Banana: అరటిపండ్లతో పాటూ మిగతా పండ్లను కలిపి ఎందుకు ఉంచకూడదు?
Banana: ఇంట్లో ఒకే బుట్టలో అరటిపండ్లతో పాటూ ఇతర పండ్లను కూడా ఉంచుతున్నారా? అలా ఉంచడం వల్ల ఏ పండు కూడా తినడానికి వీల్లేకుండా మారుతుంది. అసలు అరటిపండ్లతో మిగతా పండ్లను కలిపి ఎందుకు ఉంచకూడదు.

అరటి పండ్లను ఇతర పండ్లతో కలపవద్దు
మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లన్నింటినీ ఒకే బుట్టలో పెడతారు ఎంతోమంది. కానీ అరటిపండ్లను ఆపిల్స్, జామ, బొప్పాయి వంటి ఇతర పండ్లతో కలిపి అస్సలు పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక కారణం కూడా ఉంది. అరటిపండ్లు పక్వానికి వచ్చే సహజ ప్రక్రియలో 'ఇథిలీన్' అనే వాయువును భారీ పరిమాణంలో గాల్లోకి విడుదల చేస్తాయి. ఈ వాయువు మొక్కలలో పండ్లు త్వరగా పండటానికి ఒక సహజ హార్మోన్‌లా పనిచేస్తుంది. దాంతో బుట్టలో అరటిపండ్ల పక్కన ఉన్న ఇతర పండ్లు కూడా ఆ వాయువు ప్రభావానికి గురై, సాధారణ సమయం కంటే ఎంతో వేగంగా పండిపోయి, క్షణాల్లో కుళ్లిపోతాయి. దీనివల్ల అన్ని పండ్లు ఒకేసారి కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
అరటిపండ్లకు అల్యూమినియం ఫాయిల్
పండ్ల బుట్టలోని మిగతా పండ్లను కాపాడుకోవాలంటే అరటిపండ్లను ఎప్పుడూ విడిగా ఉంచడమే సరైన మార్గం. ముఖ్యంగా అరటి గెల పైభాగం అంటే కాడలు లేదా తొడిమల భాగం నుంచే ఈ ఇథిలీన్ వాయువు ఎక్కువగా వెలువడుతుంది. అందుకే అరటిపండ్ల తొడిమలకు చిన్న ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్ పేపర్‌ను గట్టిగా చుట్టి ఉంచితే వాయువు బయటకు రాకుండా ఆగిపోతుంది. దీనివల్ల అరటిపండ్లు కూడా చాలా రోజుల పాటు నల్లబడకుండా, తాజాగా నిల్వ ఉంటాయి. అంతేకాకుండా వీటిని నేలపై లేదా ప్లేట్లలో పెట్టడం కంటే గాలి ఆడేలా స్టాండుకు వేలాడదీస్తే కింద ఒత్తిడి పడకుండా ఎక్కువ కాలం బాగుంటాయి.
ఫ్రిజ్ లో పెట్టకూడదు
చాలామంది పండ్లు పాడైపోతాయన్న భయంతో పచ్చి అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ పచ్చిగా ఉన్నప్పుడు ఫ్రిజ్‌లో పెడితే చల్లదనానికి వాటి సహజంగా పండవు. పండ్లు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే కావాలనుకుంటే ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. అలా పెట్టినప్పుడు పై తొక్క నల్లగా మారినా లోపలి గుజ్జు మాత్రం గట్టిగా, రుచిగా ఉంటుంది. కేవలం కాస్త జాగ్రత్త వహించి అరటిపండ్లను విడిగా పెడితే మిగతా పండ్లు వృథా కాకుండా కాపాడుకోవచ్చు

