- Home
- Feature
- Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
మీ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ను గమనించండి… దానిపై A, B, C, D అక్షరాలతో ఓ కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్‌లకు అసలు అర్థం ఏంటి? సిలిండర్ భద్రతకు, ఆ కోడ్‌కు ఉన్న సంబంధం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ తో తస్మాత్ జాగ్రత్త..
ఈ రోజుల్లో ప్రతి వంటింట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు రోడ్డుపక్కన కాకా హోటల్ నుండి ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ వరకు సిలిండర్ లేనిదే వంట అసాధ్యం. ఇలా కట్టెల పొయ్యి జమానా పోయి సిలిండర్ జమానా వచ్చింది... వంట గ్యాస్ లేకుంటే పూట గడవడం కష్టం.
అయితే మన ఆకలిని తీర్చే ఈ గ్యాస్ సిలిండర్లు కొన్నిసార్లు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా కూడా మారతాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో గ్యాస్ సిలిండర్ పేలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి... కాబట్టి వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
గ్యాస్ సిలిండర్ సెఫ్టీ టిప్స్
చాలామంది ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్‌పై A, B, C, D అక్షరాలతో పాటు రెండు అంకెల నంబర్ ఉండటాన్ని గమనించే ఉంటారు. అయితే దీన్ని సిలిండర్ 'గడువు తేదీ' (expiry date) అని అనుకుంటారు. కానీ కాదు, ఇది సిలిండర్ భద్రతకు సంబంధించిన చాలా ముఖ్యమైన సమాచారాన్ని సూచిస్తుంది.
నిజానికి సిలిండర్ పై ఉండే కోడ్ సిలిండర్ గడువు తేదీని కాదు, దీనికి తప్పనిసరి భద్రతా పరీక్ష (statutory testing) ఎప్పుడు చేయాలో తెలిపే తేదీని సూచిస్తుంది. అంటే ఈ సిలిండర్ భద్రత గురించి ఈ కోడ్ సూచిస్తుంది… ఈ విషయం తెలుసుకోవడం వినియోగదారులకు చాలా అవసరం. అంటే సిలిండర్ పై సూచించిన తేదీలోపు రీటెస్టింగ్ చేయించకుంటే ప్రమాదాాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
సింలిండర్ పై ఉండే సెప్టీ కోడ్ అర్థమేంటి?
సిలిండర్ పైభాగంలో ఉండే మూడు మెటల్ స్ట్రిప్స్‌లో ఒకదానిపై ఈ కోడ్ ఉంటుంది. ఉదాహరణకు B-27, D-28 అని కనిపిస్తుంది. ఇందులో ఇంగ్లీష్ అక్షరం సంవత్సరం త్రైమాసికాన్ని, సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. A – జనవరి నుండి మార్చి వరకు, B – ఏప్రిల్ నుండి జూన్ వరకు, C – జూలై నుండి సెప్టెంబర్ వరకు, D – అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు సూచిస్తుంది. ఉదాహరణకు సిలిండర్‌పై 'C-26' అని ఉంటే ఆ సిలిండర్‌ను 2026 జూలై-సెప్టెంబర్ మధ్యలో పరీక్షకు పంపాలని అర్థం.
కొత్త గ్యాస్ సిలిండర్ రీ-టెస్టింగ్ గడువు ఎంత?
ఇండియన్ ఆయిల్ సంస్థ సమాచారం ప్రకారం… వంటగ్యాస్ సిలిండర్లను చాలా బలమైన ఉక్కుతో తయారు చేస్తారు. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాకే వాటిని వినియోగంలోకి తెస్తారు. అయినప్పటికీ కాలక్రమేణా వచ్చే అరుగుదలను గుర్తించడానికి, నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరీక్షించడం తప్పనిసరి.
కొత్త సిలిండర్‌కు మొదటి పరీక్ష 10 సంవత్సరాల తర్వాత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ చట్టబద్ధమైన పరీక్ష, పెయింటింగ్ పనులు చేస్తారు. పరీక్షలో పనికిరావని తేలిన సిలిండర్లను శాశ్వతంగా తొలగిస్తారు. అర్హత ఉన్న సిలిండర్లకు కొత్త పరీక్ష తేదీని వేసి మళ్లీ సరఫరా చేస్తారు.
ఈసారి సిలిండర్ డెలివరీ సమయంలో ఇవి గమనించండి
ఇకపై మీ ఇంటికి సిలిండర్ వచ్చినప్పుడు దాని బరువు, సీల్ మాత్రమే కాకుండా, సిలిండర్‌పై ఉన్న పరీక్ష తేదీని కూడా గమనించండి. ఒకవేళ ఆ తేదీ ఇప్పటికే ముగిసిపోయి ఉంటే, ఆ సిలిండర్‌ను తీసుకోవద్దు. అంతేకాకుండా సిలిండర్‌పై ఎక్కువగా తుప్పు పట్టినా, వంగిపోయినా లేదా డ్యామేజీలు ఉన్నా, వెంటనే డెలివరీ బాయ్ దృష్టికి తీసుకెళ్లి, వేరే సిలిండర్ ఇవ్వమని అడగడం చాలా ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది.

