జీవితానికి అర్థం గెలవడం, ఓడడం కాదు.. మరెంటో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే
Motivational Story: జీవితానికి అర్థం ఏంటి అని ఎవరైనా అడగ్గానే మెజారిటీ గెలవడమే అని చెప్తారు కదూ! అందుకే కొందరు ఓటమిని అంగీకరించకుండా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అయితే జీవితానికి అసలైన అర్థం ఏంటో చెప్పే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితానికి అర్థం ఏంటో తెలుసుకోవాలనుకున్న యువకుడు
ఓ యువకుడు జీవితానికి అర్థం ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటాడు. జీవితంలో విజయం సాధిస్తే బతకాలి అన్న ఆలోచనతో ఉంటాడు. ఇదే సమయంలో “విజయానికి అసలు రహస్యం ఏంటి?” అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ సమాధానం చెప్పగల వ్యక్తి పర్వతాల్లో నివసించే ఒక ముని అని తెలుసుకుని, అతడిని కలవడానికి బయలుదేరుతాడు.
పర్వతాల్లోని మునిని కలిసి
చాలా కష్టం మీద ఆ పర్వతం మీద ఉన్న చిన్న గుడిసెకు చేరుకున్నాడు యువకుడు. అక్కడ మునిని చూసి “గురువుగారు, జీవితంలో విజయం సాధించడానికి రహస్యం ఏంటో చెప్పగలరా?” అని అడుగుతాడు. కొంతసేపు మౌనంగా ఉన్న ముని.. ఆ తర్వాత యువకుడిని తన వెంట రావాలని అంటాడు.
నది దగ్గర ఊహించని ఘటన
ముని యువకుడిని దగ్గరలో ఉన్న ఒక నదివద్దకు తీసుకెళ్లి, ఇద్దరూ నదిలోకి నడుచుకుంటూ వెళ్తారు. ఒక్కసారిగా ముని యువకుడి తలను నీటిలో ముంచేస్తాడు. దీంతో యువకుడు ఊపిరాడక గట్టిగా అరుస్తాడు. ఎలాగైనా బయటకు రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కాసేపు అలాగే గట్టిగా పట్టిన ముని కొన్ని నిమిషాల తర్వాత యువకుడిని బయటకు తీస్తాడు.
నీకు ఏం కావాలని అనిపించింది.?
నీటి నుంచి బయటకు వచ్చిన ముని, యువకుడు కాసేపటి తర్వాత గుడిసె వద్దకు చేరుకుంటాడు. అక్కడ ముని యువకుడిని ప్రశ్నిస్తూ.. “నీ తల నీటిలో ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించింది?” అని ప్రశ్నిస్తాడు. యువకుడు బదులిస్తూ.. ముందు నాకు ఊపిరి కావాలనిపించింది. ఆ తర్వాతే ఇంకేదైనా అనే భావన కలిగింది అంటూ బదులిచ్చాడు.
జీవితానికి అర్థం తెలిసింది
అప్పుడు ఆ యువకుడికి జీవితానికి అసలైన అర్థం ఏంటో తెలిసిపోయింది. చాలా మంది జీవితం అంటే గెలుపు, ఓటములు మాత్రమే అనుకుంటారు. కానీ జీవితానికి అసలైన అర్థం, జీవించడం మాత్రమే. కానీ ఈ విషయం తెలియక ఇటీవల చాలా మంది ఆత్మహ్య చేసుకుంటున్నారు. ఓడినా, గెలిచినా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడమే జీవితానికి అసలైన అర్థమనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తోంది.

