- Home
- Feature
- Varanasi Railway Station: 160 ఏళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న రైల్వేస్టేషన్..లక్షలాది మందికి ఇదే ప్రధాన ద్వారం
Varanasi Railway Station: 160 ఏళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న రైల్వేస్టేషన్..లక్షలాది మందికి ఇదే ప్రధాన ద్వారం
Varanasi Railway Station: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నగరాల్లో ఒకటైన వారణాసి రైల్వేస్టేషన్ చరిత్ర 160 ఏళ్లకు పైగా ఉందని తెలుసా? ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు సాగిన ప్రయాణమేంటో తెలుసుకుందాం.

రైల్వే రాకతో మారిన వారణాసి ప్రయాణం
వారణాసి నగరానికి రైల్వే కనెక్టివిటీ బ్రిటిష్ పాలనలోనే మొదలైంది. అప్పట్లో ఈ నగరాన్ని బెనారస్ (Benares) అని పిలిచేవారు. ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ హౌరా నుంచి పాట్నా మీదుగా బెనారస్ వరకు రైల్వే లైన్ నిర్మించింది.
1862లో హౌరా నుంచి బెనారస్ వరకు రైల్వే కనెక్టివిటీ ప్రారంభమైంది. ఆ కాలంలో రైల్వే నిర్మాణం అంత సులభమైన పని కాదు. గంగా మైదాన ప్రాంతం గుండా రైలు మార్గాన్ని నిర్మిస్తూ, అప్పటి ఇంజినీరింగ్ సవాళ్లను అధిగమించారు. ఈ మార్గ నిర్మాణంలో ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ చీఫ్ ఇంజినీర్ జార్జ్ టర్న్‌బుల్ కీలక పాత్ర పోషించారు. గంగానది ఒడ్డున ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం, దశాస్వమేథ ఘాట్ లకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారమైంది.
లక్నోకు రైల్వే లైన్.. 1872లో మరో ముందడుగు
బెనారస్‌కు రైలు మార్గం వచ్చిన తర్వాత నగరానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం మరింత పెరిగింది. 1872లో బెనారస్ నుంచి లక్నోకు రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం సులభమైంది.
ఆ తర్వాత గంగా నదిపై రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కీలకమైన నిర్మాణాలు చేపట్టారు. 1887లో డఫరిన్ బ్రిడ్జి (Dufferin Bridge) నిర్మాణం పూర్తవడంతో గంగానదిపై రైళ్ల రాకపోకలకు మార్గం ఏర్పడింది. దీని ద్వారా బెనారస్ ప్రాంతం మొఘల్‌సరాయ్‌తో సహా ఇతర రైల్వే మార్గాలకు మరింత మెరుగ్గా అనుసంధానమైంది. ప్రస్తుతం ఈ వంతెనను మాలవీయ బ్రిడ్జిగా పిలుస్తారు.
బెనారస్ కాంట్ నుంచి వారణాసి జంక్షన్‌గా పేరు మార్పు
బ్రిటిష్ కాలంలో ఈ రైల్వే స్టేషన్‌ను బెనారస్ కాంట్ (Benaras Cantt) అని పిలిచేవారు. కాంట్ అంటే కంటోన్మెంట్ ప్రాంతం. స్టేషన్ నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ఆ పేరు వచ్చింది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత నగర పేరును బెనారస్ నుంచి వారణాసిగా మార్చే నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ సంపూర్ణానంద్ హయాంలో 1956 మే 24న బెనారస్ కాంట్ రైల్వే స్టేషన్ పేరును వారణాసి జంక్షన్‌గా మార్చారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ వారణాసి జంక్షన్‌గా కొనసాగుతోంది. స్థానికులు మాత్రం ఇప్పటికీ వారణాసి కాంట్ అని పిలుస్తుంటారు.
కాలక్రమంలో పెరిగిన రైల్వే ప్రాధాన్యత
ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వే మార్గానికి పరిమితమైన ఈ స్టేషన్.. క్రమంగా ఉత్తర భారతదేశంలోని కీలక రైల్వే జంక్షన్లలో ఒకటిగా ఎదిగింది. నగర జనాభా, పర్యాటకుల సంఖ్య, కాశీ విశ్వనాథ ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో రైల్వే స్టేషన్‌పై ప్రయాణికుల ఒత్తిడి కూడా పెరిగింది. దీంతో స్టేషన్‌లో కొత్త సదుపాయాలు, ప్లాట్‌ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వారణాసి జంక్షన్‌లో 11 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
ఒక నగరం.. పేర్లు మారినా చరిత్ర మాత్రం అదే!
బ్రిటిష్ కాలంలో బెనారస్ కాంట్‌గా మొదలైన ఈ స్టేషన్.. తర్వాత వారణాసి జంక్షన్‌గా మారింది. నగరం పేరుతో పాటు స్టేషన్ పేరు కూడా మారినా, ఉత్తర భారత రైల్వే వ్యవస్థలో దాని ప్రాధాన్యత మాత్రం కొనసాగుతోంది. 1860లలో రైల్వే మార్గం అందుబాటులోకి రావడం నుంచి నేటి ఆధునిక రైల్వే సదుపాయాల వరకు వారణాసి ప్రయాణం ఎన్నో మార్పులకు సాక్ష్యంగా నిలిచింది. కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా, నగర చరిత్రలోనూ ఈ స్టేషన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. 160 ఏళ్లకుపైగా చరిత్రను తనలో దాచుకున్న రైల్వేస్టేషన్ ఇది.









