Mystery Sea : ఒక్క చేప కూడా లేని సముద్రం కాని సముద్రం.. ఏదో తెలుసా? ఎక్కడుంది?
ఈ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క చేప కూడా లేని సముద్రం కాని సముద్రం ఒకటుంది. అది ఏది? ఎక్కుడుంది? అసలు ఇందులో చేపలు, ఇతర జలచరాలు ఎందుకు ఉండవు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మృత సముద్రం
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన సముద్రాలు, సరస్సులు ఉన్నాయి. కొన్ని సముద్రాల్లో భారీ తిమింగలాలు కనిపిస్తే.. మరికొన్నింటిలో రంగురంగుల చేపలు, అరుదైన జలచరాలు సందడి చేస్తుంటాయి. కానీ ప్రపంచంలోని ఓ సరస్సు వీటన్నింటికీ భిన్నం... భారీగా నీటిని కలిగివున్నప్పటికీ ఇందులో చేపలు కనిపించవు… పెద్దపెద్ద జలచరాలు కూడా జీవించలేవు. చివరకు నీటి మొక్కలు సైతం పెరగలేవు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ సముద్రం పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే ఇజ్రాయెల్, జోర్డాన్ ప్రాంతాల మధ్య ఉన్న డెడ్ సీ (Dead Sea). అసలు ఈ నీటిలో చేపలు ఎందుకు బతకలేవు? మనుషులు కూడా ఈ నీటిలో మునిగిపోకుండా పైకి తేలుతారు, ఎందుకు? ఈ సరస్సుకు డెడ్ సీ అనే పేరు ఎందుకు వచ్చింది?
డెడ్ సీ అంటే ఏమిటి?
డెడ్ సీ అనే పేరులో సముద్రం ఉన్నప్పటికీ వాస్తవానికి ఇది ఒక ఉప్పునీటి సరస్సు. ఇది పశ్చిమాసియాలో జోర్డాన్‌కు తూర్పున, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలకు పశ్చిమాన విస్తరించి ఉంది. సముద్రాలతో నేరుగా ఎలాంటి అనుసంధానం లేని ఈ సరస్సుకు జోర్డాన్ నది సహా కొన్ని చిన్న నీటి ప్రవాహాల ద్వారా నీరు చేరుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన నీరు బయటకు వెళ్లేందుకు సహజమైన ప్రవాహాలు లేవు. అందుకే దీనిని ఎండోర్హెయిక్ సరస్సు (Endorheic Lake) అంటారు.
ఈ సరస్సు భూమిపై సముద్ర మట్టానికి అత్యంత దిగువన ఉన్న ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భౌగోళిక పరిస్థితులు, నీటిలోని అధిక ఖనిజాల సాంద్రత దీనిని ప్రపంచంలోని ఇతర నీటి వనరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
డెడ్ సీలో చేపలు ఎందుకు బతకలేవు?
డెడ్ సీకి ఉన్న అతిపెద్ద ప్రత్యేకత దానిలోని ఉప్పు సాంద్రత. సాధారణ సముద్రపు నీటిలో ఉప్పు సాంద్రత సగటున 3.5 శాతం ఉంటుంది. కానీ డెడ్ సీలో ఇది సుమారు 34 శాతం వరకు ఉంటుంది. అంటే సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే దాదాపు 9 నుంచి 10 రెట్లు ఎక్కువ ఉప్పు ఉంటుంది. ఇంతటి అధిక ఉప్పు సాంద్రత ఉన్న నీటిలో సాధారణ చేపలు జీవించడం అసాధ్యం. ఇలాంటి నీటితో చేపల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది. బయట ఉన్న నీటిలో ఉప్పు సాంద్రత విపరీతంగా ఎక్కువగా ఉండటంతో వాటి శరీర కణాల నుంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో చేపలు తీవ్ర ఒత్తిడికి గురై జీవించలేకపోతాయి.
ఒకవేళ నదుల నుంచి పొరపాటున ఏదైనా చేప ఈ సరస్సులోకి చేరినా.. ఇక్కడి నీటి పరిస్థితులను తట్టుకోవడం దానికి సాధ్యం కాదు. అందుకే డెడ్ సీలో సాధారణ చేపలు, ఇతర పెద్ద జలచరాలు కనిపించవు.
కానీ అత్యంత ఉప్పగా ఉండే వాతావరణాన్ని తట్టుకోగల ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఇక్కడ జీవిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియా, హాలోఫిలిక్ ఆర్కియా (Halophilic Archaea), ప్రత్యేక పరిస్థితుల్లో శైవలాలు కూడా మనుగడ సాగిస్తాయి.
సాధారణ జీవులు తట్టుకోలేని ఉప్పు సాంద్రతను ఈ సూక్ష్మజీవులు ప్రత్యేక జీవరసాయన ప్రక్రియల ద్వారా అధిగమిస్తాయి. అయితే ఇక్కడి పరిస్థితులు సాధారణ నీటి మొక్కలు, చేపలు, ఇతర జలచరాలకు అనుకూలంగా ఉండవు. అందుకే డెడ్ సీ జీవవైవిధ్యం విషయంలో చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా నిలిచింది.
డెడ్ సీలో మనుషులు దూకినా మునిగిపోరు.. ఎందుకు?
డెడ్ సీ ప్రపంచ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించడానికి మరో ప్రధాన కారణం ఇక్కడి నీటిపై మనుషులు సులభంగా తేలగలగడం. సాధారణంగా ఈత రాని వ్యక్తులు నీటిలోకి దిగితే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ డెడ్ సీలో మాత్రం నీటిపై వెల్లకిలా పడుకున్నా శరీరం సహజంగానే పైకి తేలుతుంది.దీనికి కారణం నీటి అధిక సాంద్రత.
నీటిలో ఉప్పు, ఇతర ఖనిజాలు ఎక్కువగా కరిగి ఉండటంతో సాధారణ సముద్రపు నీటి కంటే డెడ్ సీ నీటి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనిషి శరీరంపై పనిచేసే తేలే బలం (Buoyant Force) పెరుగుతుంది. ఫలితంగా నీటిలో శరీరం సులభంగా మునిగిపోకుండా తేలుతుంది. అందుకే ఇక్కడ పర్యాటకులు పుస్తకాలు చదువుతూ, ఫొటోలు దిగుతూ నీటిపై తేలడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే నీరు కళ్లలోకి, నోటిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. అలాగే నీటిలో ఎక్కువసేపు ఉండకూడదు.
పర్యాటకులను ఆకర్షిస్తున్న మృత సముద్రం
డెడ్ సీ కేవలం ఉప్పునీటి సరస్సు మాత్రమే కాదు.. భౌగోళికంగా, పర్యావరణపరంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ప్రదేశం. ఇక్కడి నీటిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ కారణంగా ఖనిజాలు కలిగిన మట్టి, నీటిని ఉపయోగించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.
మరోవైపు ఇక్కడి నీటి మట్టం తగ్గిపోవడం ప్రస్తుతం పర్యావరణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గడం, అధికంగా నీటిని వినియోగించడం, వాతావరణ పరిస్థితులు వంటి కారణాలు డెడ్ సీపై ప్రభావం చూపుతున్నాయి.
మొత్తంగా చూస్తే.. చేపలు బతకలేని నీటిలో మనుషులు సులభంగా తేలడం, సాధారణ సముద్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉప్పు ఉండటం వంటి ప్రత్యేకతలతో డెడ్ సీ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన సహజ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తోంది.













