- Home
- Feature
- Hyderabad to Goa : ప్లైట్, రైలు, బస్సు, సొంత కారు... హైదరాబాద్ నుండి గోవాకు ఎలా వెళితే ఎంత ఖర్చవుతుంది?
Hyderabad to Goa : ప్లైట్, రైలు, బస్సు, సొంత కారు... హైదరాబాద్ నుండి గోవాకు ఎలా వెళితే ఎంత ఖర్చవుతుంది?
నలుగురు స్నేహితులు కలిసి హైదరాబాద్ నుండి గోవాకు వెళ్లాలనుకుంటే ప్రయాణ ఖర్చు ఎంత అవుతుంది. ప్లైట్ లో ఎంత? రైలులో ఎంత? బస్సులో ఎంత? సొంత కారులో అయితే ఎంత ఖర్చు?

హైదరాబాద్ టు గోవా టూర్ ప్లాన్
Goa Trip : గోవా... ఈ పేరు వింటేచాలు యువత ముఖాల్లో ఎక్కడలేని వెలుగు వస్తుంది. చీఫ్ గా దొరికే మందు, బికినీలు ధరించి కనిపించే విదేశీ అమ్మాయిలు, ఆ బీచ్ అందాలు, ప్రకృతి సోయగాలు... ఇలా గోవాలో ఒక్కొక్కరు ఒక్కోటి ఇష్టపడతారు. ప్రతి ప్రెండ్స్ గ్యాంగ్ డ్రీమ్ ట్రిప్స్ లో గోవా ఫస్ట్ ఉంటుంది... ఇప్పటికే వెళ్ళివచ్చినవారు గోవాను భూలోకస్వర్గంగా అభివర్ణిస్తుంటారు.
న్యూఇయర్ ను గోవాలో సెలబ్రేట్ చేసుకోవాలని చాలామంది ఆశపడుతుంటారు. అయితే ప్లైట్ లో వెళ్ళాలా? రైలు లేదా బస్సులో వెళ్లాలా? సొంత కారులో వెళ్లాలా? ఎలా వెళితే ఎంత ఖర్చవుతుంది? ఏది బెస్ట్ ఆప్షన్? అనేది తెలియక సతమతం అవుతుంటారు. మరి ఈ న్యూఇయర్ ఫ్రెండ్స్ తో కలిసి గోవాలో జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఎలా వెళితే ఎంత ఖర్చు అవుతోంది ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్ టు గోవా... ప్లైట్ లో వెళితే ఎంత ఖర్చు?
హైదరాబాద్ నుండి గోవాకు ఓ నలుగురు స్నేహితులు వెళ్ళడానికి ప్లాన్ చేశారని అనుకుందాం. అయితే తొందరగా ట్రిప్ ముగించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ప్లైట్... అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. విమానంలో హైదరాబాద్ నుండి గోవాకు గంటలో వెళ్లిపోవచ్చు... తిరుగు ప్రయాణానికి కూడా అంతే సమయం పడుతుంది. హైదరాబాద్ టు గోవా ప్టైట్ టికెట్ ధర దాదాపు రూ.రూ.3000 నుండి రూ.4000 వరకు ఉంటుంది... న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ ఎండింగ్ లో టికెట్ ధర మరింత ఎక్కువ ఉండవచ్చు. ఇలా నలుగురు ప్రెండ్స్ ప్లైట్ లో గోవా వెళ్లాలంటే దాదాపు రూ.15,000 నుండి రూ.16000 వరకు ఖర్చు అవుతుంది.
హైదరాబాద్ టు గోవా... ట్రైన్ లో వెళితే ఎంత ఖర్చు?
విమానంలో కాకుండా నలుగురు స్నేహితులు రైలులో గోవాకు వెళ్లడానికి ప్లాన్ చేశారని అనుకుందాం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి గోవాలోని వాస్కోడగామా స్టేషన్ కు ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.450 ఉంటుంది... అంటే నలుగురికి రూ.1800 ఖర్చవుతుంది. అయితే రైలులో ప్రయాణ సమయం చాలా ఎక్కువ... 20 గంటలు అంటే దాదాపు ఓ రోజంతా ప్రయాణించాల్సి ఉంటుంది. టైమ్ తో పనిలేదు, తక్కువ ఖర్చులో గోవా వెళ్లాలంటే ట్రైన్ బెస్ట్ ఆప్షన్.
హైదరాబాద్ టు గోవా... బస్సులో వెళితే ఎంత ఖర్చు?
విమానం, రైలు కాదు... బస్సులో నలుగురు ప్రెండ్స్ గోవా వెళ్లడానికి ప్లాన్ చేశారనుకుందాం. హైదరాబాద్, గోవా మధ్య ప్రైవేట్ ట్రావెల్ బస్సు సర్వీసులున్నాయి... ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో వెళ్లాలంటే ఒక్కొక్కరికి రూ.1000 నుండి రూ.2000 ఖర్చవుతుంది. రైలుతో పోలిస్తే ఖర్చు ఎక్కువే అయినా ప్రయాణ సమయం తక్కువు... రాత్రి ఎక్కితే మరుసటిరోజు దిగిపోవచ్చు అంటే 12 నుండి 15 గంటల ప్రయాణ సమయం అన్నమాట. నలుగురికి రూ.4000 నుండి రూ.8000 ఖర్చు వస్తుంది.
హైదరాబాద్ టు గోవా... కారులో వెళితే ఎంత ఖర్చు?
ప్లైట్, ట్రైన్, బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో కాకుండా సొంత కారులో నలుగురు స్నేహితులు గోవాకు వెళ్ళేందుకు ప్లాన్ చేశారని అనుకుందాం. ఈ సమయానికే బయలుదేరాలి, తిరిగిరావాలి అనే భయం అవసరం ఉండదు... కారులో ఎప్పుడంటే అప్పుడు వెళ్లొచ్చు, రావచ్చు. మొత్తం 600-700 కిలోమీటర్ల ప్రయాణం... పెట్రోల్, టోల్ కలిపి దాదాపు 5000 నుండి రూ.6000 అవుతుంది. నలుగురు వెళితే ఒక్కొక్కరికి రూ.1300 నుండి రూ.1500 ఖర్చు అన్నమాట.
కారులో అయితే ఎక్కడంటే అక్కడ ఆగవచ్చు. దారిలో మంచి సైట్ వ్యూస్ చూడొచ్చు. గోవాలో కూడా సొంత కారు వాడతారు కాబట్టి పెద్ద ఖర్చు ఉండదు. గోవాలో పెట్రోల్ ధర హైదరాబాద్ కంటే తక్కువగా ఉంటుంది... తిరుగు ప్రయాణంలో అక్కడే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే మరో రూ.400-500 ఆదా అవుతాయి. కారులో అయితే హైదరాబాద్ నుండి గోవా ప్రయాణ సమయం ఎక్కువగానే ఉంటుంది... కానీ స్నేహితులంతా ఎంజాయ్ చేస్తూ వెళ్లవచ్చు.















