- Home
- Feature
- Interesting Facts: ఈ దేశాల్లో పిల్లల పేర్లు ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి.. పేరెంట్స్ ఇష్టం ఉండదు.
Interesting Facts: ఈ దేశాల్లో పిల్లల పేర్లు ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి.. పేరెంట్స్ ఇష్టం ఉండదు.
Interesting Facts: పిల్లల పేరు నిర్ణయించే హక్కు ఎవరికి ఉంటుంది.? అదేం ప్రశ్న కచ్చితంగా పేరెంట్స్ లేదా కుటుంబ సభ్యులే ఉంటుందని అంటారా.? అయితే కొన్ని దేశాల్లో పిల్లల పేర్లను ప్రభుత్వాలే నిర్ణయిస్తాయని మీకు తెలుసా.?

పిల్లల పేర్లపై ప్రభుత్వ నియంత్రణ
సాధారణంగా పిల్లల పేరు పెట్టడం అంటే తల్లిదండ్రులకు ఎంతో భావోద్వేగంతో కూడిన విషయం. కానీ కొన్ని దేశాల్లో ఇది కేవలం కుటుంబ నిర్ణయం మాత్రమే కాదు. అక్కడ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. పిల్లలకు పెట్టే పేర్లు చట్టాలకు అనుగుణంగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కొన్ని పేర్లను అనుమతిస్తారు, కొన్ని పేర్లను పూర్తిగా తిరస్కరిస్తారు.
డెన్మార్క్‌లో అనుమతించిన పేర్ల జాబితా
డెన్మార్క్‌లో పిల్లల పేర్ల విషయంలో ప్రత్యేక చట్టం ఉంది. ప్రభుత్వం దాదాపు 7,000 ముందుగా ఆమోదించిన పేర్ల జాబితాను సిద్ధం చేసింది. అబ్బాయిల పేర్లకు ఒక జాబితా, అమ్మాయిల పేర్లకు మరో జాబితా ఉంటుంది. ఈ లిస్ట్‌లో లేని పేరును నేరుగా పెట్టే అవకాశం ఉండదు. తప్పనిసరిగా స్థానిక చర్చ్ అధికారుల దగ్గర, సివిల్ అధికారుల దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ మార్పులు కూడా ఇష్టానుసారం చేయలేరు.
ఐస్‌లాండ్‌లో భాష పరిరక్షణే ప్రధాన లక్ష్యం
ఐస్‌లాండ్‌లో పిల్లల పేర్లపై కఠిన నియమాలు ఉన్నాయి. అక్కడి భాషను కాపాడటమే ఈ చట్టాల ప్రధాన ఉద్దేశ్యం. ఐస్‌లాండిక్ నేమింగ్ కమిటీ ప్రతి పేరును పరిశీలిస్తుంది. ఆ పేరు అక్కడి వ్యాకరణానికి సరిపోతుందా, అక్షరమాల ప్రకారం రాయగలమా అనే విషయాలు చూస్తారు. ప్రతికూల అర్థాలు ఉన్న పేర్లు, పాత కథలతో భయాన్ని కలిగించే పేర్లను అనుమతించరు. పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినకూడదనే ఆలోచనతో ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.
జర్మనీ, సౌదీ అరేబియాలో ఉన్న పరిమితులు
జర్మనీలో పిల్లల శ్రేయస్సే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తుంది. లింగాన్ని స్పష్టంగా తెలియజేయని పేర్లు, ఎగతాళి చేసేలా ఉన్న పేర్లు, బ్రాండ్ పేర్లు లేదా వస్తువుల పేర్లను అధికారులు తిరస్కరిస్తారు. రాజకీయ నాయకుల ఇంటిపేర్లను కూడా పిల్లల పేర్లుగా పెట్టేందుకు అనుమతి ఉండదు.
సౌదీ అరేబియాలో మాత్రం మతపరమైన విలువలు, స్థానిక సంప్రదాయాల ఆధారంగా పేర్లను నియంత్రిస్తారు. ఇస్లామిక్ సంస్కృతికి విరుద్ధంగా ఉన్న పేర్లు, ఇతర మతాలకు సంబంధించిన పేర్లు, ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే పేర్లను ప్రభుత్వం అంగీకరించదు.
పిల్లల పేర్లను నియంత్రించే ప్రభుత్వాల వాదన
ఈ దేశాలన్నింటిలో ప్రభుత్వాల వాదన ఒకటే. పిల్లలు భవిష్యత్తులో ఎగతాళికి గురికాకూడదు. వారి సంస్కృతి, భాష పరిరక్షించాలి. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టత ఉండాలి. పిల్లల జీవితంపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పేర్ల చట్టాలు తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇవి కఠినంగా అనిపించినా, పిల్లల భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ నిబంధనలు అమలవుతున్నాయి.

