- Home
- Feature
- World’s Most Expensive Almond: ప్రపంచంలోనే ఖరీదైన బాదం పప్పు ఇదే.. వీటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత ధర
World’s Most Expensive Almond: ప్రపంచంలోనే ఖరీదైన బాదం పప్పు ఇదే.. వీటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత ధర
World’s Most Expensive Almond: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం మమ్రా రకం. కిలో రూ.2,800 నుండి రూ.4,500 వరకు ఉండే ఈ బాదంపప్పు ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం ఇదే.. కిలో ధర వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది బాదం పప్పు. మార్కెట్‌లో సాధారణంగా లభించే కాలిఫోర్నియా బాదం పప్పు కిలో ధర 8 డాలర్ల నుండి 12 డాలర్లు (సుమారు రూ. 700 నుండి రూ. 1,000) వరకు ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మమ్రా బాదం (Mamra Almonds) ధర మాత్రం కిలోకు 40 డాలర్ల నుండి 80 డాలర్ల కంటే ఎక్కువే ఉంటుంది. భారతదేశంలో వీటి రిటైల్ ధర కిలోకు రూ.2,800 నుండి రూ.4,500 వరకు ఉంటుంది. అంటే సాధారణ బాదం కంటే ఇది ఏకంగా 5 నుండి 7 రెట్లు ఎక్కువ ధర కలిగి ఉంటుంది.
యూరోపియన్ మార్కెట్లలో స్పెయిన్‌కు చెందిన మార్కోనా (Marcona) బాదం కూడా ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ, ఆసియా, ప్రపంచ డ్రై ఫ్రూట్ మార్కెట్లలో మాత్రం మమ్రా బాదందే అగ్రస్థానం. మరి ఈ మమ్రా బాదం అంత ప్రత్యేకంగా ఎందుకు మారింది? ఎందుకింత కాస్ట్లీగా ఉందో తెలుసా?
మమ్రా బాదం ప్రత్యేకతలు ఏమిటి?
మమ్రా బాదంపప్పు మిగతా సాధారణ బాదంపప్పుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దీని ఆకారం, రుచి, పోషకాల విషయంలో స్పష్టమైన తేడా ఉంటుంది.
• దోనె ఆకారం: సాధారణ కాలిఫోర్నియా బాదం ఫ్లాట్‌గా, పెద్దగా ఉంటే.. మమ్రా బాదం చిన్నగా, వంకీ తిరిగిన పడవ ఆకారంలో, ఒకింత ముడతలు పడిన పై పొరతో ఉంటుంది.
• అధిక నూనె శాతం: సాధారణ బాదంలో సహజ సిద్ధమైన నూనె 25% నుండి 30% వరకు మాత్రమే ఉంటుంది. కానీ మమ్రా బాదంలో ఏకంగా 50% కంటే ఎక్కువ నూనె శాతం, ఆరోగ్యకరమైన అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీనివల్ల ఇది చాలా రిచ్, వెన్న వంటి రుచితో నోట్లో వేస్తే కరకరలాడుతుంది.
• పోషకాల గని: ఎక్కువ నూనె శాతం, సహజ పెరుగుదల వల్లే ఇందులో విటమిన్ ఈ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, అవసరమైన మినరల్స్ అత్యధిక పరిమాణంలో లభిస్తాయి.
మమ్రా బాదం ఎందుకింత ఖరీదైనది?
మమ్రా బాదం ధర అంత ఎక్కువగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి..
• పరిమిత ఉత్పత్తి ప్రాంతాలు: ప్రపంచ బాదం ఉత్పత్తిలో మమ్రా బాదం వాటా 5 శాతం కంటే తక్కువే. ఇది కేవలం చల్లటి, ఎత్తైన పర్వత ప్రాంతాలలోని నదీ పరీవాహక ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. ప్రధానంగా ఇరాన్‌లోని జయాందేరుద్ బేసిన్, అఫ్గానిస్తాన్, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఇది పండుతుంది.
• సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు: కాలిఫోర్నియా బాదం తోటల్లో భారీ యంత్రాలు, ఆటోమేటిక్ హార్వెస్టింగ్ ఉపయోగిస్తారు. కానీ మమ్రా బాదాన్ని సాంప్రదాయ, ఆర్గానిక్, చేతులతో మాత్రమే సేకరించే పద్ధతుల్లో సాగు చేస్తారు.
• తక్కువ దిగుబడి: మమ్రా బాదం చెట్లు వసంతకాలంలో వచ్చే మంచుకు త్వరగా దెబ్బతింటాయి. ఆధునిక హైబ్రిడ్ రకాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ దిగుబడిని ఇస్తాయి.
ఆయుర్వేదం, సాంప్రదాయ మార్కెట్లలో భారీ డిమాండ్
దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాలలో, ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో మమ్రా బాదానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుదల, గర్భిణుల పోషణ, శారీరక శక్తి కోసం దీనిని ఒక ఔషధంగా వాడతారు. ఇందులోని రోస్టెడ్ చేయని సహజ సిద్ధమైన ఆయిల్ ప్రొఫైల్ వల్ల దీనికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఇతర ప్రముఖ బాదం రకాలు
• స్పెయిన్ మార్కోనా బాదం: స్పెయిన్‌లోని మెడిటరేనియన్ ప్రాంతంలో పండే ఈ బాదాన్ని 'క్వీన్ ఆఫ్ ఆల్మండ్స్' అని పిలుస్తారు. ఇది గుండ్రంగా, వెన్న వంటి తీపి రుచితో ఉంటుంది. యూరోపియన్ వ్యాపారంలో సాధారణ బాదం ధరకు రెట్టింపు ధర దీనికి ఉంటుంది.
• గుర్బంది బాదం: అఫ్గానిస్తాన్, కాశ్మీర్ ప్రాంతాల్లో పండే ఈ బాదం పరిమాణంలో చిన్నగా, కాస్త చేదు-తీపి కలగలిసి ఉంటుంది. ఇది కూడా ప్రీమియం రకమే అయినా మమ్రా బాదం కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది.
సాధారణ కాలిఫోర్నియా బాదం కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఈ ఇస్తుంది. కానీ, అత్యుత్తమ రుచి, అధిక నూనె శాతం, అరుదైన ఉత్పత్తి కారణంగా మమ్రా బాదం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్‌గా నిలిచింది.





