Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకు ఉంటాయి.? దీనికి అసలు కారణం ఏంటంటే
Ceiling Fan: మన ఇళ్లలో కనిపించే చాలా ఫ్యాన్లలో మూడు రెక్కలే (బ్లేడ్స్) ఉంటాయి. కానీ విదేశాల్లో నాలుగు లేదా ఐదు రెక్కల ఫ్యాన్లు ఎక్కువగా కనిపిస్తాయి. మరి భారతదేశంలో మూడు రెక్కల ఫ్యాన్లనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.?

తక్కువ రెక్కలు.. ఎక్కువ గాలి
ఫ్యాన్‌లో రెక్కల సంఖ్య తక్కువగా ఉంటే గాలికి ఎదురయ్యే నిరోధం (Air Resistance) కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఫ్యాన్ మోటార్‌పై అదనపు భారం పడదు. మోటార్ వేగంగా తిరగగలుగుతుంది. అందుకే మూడు రెక్కల ఫ్యాన్లు అధిక వేగంతో తిరిగి గాలిని బలంగా నెట్టగలుగుతాయి. ఫలితంగా గది మొత్తం వేగంగా గాలి చేరుతుంది. భారతదేశం వంటి వేడి వాతావరణంలో ఎక్కువ గాలి అవసరం కాబట్టి మూడు రెక్కల డిజైన్ అత్యంత అనుకూలంగా భావిస్తారు.

భారతదేశం – విదేశాల వాతావరణంలో తేడా
అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో వాతావరణం ఎక్కువగా చల్లగా ఉంటుంది. అక్కడ ఫ్యాన్ల ప్రధాన పని చల్లదనం ఇవ్వడం కాదు, గదిలో గాలిని సమానంగా ప్రసరింపజేయడం మాత్రమే. అందుకే అక్కడ నాలుగు లేదా ఐదు రెక్కల ఫ్యాన్లు ఉపయోగిస్తారు. ఇవి నెమ్మదిగా తిరిగి గాలిని సమతుల్యంగా పంపిణీ చేస్తాయి. కానీ భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో చెమటను ఆరబెట్టి నేరుగా చల్లదనం కలిగించే వేగవంతమైన గాలి అవసరం అవుతుంది. మూడు రెక్కల ఫ్యాన్లు ఈ అవసరాన్ని బాగా తీర్చగలవు.
విద్యుత్ ఆదాలో మూడు రెక్కల ఫ్యాన్లదే పైచేయి
ఫ్యాన్‌లో రెక్కలు పెరిగితే దాని మొత్తం బరువు కూడా పెరుగుతుంది. బరువైన ఫ్యాన్‌ను తిప్పడానికి ఎక్కువ శక్తి గల మోటార్ అవసరం అవుతుంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. మూడు రెక్కల ఫ్యాన్లు తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల చిన్న మోటార్‌తోనే అధిక వేగంతో పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉండి, మంచి గాలి అందిస్తాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీ పరంగా కూడా ఇవి ఉత్తమ ఎంపికగా భావిస్తారు.
తక్కువ శబ్దంతో మెరుగైన పనితీరు
ఫ్యాన్‌లో ఎక్కువ రెక్కలు ఉంటే గాలిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అప్పుడు అధిక వేగంతో తిరిగేటప్పుడు ఎక్కువ శబ్దం వచ్చే అవకాశం ఉంటుంది. మూడు రెక్కల ఫ్యాన్లు అయితే తక్కువ శబ్దంతో పనిచేస్తాయి. ముఖ్యంగా రాత్రివేళ నిద్ర సమయంలో ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే భారతీయ కుటుంబాల్లో ఇవి ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి.
తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే డిజైన్
మూడు రెక్కల ఫ్యాన్ల తయారీలో లోహం లేదా ప్లాస్టిక్ వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. తయారీ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులకు సరసమైన ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే భారతీయ మార్కెట్‌లో ఎక్కువ కంపెనీలు మూడు రెక్కల ఫ్యాన్లను తయారు చేస్తాయి. ఇవి తక్కువ ఖర్చుతో, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ గాలి అందించే ఉత్తమ పరిష్కారంగా నిలిచాయి.

