- Home
- Feature
- Train: రైల్వేస్టేషన్లో రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లాలో లోకో పైలట్‌కు ఎలా తెలుస్తుంది?
Train: రైల్వేస్టేషన్లో రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లాలో లోకో పైలట్‌కు ఎలా తెలుస్తుంది?
Train: ఒక రైల్వే స్టేషన్లో ఎన్నో ప్లాట్ ఫామ్‌లు ఉంటాయి. అయితే రైలులో ఉన్న లోకో పైలెట్ కు ఏ ప్లాట్ ఫామ్ మీద రైలును ఆపాలో ఎలా తెలుస్తుంది. దాన్ని ఎవరు నిర్ణయిస్తారు?

రైల్వే ప్లాట్ ఫామ్ నిర్ణయం ఎవరిది?
రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఓ విషయం గమనించారా? ఎన్ని రైళ్లు వచ్చినా అవి ముందుగా నిర్ణయించిన ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లి ఆగుతుంటాయి. అయితే వేగంగా వస్తున్న రైలును ఏ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకెళ్లాలో లోకో పైలట్‌కు ఎలా తెలుస్తుంది? స్టేషన్‌కు దగ్గరగా వచ్చినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి చెబుతారా? లేక ముందుగానే సమాచారం ఇస్తారా? నిజానికి దీని వెనుక ఓ ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ పనిచేస్తుంది. లోకో పైలట్ తన ఇష్టానుసారం రైలును ఏ ప్లాట్ఫామ్పైకైనా తీసుకెళ్లలేరు. రైలు ఏ మార్గంలో వెళ్లాలి? ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆగాలి? అనే విషయాలను స్టేషన్‌లోని అధికారులు నిర్ణయిస్తారు. ఇందుకోసం రైల్వే శాఖ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ వల్ల రైళ్లు ఒకదానికొకటి ఎదురుపడకుండా, ఒకే పట్టాలపైకి తప్పుగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
అంతా స్టేషన్ మాస్టర్ నిర్ణయమే
రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లాలనే నిర్ణయంలో స్టేషన్ మాస్టర్ కీలక పాత్ర పోషిస్తారు. ఆయన గదిలో ప్రత్యేక కంప్యూటర్ తెర ఉంటుంది. దీన్ని ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ అంటారు. స్టేషన్‌లోని అన్ని పట్టాలు, ప్లాట్‌ఫామ్‌లు, రైళ్ల కదలికలు ఇందులో కనిపిస్తాయి. రైలు స్టేషన్‌కు దగ్గరగా రాగానే ఏ ప్లాట్‌ఫామ్ ఖాళీగా ఉందో అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా రైలుకు వెళ్లాల్సిన మార్గాన్ని నిర్ణయిస్తారు. వెంటనే పట్టాలు కలిసే చోట ఉండే పాయింట్లు అవసరమైన దిశలో మారతాయి. దీంతో రైలు వెళ్లాల్సిన మార్గం సిద్ధమవుతుంది. ఈ సమయంలో హోమ్ సిగ్నల్ ద్వారా లోకో పైలట్‌కు సమాచారం అందుతుంది. సిగ్నల్‌లో కనిపించే రంగులు, రూట్ ఇండికేటర్లో వెలిగే లైట్లను బట్టి ముందున్న మార్గం గురించి పైలట్ తెలుసుకుంటారు. అవసరమైతే రైలు వేగాన్ని తగ్గించి నిర్దేశించిన మార్గంలో ముందుకు వెళ్తారు.
లోకో పైలట్ కు ఎలా తెలుస్తుంది?
అయితే లోకో పైలట్‌కు కేవలం సిగ్నల్స్ ఆధారంగానే సమాచారం అందదు. తాను వెళ్లే మార్గంపై ముందుగానే ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. దీన్ని రోడ్ లెర్నింగ్ అంటారు. ఏ స్టేషన్లో ఎక్కడ సిగ్నల్ ఉంటుంది? ఎక్కడ పట్టాలు మలుపు తిరుగుతాయి? ఏ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లాలంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇక రైలు ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న తర్వాత సరైన చోట ఆపడానికి ప్రత్యేక స్టాపింగ్ బోర్డులు ఉంటాయి. వాటిపై 12, 18, 24 కోచ్‌లు అని రాసి ఉంటుంది. రైలులో ఉన్న బోగీల సంఖ్యను బట్టి లోకో పైలట్ ఆ బోర్డు దగ్గర రైలును ఆపుతారు. ఇలా సిగ్నల్స్, కంప్యూటర్ వ్యవస్థ, పట్టాల పాయింట్లు, లోకో పైలట్ శిక్షణ కలిపి రైళ్లు సరైన ప్లాట్‌ఫామ్‌పైకి చేరేలా చేస్తాయి. ప్రయాణికుల భద్రతలో ఈ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేస్తుంది.





