- Home
- Feature
- Dinosaur Fish: ఈ ఒక్క చేప గుడ్లు అమ్మితే లైఫ్ సెటిల్ అయిపోద్ది.. వీటి ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే
Dinosaur Fish: ఈ ఒక్క చేప గుడ్లు అమ్మితే లైఫ్ సెటిల్ అయిపోద్ది.. వీటి ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే
Living Dinosaur Fish: డైనోసార్ కాలం నాటి స్టర్జన్ బెలూగా చేప గుడ్లు బంగారం కంటే ఖరీదైనవని మీకు తెలుసా? 100 ఏళ్లు జీవించే ఈ భారీ మంచినీటి చేప ప్రత్యేకతలు, క్యావియర్ ధర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

డైనోసార్ కాలం నాటి అరుదైన చేప
అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో ఉన్న స్నేక్ రివర్ ఒక చాలా ప్రత్యేకమైన చేపకు నిలయంగా ఉంది. దీనినే డైనోసార్ చేప అని పిలుస్తారు. దీని అసలు పేరు స్టర్జన్. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ చేపలు కనిపించినప్పటికీ, స్నేక్ రివర్‌లో మాత్రం ఇవి ఏకంగా 10 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఈ నదిలో ఉండే అనుకూలమైన వాతావరణమే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు, ఈ నదిలో స్టర్జన్ చేపలను వేటాడే ఇతర పెద్ద జీవులు తక్కువగా ఉండటం వల్ల ఇవి చాలా భారీగా పెరుగుతాయి.
24.5 కోట్ల ఏళ్ల చరిత్ర.. లివింగ్ డైనోసార్ చేప ఇది
ఈ చేపలు ట్రయాసిక్ కాలంలో భూమిపై పుట్టాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వీటిని లివింగ్ డైనోసార్ అని కూడా పిలుస్తుంటారు. ఈ చేపలకు సంబంధించి ఇప్పటివరకు దొరికిన అత్యంత పురాతన శిలాజాలకు సుమారు 24.5 కోట్ల సంవత్సరాల వయసు ఉంది. ఇన్ని కోట్ల సంవత్సరాలు భూమిపై గడిచినా, వీటి శరీర నిర్మాణంలో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేప అనే రికార్డు కూడా దీని సొంతం.
అత్యంత ఖరీదైన బెలూగా క్యావియర్
ఈ చేపలను బెలూగా అని కూడా అంటారు. బెలూగా చేప మాంసానికి మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదు కానీ, దీని గుడ్లకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. దీని గుడ్లను బెలూగా క్యావియర్ అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార పదార్థాల్లో ఒకటి.
మనిషి కంటే ఎక్కువ కాలం, అంటే దాదాపు 100 సంవత్సరాల వరకు జీవించే ఈ చేపలు 450 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అన్ని రకాల క్యావియర్లలోకెల్లా బెలూగా చేప గుడ్లకే అత్యధిక ధర ఉంటుంది. కేవలం 100 గ్రాముల బెలూగా క్యావియర్ ధర రూ. 60,000 వరకు పలుకుతుంది.
వేటతో అంతరించిపోతున్న జాతి
ఈ చేపల సంఖ్య చాలా తక్కువగా ఉండటమే వీటి గుడ్ల ధర ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం. ప్రపంచంలో క్యావియర్ను ఎగుమతి చేయడంలో చైనా మొదటి స్థానంలో ఉంది. స్టర్జన్ జాతిలో ఆడ చేపలు పూర్తి స్థాయిలో పెరిగి గుడ్లు పెట్టడానికి 8 నుంచి 20 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం ఇవి తీవ్రంగా అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి. యూరప్‌లోని కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
కొత్త టెక్నాలజీతో సేకరణ.. అమెరికాలో భారీ ధర
బెలూగా క్యావియర్కు ఉన్న డిమాండ్ వల్ల వీటిని విపరీతంగా వేటాడటం మొదలుపెట్టారు. దీంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సాయంతో ఆడ చేపలను చంపకుండానే, చాలా సురక్షితమైన పద్ధతిలో వాటి కడుపులోంచి గుడ్లను బయటకు తీస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం క్యావియర్ సరఫరాలో 80 శాతం దిగుమతి చేసుకునే అమెరికా, వీటి సంరక్షణ కోసం 2005లో దిగుమతులపై నిషేధం విధించింది. ఆ తర్వాత చాలా చోట్ల వీటిని పెంచే ఫామ్‌లు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా ఫామ్‌లలో పెంచే బెలూగా క్యావియర్ ధర 28 గ్రాములకు భారత కరెన్సీలో దాదాపు రూ. 66,068 వరకు ఉంది.
ఈ చేప గుడ్లలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్ బీ12, విటమిన్ డీ, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, వీటిని ఖరీదైన బ్యూటీ, స్కిన్ కేర్ ఉత్పత్తుల తయారీలో వాడతారు. వీటిని తినడం లేదా పార్టీలలో వడ్డించడం అనేది ధనవంతులకు ఒక స్టేటస్ సింబల్‌గా మారడంతో ఈ ధర పలుకుతోంది.









