- Home
- Feature
- IRCTC South India Tour: ఐఆర్సీటీసీ నుంచి సూపర్ టూర్ ప్యాకేజీ.. రామేశ్వరం సహా 5 ఆలయాల దర్శనం.. వివరాలు ఇవే
IRCTC South India Tour: ఐఆర్సీటీసీ నుంచి సూపర్ టూర్ ప్యాకేజీ.. రామేశ్వరం సహా 5 ఆలయాల దర్శనం.. వివరాలు ఇవే
IRCTC South India Tour: ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టెంపుల్ రన్ ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 6 రాత్రులు, 7 రోజుల టూర్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కేవలం 7 రోజుల్లో అద్భుతమైన దేవాలయాల సందర్శన.. ఐఆర్సీటీసీ సరికొత్త టూర్ ప్యాకేజీ ఇదే
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికుల కోసం మరో ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో ఈ ప్రత్యేక ఫ్లైట్ టూర్‌ను నిర్వహిస్తున్నారు. రామేశ్మరం సహా ఐదు ప్రముఖ ఆలయాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం అవుతుంది.
ప్రయాణం ఎలా సాగుతుందంటే?
మొదటి రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి త్రివేండ్రం చేరుకున్నాక పూవార్ ఐలాండ్, అళీమల శివాలయాన్ని సందర్శిస్తారు. రెండో రోజు ఉదయం పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుని, కన్యాకుమారికి బయలుదేరి సన్‌సెట్ పాయింట్ చూస్తారు. మూడో రోజు రాక్ మెమోరియల్, తిరువళ్లూరు విగ్రహాన్ని సందర్శించి రామేశ్వరం బయలుదేరుతారు.
నాలుగో రోజు రామేశ్వరంలోని స్థానిక ఆలయాలు, ధనుష్కోడిని సందర్శించవచ్చు. ఐదో రోజు అబ్దుల్ కలాం మెమోరియల్ చూసి, తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని త్రిచి చేరుకుంటారు. ఆరో రోజు శ్రీరంగం ఆలయం, జంతుకేశ్వర ఆలయం సందర్శించి మధురైకి వెళ్తారు. ఏడో రోజు ఉదయం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, మధురై నుంచి విమానంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీ ధరల వివరాలు
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 59,850గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కོక్కరికి రూ. 44,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ. 41,450 చెల్లించాలి. ఇక పిల్లల విషయానికి వస్తే, మంచంతో కూడిన చైల్డ్ (5-11 ఏళ్లు) ధర రూ. 35,150, మంచం లేని చైల్డ్ (5-11 ఏళ్లు) ధర రూ. 28,750/-గా నిర్ణయించారు.
అలాగే 2 నుంచి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మంచం లేకుండా రూ. 22,500 కేటాయించారు. ఈ ప్యాకేజీలో విమాన టికెట్లు, హోటల్ వసతి, ఏసీ బస్సు ద్వారా సైట్‌సీయింగ్, 7 బ్రేక్ ఫాస్ట్, 6 రాత్రుల భోజనాలు కవర్ అవుతాయి.
ప్యాకేజీలో లభించే సేవలు, వసతి వివరాలు
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ టూ త్రివేండ్రం, మధురై టూ హైదరాబాద్ విమాన టికెట్లు లభిస్తాయి. త్రివేండ్రంలో 1 రాత్రి, కన్యాకుమారిలో 1 రాత్రి, రామేశ్వరంలో 2 రాత్రులు, మధురైలో 1 రాత్రి, త్రిచిలో 1 రాత్రి చొప్పున బస ఏర్పాట్లు చేశారు.
వసతి కోసం త్రివేండ్రంలో కీస్ సెలెక్ట్, కన్యాకుమారిలో విశ్వ గ్రాండ్, రామేశ్వరంలో హోటల్ వినాయగ, త్రిచిలో బ్రీజ్ రెసిడెన్సీ, మధురైలో టీటీడీసీ యూనిట్ 2 లేదా వాటికి సమానమైన హోటళ్లలో గదులు కేటాయిస్తారు. సైట్‌సీయింగ్ కోసం ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తారు. అయితే భోజనంలో లంచ్, విమానంలో లభించే ఆహారం, ఎంట్రీ టికెట్లు, దర్శన టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు ఈ ప్యాకేజీలో ఉండవు.
రద్దు నిబంధనలు, ముఖ్యమైన సూచనలు
ట్రిప్ ప్రారంభ తేదీకి 21 రోజుల ముందు రద్దు చేసుకుంటే ప్యాకేజీ ధరలో 30% కోత ఉంటుంది. 21 నుండి 15 రోజుల మధ్య రద్దు చేస్తే 55%, 14 నుండి 8 రోజుల మధ్య అయితే 80%, 7 రోజులు లేదా చివరి నిమిషంలో రద్దు చేస్తే 100% రద్దు రుసుము వర్తిస్తుంది. 75 సంవత్సరాలు దాటిన ప్రయాణికులు తప్పనిసరిగా ఒక తోడు లేదా కుటుంబ సభ్యుడితో కలిసి ప్రయాణించాలి. గ్రూప్ టూర్ కాబట్టి సమయపాలన పాటించాలని, విమానాశ్రయానికి ప్రయాణ సమయానికి కనీసం 2 గంటల ముందే చేరుకోవాలని ఐఆర్సీటీసీ సూచించింది.
ఈ యాత్ర ఫిబ్రవరి 7, 2027న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు ఉదయం 06:25 గంటలకు విమానం ఎక్కి, ఉదయం 08:15 గంటలకు త్రివేండ్రం చేరుకుంటారు. ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఫిబ్రవరి 13, 2027న మధురై నుంచి సాయంత్రం 05:15 గంటలకు బయలుదేరి, రాత్రి 08:50 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.













