ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ ఇది.. దీని ముందు అమెరికన్ డాలర్ కూడా చాలా తక్కువ
ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అనగానే అందరూ అమెరికా డాలర్ అనుకుంటారు. నిజానికి డాలర్ కన్నా ఎక్కువ విలువైన కరెన్సీ వేరొకటి ఉంది. అందుకే ఆ దేశానికి ఉద్యోగాలు చేసేందుకు ఎంతో మంది వెళ్లేందుకు ఇష్టపడతారు.

ప్రపంచంలో విలువైన కరెన్సీ
ప్రపంచంలో అత్యంత విలువైన డబ్బు అనగానే చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేవి అమెరికా డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్. అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ మంది వాడే కరెన్సీ అమెరికా డాలర్ అయినప్పటికీ, విలువల పరంగా చూస్తే అది మొదటి స్థానంలో లేదు. ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీగా పశ్చిమాసియా దేశం కువైట్కు చెందిన దినార్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేవలం ఒకే ఒక్క కువైతీ దినార్ కొనాలంటే మూడు డాలర్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. శక్తివంతమైన డాలర్, స్థిరమైన యూరో వంటి పాశ్చాత్య దేశాల డబ్బులు కూడా కువైతీ దినార్ మారకం విలువ ఎక్కువ. మన రూపాయల్లో చెప్పాలనుకుంటే ఒక కువైటి దీనార్ విలువ 300 రూపాయలు. అమెరికా డాలర్ విలువ 93 రూపాయలు మాత్రమే.
ఎందుకంత విలువ?
కువైతీ దినార్ ఇంతటి అపారమైన బలాన్ని సంపాదించుకోవడానికి ఆ దేశంలో ఉన్న అపారమైన ముడి చమురు నిల్వలు ప్రధాన కారణం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారులలో ఒకటిగా గుర్తింపు పొందిన కువైట్, తన ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచుకుంది. ఇక్కడి పన్ను రహిత విధానాలు, బలమైన విదేశీ నిల్వలు స్థానిక కరెన్సీ స్థిరత్వాన్ని పెంచుతున్నాయి. కువైట్ మాత్రమే కాకుండా బహ్రెయిన్ దినార్, ఒమాన్ రియాల్, జోర్డాన్ దినార్ వంటి ఇతర గల్ఫ్ దేశాల కరెన్సీలు కూడా గ్లోబల్ లిస్టులో టాప్ స్థానాలను ఆక్రమించి పాశ్చాత్య కరెన్సీలకు గట్టి పోటీనిస్తున్నాయి.
దీనార్ ఆధిపత్యం
అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, విదేశీ ప్రయాణాల్లో డాలర్ హవా ఎక్కువగా కనిపించినప్పటికీ, ఒక్క యూనిట్ విలువను లెక్కలోకి తీసుకుంటే మాత్రం దీనార్ విలువ ఎక్కువ. స్విస్ ఫ్రాంక్, కేమాన్ ఐలాండ్స్ డాలర్, బ్రిటిష్ పౌండ్ వంటివి డాలర్ కంటే ముందు వరుసలో నిలిచాయి. గ్లోబల్ ఎకానమీలో మార్పులు వస్తున్నా, దశాబ్దాలుగా కువైతీ దినార్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీగా తిరుగులేని రికార్డును కొనసాగిస్తోంది.













