Hing: పులిహోరకు రుచిని పెంచే ఈ మసాలా.. దెయ్యాల ఆహారమా..?
Hing: పులిహోర దగ్గర నుంచి చాలా రకాల వంటలకు కమ్మనైన వాసన, అద్భుతమైన రుచిని అందించే ఓ మసాలాను దెయ్యాల ఆహారం అని పిలుస్తారని మీకు తెలుసా? అలాంటి మసాలాను మనం ఎందుకు వాడుతున్నాం..?

దెయ్యాల ఆహారం.. వంటకు బంగారం..
వంట గదిలో మనం చేసే చాలా రకాల వంటలకు అద్భుతమైన వాసన పంచడంలో, మంచి రుచిని ఇవ్వడంలో ఇంగువ అద్భుతాలు చేస్తుంది. కానీ, రెగ్యులర్ గా వాడే ఈ ఇంగువను దెయ్యాల ఆహారం అని పిలుస్తారని మీకు తెలుసా? అసలు.. ఇంగువకు దెయ్యాల ఆహారం అనే పేరు ఎలా వచ్చింది? ఇది అసలు ఎలా తయారౌతుంది? మన దేశానికి ఎక్కడి నుంచి వచ్చింది? దీని స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగువను దెయ్యాల ఆహారం అని ఎందుకు పిలుస్తారు?
మనకు వంటలో వేసినప్పుడు ఇంగువ కమ్మని రుచిని అందిస్తుంది. కానీ, ఇది ముడి పదార్థంగా ఉన్నప్పుడు భరించలేనంత ఘాటైన, వికృతమైన వాసన ఇస్తుంది. లాటిన్ భాషలో ‘ ఫోటిడస్’ అంటే కంపు కొట్టేది అని అర్థం. అందుకే, దీనికి ఆ విధమైన విచిత్రమైన పేరు వచ్చింది. అయితే, ఇంగువను నూనె లో లేదా నెయ్యి లో వేయించగానే ఆ కంపు పోయి.. కమ్మనైన సువాసనను వెదజల్లుతుంది.
ఇంగువ ఎలా తయారవుతుంది?
ఇంగువ అనేది ఏవో గింజల నుంచి వచ్చే పొడి కాదు. మధ్య ఆసియాలోని ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలలో పెరిగే 'ఫెరులా' (Ferula) జాతికి చెందిన భారీ మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఆ మొక్క వేర్లకు గాట్లు పెట్టినప్పుడు పాలులాగా కారి గడ్డగా మారుతుంది. దానిని సేకరించి, శుద్ధి చేసి ఇంగువగా మారుస్తారు. ఇది స్వచ్ఛమైన గమ్ రూపంలో ఉంటుంది కాబట్టి, అది గడ్డకట్టకుండా ఉండటానికి గోధుమ పిండిని, బియ్యం పిండిని మిక్స్ చేసి ప్యాక్ చేస్తారు.
మన దేశానికి ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రపంచంలోనే అత్యధికంగా ఇంగువను వాడే దేశం భారతదేశమే. మన దేశంలోని కశ్మీరీ పండిట్లు, జైనులు వంటి అనేక వర్గాల వారు ఉల్లిపాయ, వెల్లుల్లికి బదులుగా ఇంగువను తమ వంటల్లో ప్రధానంగా ఉపయోగిస్తారు. అయితే, మనం వాడే ఇంగువలో సింహభాగం బయటి దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఢిల్లీ హోల్సేల్ మార్కెట్లలో లభించే 'వైట్ కాబులి హింగ్' అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ఇది మన దేశానికి దిగుమతి అవుతుంది.
ఇంగువలో ఉన్న స్పెషాలిటీ ఇదే..
రసం, సాంబార్, పులిహోర వంటి దక్షిణాది వంటకాల్లో ఇంగువను కచ్చితంగా వాడతారు. ఇది ఎప్పుడూ కూర రుచిని డామినేట్ చేయదు కానీ, ఉన్న రుచిని రెట్టింపు చేస్తుంది. ఇంగువ తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు. మంచి అరుగుదల లభిస్తుంది.








