీ అయ్యేటప్పుడు బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నాయి... ఇందుకోసమే డబుల్ వెరిఫికేషన్ సిస్టమ్ తీసుకువస్తున్నారు.
70 ఏళ్లు పైబడిన వారు ఒక పరిమితి (ఉదాహరణకు రూ.50,000) దాటి నగదు బదిలీ చేసేటప్పుడు బ్యాంకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నాయి. వారి అకౌంట్‌కు లింక్ అయి ఉన్న ఒక 'నమ్మకస్తుడైన వ్యక్తి' (కుమారుడు/కుమార్తె/బంధువు) మొబైల్‌కు కూడా అలర్ట్ వెళ్తుంది. వారు కూడా ఓకే చెబితేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఇది వృద్ధులను తప్పుదోవ పట్టించి చేసే మోసాలను 100% అడ్డుకుంటుంది.
ఎందుకీ ప్రత్యేక శ్రద్ధ..?
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెక్నాలజీపై అవగాహన తక్కువగా ఉన్న సీనియర్ సిటిజన్లనే టార్గెట్ చేస్తున్నారు.
1. నకిలీ కాల్స్ : కేవైసీ (KYC) అప్డేట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్
2. లింక్ క్లిక్స్ : పెన్షన్ లేదా బహుమతులు వచ్చాయని నమ్మించి లింకులు పంపడం.
ఇలాంటి సమయాల్లో వృద్ధులు కంగారుపడి ఏదైనా తప్పు చేసినా, ఈ కొత్త రూల్స్ వారిని ఆర్థికంగా దెబ్బతినకుండా కాపాడతాయి.

