- Home
- Feature
- Dangerous River: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన నది ఇది.. దీనిలో నీటిని కూడా ఎవరూ తాకలేరు..!
Dangerous River: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన నది ఇది.. దీనిలో నీటిని కూడా ఎవరూ తాకలేరు..!
Dangerous River: నదులు అంటే.. మనం మంచి నీళ్లు గుర్తుకు వస్తాయి. ఆ నీటిని ఎలాంటి సంకోచం లేకుండా తాగొచ్చు అనుకుంటాం. కానీ, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదమైన నది ఒకటి ఉందని తెలుసా?

ప్రమాదకరమైన నది..
మనకు దగ్గరల్లో నదులు ఉన్నాయి అంటే.. అక్కడికి వెళ్లి సరదాగా ఈతలు కొట్టేవారు చాలా మందిని చూసే ఉంటారు. కానీ, ఓ నదిలో కాలు పెడితే.. క్షణాల్లో శరీరం ఉడికిపోతుంది. చిన్నపాటి జంతువులు అయితే.. ఆ నదిలో పడితే నిమిషాల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటాయి. వినడానికే భయంకరంగా ఉంది కదా.. నిజంగానే.. ఈ నది చాలా ప్రమాదకరంగా, భయంకరంగా ఉంటుంది. దీనినే బాయిలింగ్ రివర్ అని కూడా పిలుస్తారు. ఆ నది ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం...
అమెజాన్ అడవుల్లో డేంజరస్ రివర్..
దట్టమైన పెరూ అమెజాన్ అడవుల మధ్యలో 'షానాయ్-టింపిష్కా' (Shanay-Timpishka) అనే నది ప్రవహిస్తోంది. "సూర్యుడి వేడితో మరిగే నది" అని దీని అర్థం. దాదాపు 6.4 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నదిలోని నీటి ఉష్ణోగ్రత 45°C నుండి 100°C (మరిగే కాఫీ ఉష్ణోగ్రత) వరకు ఉంటుంది. ఈ నది నుండి నిరంతరం పొగలు చిమ్ముతూ ఉంటాయి. ఇందులో పడిన ఏ ప్రాణి అయినా క్షణాల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే.
ఈ నదిలో నీరు ఎందుకు అంత వేడిగా ఉంటుంది..?
సాధారణంగా భూమిపై వేడి నీటి బుగ్గలు లేదా మరిగే నదులు అగ్నిపర్వతాల సమీపంలో ఉంటాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... ఈ షానాయ్-టింపిష్కా నదికి సమీపంలో ఎక్కడా ఒక్క అగ్నిపర్వతం కూడా లేదు. అయినా ఈ నదిలో నీరు వేడిగా మరుగుతూ ఉండటం వెనక కారణం ఉంది. జియోలాజిస్ట్‌ల పరిశోధనల ప్రకారం... వర్షపు నీరు భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోయి, భూగర్భంలోని తీవ్రమైన వేడి వల్ల అత్యంత వేడెక్కుతుంది. ఆ తర్వాత భూమి పొరల్లో ఉన్న రంధ్రాలు, పగుళ్ల ద్వారా ఒత్తిడితో మళ్లీ పైకి తన్నుకొస్తుంది. అలా భూగర్భ వేడి నీరు నది రూపంలో ప్రవహిస్తూ వేడిగా ఉంటుంది.
స్థానికులు పూజించే నది...
ఈ నది ప్రమాదకరమైనదే అయినా, అక్కడి స్థానిక 'అషా నింకా' తెగ ప్రజలు దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వారు ఈ నదిని ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా, శక్తివంతమైన నయం చేసే మూలికా జలంగా పూజిస్తారు. స్థానిక గిరిజన వైద్యులు ఈ నది నీటిని, అక్కడ లభించే మూలికలను ఉపయోగించి రకరకాల వ్యాధులకు వైద్యం అందిస్తుంటారు.

