- Home
- Feature
- Mini Africa: హైదరాబాద్‌లో ‘మినీ ఆఫ్రికా’.. ఆ వీధిలో అడుగుపెడితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు
Mini Africa: హైదరాబాద్‌లో ‘మినీ ఆఫ్రికా’.. ఆ వీధిలో అడుగుపెడితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు
Mini Africa: హైదరాబాద్ లో ఒక చిన్న ఆఫ్రికా దేశం పుట్టుకొచ్చింది. ఆ ఏరియాలోకి వెళితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు. ఆఫ్రికన్ వంటలు, అనేక రుచులు అక్కడ రుచి చూడవచ్చు. ఇంతకీ ఆ ప్రాంతం ఏది?

హైదరాబాద్‌లో మినీ ఆఫ్రికా ఎక్కడుంది?
హైదరాబాద్ అనేక సంస్కృతులకు నిలయం. అయితే ఇప్పుడు భాగ్యనగరంలో ఒక ఆఫ్రికన్ ప్రాంతం పుట్టుకొచ్చింది. టోలిచౌకి పరిధిలోకి వెళ్తే మనం ఆఫ్రికాలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. అక్కడ ఉన్న పారామౌంట్ హిల్స్ కాలనీ, సన్‌సిటీ పరిసర ప్రాంతాలను ‘మినీ ఆఫ్రికా’ లేదా ‘ఆఫ్రికన్ కాలనీ’ అని పిలుస్తుంటారు. సొమాలియా, నైజీరియా, సూడాన్, ఉగాండా తదితర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వేలాది మంది విదేశీయులు ఇక్కడే జీవిస్తున్నారు. మన ఊరిలోనే ఉంటూ ఖండాంతర జీవనశైలిని పరిచయం చేస్తున్న ఈ ప్రాంతం నగరంలోనే అత్యంత విలక్షణమైన ప్రాంతంగా మారింది.
ఎందుకు ఈ ప్రాంతానికి వస్తున్నారు?
టోలిచౌకిలోని ఈ ప్రాంతానికి ఆఫ్రికా దేశస్థులు తరలిరావడానికి ఎన్నో కారణాలున్నాయి. హైదరాబాద్‌లో నాణ్యమైన ఉన్నత విద్య ఆఫ్రికన్లకు అందుబాటు ధరల్లోనే లభిస్తుంది. దీనికితోడు ప్రపంచ స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు తక్కువ ఖర్చుతోనే లభించడంతో వేలాది మంది విద్యార్థులు, రోగులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతపు వీధులు సరికొత్తగా కనిపిస్తాయి. ఆఫ్రికన్, అరబిక్, యూరోప్ సంస్కృతుల సమ్మేళనం ప్రతి అడుగులోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆఫ్రికన్ వస్త్రధారణలు, విదేశీ భాషలు, ఆఫ్రికన్ వంటలతో ఆ పరిసరాలు నిత్యం కళకళలాడుతుంటాయి.
రకరకాల వంటకాలు
ఈ కాలనీలలో లభించే విభిన్న వంటకాలు నగరవాసులను సైతం ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సొమాలియన్, అరేబియన్ రుచులను వడ్డించే హోటళ్లు, కేఫ్‌లు ఇక్కడ అడుగడుగునా దర్శనమిస్తాయి. ముఖ్యంగా 'తఫోషా కేఫ్'లో దొరికే అసలైన సొమాలియన్ వంటకాలు, ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ కాఫీ ఎంతోమందికి ఇష్టం. పారామౌంట్ కాలనీలోని 'మఖయాద్ అల్ అరబీ' రెస్టారెంట్ స్థానిక అరేబియన్ స్పెషల్స్‌కు ప్రధాన వేదికగా మారింది. విభిన్న సంస్కృతులను, సరికొత్త రుచులను ఒకేచోట అనుభవించాలనుకునే వారికి హైదరాబాద్‌లోని ఈ ఆఫ్రికన్ కాలనీకి వెళ్లండి.

