Longest Train in Asia: ఆసియాలోనే పొడవైన రైలు.. ఎక్కడుందో తెలుసా? ఏకంగా 7 ఇంజిన్లు
Longest Train in Asia: రైలు సాధారణంగా ఎంత పొడవుటుంది? కిలోమీటర్ లేదా కిలోమీటరున్నర. అలాంటింది ఏకంగా నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న రైలును ఎప్పుడైనా చూశారా? భారతీయ రైల్వే రికార్డు సృష్టించిన ఈ ప్రత్యేక రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియాలోనే పొడవైన రైలు
సాధారణంగా రైలు వెళ్తుంటే దాని చివరి బోగీ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది ఏకంగా నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న రైలు వెళ్తే ఎలా ఉంటుంది? ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 354 వ్యాగన్లు, వాటిని లాగేందుకు ఏడు ఇంజిన్లు. భారతీయ రైల్వే సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ప్రత్యేక రైలు పేరు 'రుద్రాస్త్ర'. ఇంతకీ ఈ రైలు ఎక్కడ నడిచింది? దీని ప్రత్యేకతలేంటి?
ఆసియాలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైళ్లలో ఒకటి
భారతీయ రైల్వే చరిత్రలో 2025 ఆగస్టు 7 ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు భారతీయ రైల్వే ఏకంగా 4.5 కిలోమీటర్ల పొడవైన గూడ్స్ రైలును విజయవంతంగా నడిపింది. 'రుద్రాస్త్ర' పేరుతో రూపొందించిన ఈ రైలును తూర్పు మధ్య రైల్వే (East Central Railway) పరిధిలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉన్న గంజ్ ఖ్వాజా రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌లోని గఢ్వా రోడ్ వరకు ఈ రైలు ప్రయాణించింది. మొత్తం 209 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసింది. గంటకు సగటున 40.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. భారతీయ రైల్వే నిర్వహించిన ఈ ప్రయోగం ఆసియాలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైళ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
354 వ్యాగన్లు.. ఏడు ఇంజిన్లు!
రుద్రాస్త్ర రైలు ప్రత్యేకత దాని పొడవు మాత్రమే కాదు. ఇందులో ఉన్న వ్యాగన్లు, ఇంజిన్లు కూడా. సాధారణంగా ఒక గూడ్స్ రైలులో ఉండే వ్యాగన్ల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇందులో ఉన్నాయి. 6 సరకు రైళ్లను ఒకేదగ్గర కలిపి ఒకే రైలుగా రూపొందించారు. మొత్తం 354 వ్యాగన్లను ఒకదానికొకటి అనుసంధానించి ఈ రైలును రూపొందించారు. వీటి మొత్తం పొడవు సుమారు 4.5 కిలోమీటర్లు. ఒక్కో బోగీ సుమారు 72 టన్నుల సరకు మోయగలదు.
ఇంత పెద్ద రైలును ఒకే ఇంజిన్‌తో లాగడం సాధ్యం కాదు. అందుకే రైల్వే అధికారులు ఏకంగా ఏడు ఇంజిన్లను ఉపయోగించారు. ముందు భాగంలో రెండు ఇంజిన్లను ఏర్పాటు చేయగా, ప్రతి 59 వ్యాగన్ల తర్వాత మరో ఇంజిన్‌ను అమర్చారు. ఇలా రైలు పొడవునా ఇంజిన్లను ఏర్పాటు చేయడం వల్ల అన్ని వ్యాగన్లకు అవసరమైన శక్తి అందుతుంది.
ఆరు గూడ్స్ రైళ్లను కలిపి రూపొందించారు
ఈ ప్రయోగం ద్వారా సరుకు రవాణాలో సమయాన్ని ఆదా చేయడంతో పాటు రైల్వే వనరులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని అధికారులు భావించారు. ఆరు రైళ్లను వేర్వేరుగా నడపాలంటే ఆరు రైల్వే మార్గాలు, సిబ్బంది, ఇంజిన్లు అవసరమవుతాయి. అదే వాటిని ఒకే రైలుగా నడపడం వల్ల ఆ అవసరం తగ్గుతుంది. ఇతర రైళ్ల రాకపోకలకు కూడా మార్గంలో అదనపు సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది.
సరుకు రవాణాలో కొత్త ప్రయోగం
భారతదేశంలో బొగ్గు, ఇనుము, సిమెంట్ వంటి భారీ సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకును వేగంగా తరలించడం ఎంతో ముఖ్యం. ఇలాంటి సమయంలో రుద్రాస్త్ర తరహా భారీ గూడ్స్ రైళ్లు రైల్వేలకు ఉపయోగపడతాయి.
వేర్వేరు రైళ్లకు అవసరమయ్యే సమయం, సిబ్బంది, ఇతర వనరులను తగ్గించడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఇలాంటి ప్రయోగాలు దోహదపడతాయి. అందుకే రుద్రాస్త్ర ప్రయోగాన్ని భారతీయ రైల్వేలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. మొత్తానికి నాలుగున్నర కిలోమీటర్ల పొడవు, 354 వ్యాగన్లు, ఏడు ఇంజిన్లతో ప్రయాణించిన రుద్రాస్త్ర.. భారతీయ రైల్వే సామర్థ్యాన్ని చాటిచెప్పిన ప్రత్యేక గూడ్స్ రైలుగా నిలిచిపోయింది.













