Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్.. మనసులో నుంచి పోవడం కష్టం
Motivational Dialogue: దుల్కర్ సల్మన్ హీరోగా 2024లో వచ్చిన లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలోని కొన్ని డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

జీవితం విలువ
‘రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్లు గడవలేదు. దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా’. లక్కీ భాస్కర్ మూవీలో ది బెస్ట్ డైలాగ్స్‌లో ఇదీ ఒకటి. భాస్కర్ ఉద్యోగం చేసే బ్యాంకులో ప్రమోషన్ ఆశించి బంగపడి, ఆపై అవమానాలు ఎదుర్కొన్న సమయంలో వచ్చే డైలాగ్ ఇది. నిజానికి జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండదు. మనకు నచ్చని సందర్భాలు కూడా ఉంటాయి. అలాఅని వాటినే పట్టుకొని కూర్చుంటే జీవితంలో ముందుకు సాగడం కష్టం. అందుకే మనకు నచ్చని సందర్భాలను లైట్ తీసుకుంటూ ముందుకు సాగడమే జీవితం.
డబ్బు సంపాదన
డబ్బు చుట్టే తిరిగే లక్కీ భాస్కర్ సినిమాలో.. మనీకి సంబంధించి ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ‘డబ్బు సంపాదన నీకు ఒకప్పుడు అవసరం, కానీ ఇప్పుడు ఒక వ్యసనం’. హీరో తండ్రి హీరోకు చెప్పే ఈ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బుపై ఎంత వరకు వ్యామోహం పెంచుకోవాలి అనే గొప్ప సందేశం ఈ డైలాగ్‌లో ఉంటుంది. చాలా మంది బతకడానికి డబ్బు కావాలి అని అనుకుంటారు. కానీ డబ్బు సంపాదన మొదలయ్యాక అసలు రూపం బయటపడుతుంది.
వేగంగా వచ్చే డబ్బు
ఇక ఈ సినిమాలో మరో బెస్ట్ డైలాగ్.. ‘వేగంగా వెళ్లే బండి, వేగంగా వచ్చే రూపాయి రెండూ.. మనిషిని ఏదో ఒక రోజు కిందపడేస్తాయి’. డబ్బు మనకు ఎంత సౌకర్యాన్ని ఇస్తుందో అంతే కష్టాన్ని కూడా తెచ్చి పెడుతుందనే సందేశం ఇందులో ఉంది. మరీ ముఖ్యంగా ఈజీ మనీ మనిషి పతనానికి నాంది పలుకుతుంది. అందుకే.. పరిగెత్తి పాలు తాగేకంటే, నిలబడి నీళ్లు తాగడం మంచిదని మన పెద్దలు చెబుతుంటారు.
ఓటమి, గెలుపు
‘గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది. అదే ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు నువ్వు చివరికి ఏం సాధించావు అన్నదే గుర్తుంచుకుంటుంది’. జీవితానికి సరిపడే సందేశం ఈ చిన్న డైలాగ్‌లో ఉంది. మనలో కూడా చాలా మంది ఓటమి రాగానే కుంగిపోతారు. కెరీర్ మొదట్లోనే ఏదో సాధించాలని అనుకుంటారు. అనుకున్నది సాధించకపోయే సరికి బాధపడుతుంటారు. కానీ నిజమైన విజయం, ఓటమి తర్వాతే వస్తుంది.
నమ్మకం
సినిమాలో దుల్కర్ సల్మన్, రాంకీల మధ్య వచ్చే...‘థాంక్యూ సార్, నమ్మినందుకు.. మీకు కూడా థాంక్యూ సార్ నిలబెట్టుకున్నందుకు’. అనే డైలాగ్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. నిజానికి రాంకీ చెప్పిన ఐడియాను నమ్మి దుల్కర్ సల్మన్ డబ్బు ఇవ్వడం ఎంత గొప్ప విషయమో, అదే విధంగా నమ్మకాన్ని నిలబెట్టుకున్న రాంకీ గొప్పతనం కూడా ఇందులో ఉంది. జీవితంలో మనల్ని నమ్మిన వ్యక్తుల నమ్మకాన్ని నిలబెట్టడం ఎంత ముఖ్యమైన విషయమో ఈ డైలాగ్ చెబుతుంది.

