- Home
- Feature
- Village: కోటి రూపాయలు ఇచ్చినా... ఈ గ్రామ ప్రజలు దీపావళికి టపాసులు కాల్చరు.. ఎందుకో తెలుసా?
Village: కోటి రూపాయలు ఇచ్చినా... ఈ గ్రామ ప్రజలు దీపావళికి టపాసులు కాల్చరు.. ఎందుకో తెలుసా?
Village: దీపావళి పండగ వచ్చింది అంటే.. అందరూ టపాసులే కాలుస్తారు. కానీ, మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం.. ఒక్కరు కూడా టపాసులు కాల్చరు. ఎవరైనా పిలిచి ఫ్రీగా ఇచ్చినా కూడా వారు టపాసులు కాల్చరు.. ఎందుకో తెలుసా?

టపాసులు కాల్చని గ్రామం..
దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగ అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు మీకు నచ్చిన పండగ ఏది అంటే ముందుగా చెప్పేది దీపావళినే. ఈ పండగ వస్తే చాలు.. ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ.. సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కనీసం వారం రోజులైనా దేశం మొత్తం టపాసుల మోత మోగాల్సిందే. అయితే.. ఇలాంటి దేశంలో.. కనీసం ఒక్క టపాసు కూడా కాల్చని గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ గ్రామంలో పెద్దలు మాత్రమే కాదు.. చిన్న పిల్లలు కూడా టపాసులు కాల్చరు. గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి?
బాణ సంచా కాల్చని గ్రామం...
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉన్న బల్లెనా హళ్లి అనే గ్రామ ప్రజలు దీపావళి పండగ సమయంలో టపాసులు కాల్చరు. చాలా మంది జంతు ప్రేమికులు.. ఈ పండగ సమయంలో టపాసులు కాల్చరు. వాటి వల్ల జంతువులు ఇబ్బంది పడతాయని ముఖ్యంగా కుక్కల కోసం బాణా సంచా కాల్చకూడదని చెబుతుంటారు. కానీ, ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం.. గబ్బిళాల కోసం టపాసులను దూరంగా పెడతారు. వాటిని కాపాడుకోవడం లక్ష్యంగా వీరు ఎలాంటి టపాసులు కాల్చరు. ఈ గ్రామంలోని ఆలయం చుట్టూ ఉన్న చెట్లపై దాదాపు 2 వేల గబ్బిళాలు నివసిస్తున్నాయి. పెద్ద శబ్దాలు వస్తే.. గబ్బిళాలు భయపడి పారిపతాయని, దాదాపు 50 ఏళ్లుగా ఈ గ్రామ ప్రజలు.. ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరు మోత మోగించే టపాసులతో కాకుండా.. నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటారు.
గబ్బిళాలను దైవంగా పూజించే గ్రామం..
ఈ గ్రామస్థులు దీపావళి పండగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పిండి వంటలు చేసుకుంటారు. పూజలు చేస్తారు. ఇంటిని దీపాలతో అలంకరించుకుంటారు. కానీ, టపాసులు మాత్రం కాల్చరు. ఈ గ్రామంలో మీరు చిన్న పిల్లలను పిలిచి టపాసులు కాల్చమని అడిగినా కూడా నిర్మొహమాటంగా కాల్చం అనే చెబుతారు. వీరు గబ్బిలాలను దైవంగా పూజిస్తారు. వాటి సంరక్షణే వారి ధ్యేయం. ఒకప్పుడు ఈ గబ్బిలాలు కేవలం ఒక్క చెట్టుకు మాత్రమే ఉండేవి. కానీ, వీరు జాగ్రత్తగా చూసుకోవడంతో పదికి పైగా చెట్లపై అవి నివాసం ఉంటున్నాయి. ఇక్కడి ప్రజలు గబ్బిలాలను తమ ఆరాధ్య ధైవమైన మునియప్ప లాగే పవి్రంగా పూజిస్తారు.
పిల్లల కోసం ప్రత్యేక నిబంధన...
పెద్దవాళ్లు అంటే..పరిస్థితి అర్థం చేసుకుంటారు. కానీ, మరీ చిన్న పిల్లలు మాట వినకుండా మారాం చేస్తూ ఉంటారు కదా.. అలాంటి పిల్లల కోసం మాత్రం ఒక చిన్న వెసులుబాటు తీసుకువచ్చారు. పిల్లలు ఎవరైనా టపాసులు కాల్చాలనుకుంటే ఊరికి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల అవతలికి వెళ్లి కాల్చుకోవాలి తప్ప, గ్రామంలోపల అసలు శబ్దం చేయడానికి వీలులేదు. కేవలం దీపావళి అనే కాదు, ఊరిలో పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకలు జరిగినప్పుడు కూడా ఎవరూ టపాసులు కాల్చరని స్థానికులు చెబుతున్నారు.
ఈ నిర్ణయం వెనక కారణం...
ఈ గ్రామస్థులు ఈ నిర్ణయం ఫాలో అవ్వడం వెనక ఓ పెద్ద నమ్మకమే ఉంది. కొన్ని తరాల క్రితం.. ఎవరో టపాసులు కాల్చడం వల్ల.. ఈ గ్రామంలో ఉండాల్సిన గబ్బిలాలు ఊరు విడిచి వెళ్లిపోయాయట. అవి వెళ్లిపోయిన తర్వాత.. గ్రామంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారట. మళ్లీ గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేసి, మళ్లీ ఆ గబ్బిలాలను ఆహ్వానించిన తర్వాతే... ఆ సమస్యలు తీరిపోయాయట. ఆ తప్పు మళ్లీ జరగకూడదని గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ.. నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటున్నారు.





