River : ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం.. ఎక్కడుందో తెలుసా?
River: సముద్రం మధ్యలో ద్వీపాలు ఉండటం సహజమే.. కానీ ఓ మహానది మధ్యలోనే నదీ ద్వీపం ఉందంటే నమ్మగలరా? ప్రపంచంలోనే అలాంటి అతిపెద్ద నదీ ద్వీపం ఎక్కడుందో తెలుసా? అక్కడి అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం
ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఎక్కడుందో తెలుసా? సముద్రం మధ్యలో కాదు.. ఏకంగా ఓ భారీ నది మధ్యలో ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రత్యేకమైన ద్వీపం మన దేశంలోనే ఉంది. అదే అస్సాంలోని మజులీ ద్వీపం. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న మజులీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడిన మజులీ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో Largest River Islandగా నమోదైంది. అయితే ఇది సాధారణంగా మనం చూసే ద్వీపం కాదు. బ్రహ్మపుత్ర నది ప్రవాహం, వరదలు, నదీ కోతల కారణంగా దీని భౌగోళిక స్వరూపం కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.
నదీ కోతతో మారుతున్న రూపం
మజులీకి ఎంత ప్రత్యేకత ఉందో.. అంతే పెద్ద సవాలు కూడా ఉంది. బ్రహ్మపుత్ర నది వరదలు, ఒడ్డున జరిగే కోతల కారణంగా ఈ ద్వీపం గత కొన్ని దశాబ్దాల్లోచాలా భూభాగాన్ని కోల్పోయింది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపంగా రికార్డుకెక్కిన ఈ ప్రాంతం.. అదే నది కారణంగా క్రమంగా తన భూభాగాన్ని కోల్పోతోంది. మజులీ విస్తీర్ణానికి సంబంధించి చాలా తేడాలుంటాయి. నది కోతల కారణంగా ద్వీపం పరిమాణం స్థిరంగా ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
కేవలం ద్వీపం కాదు.. సంస్కృతికి కేంద్రం
మజులీకి మరో ప్రత్యేకత ఉంది. ఇది అస్సామీ నియో-వైష్ణవ సంస్కృతికి ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ ఉన్న సత్రాలు ఆధ్యాత్మికంగానే కాకుండా కళలు, సంగీతం, నాటకం, సాహిత్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా సత్రియా నృత్యం, భవోనా, సంప్రదాయ ముసుగు తయారీ వంటి కళారూపాలకు మజులీ ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ ద్వీపం ప్రకృతి, సంస్కృతి రెండింటినీ కలిపిన ప్రత్యేక ప్రాంతంగా నిలిచింది.
బ్రహ్మపుత్ర మధ్యలో ఇంత పెద్ద ద్వీపం ఎలా? ఎలా వెళ్లాలి?
నది ప్రవాహంలో మట్టి, ఇసుక, ఇతర అవక్షేపాలు పేరుకుపోవడం, నది ప్రవాహ మార్పులు వంటి సహజ ప్రక్రియలతో నదీ ద్వీపాలు ఏర్పడతాయి. మజులీ కూడా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో జరిగిన ఇలాంటి భౌగోళిక మార్పుల ఫలితమే. మజులీకి సాధారణంగా అస్సాంలోని జోర్హాట్ సమీపంలోని నిమతిఘాట్ నుంచి ఫెర్రీల ద్వారా చేరుకోవచ్చు. నదిపై పడవ ప్రయాణమే ఒక అద్భుతం.

